‘ఇప్పుడు ఎక్కడ చూసినా కిరాణా షాపుల్లో గంజాయి దొరుకుతోంది. దానికి కారణం వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులే’ ఇటీవల ప్రజాగళం సభలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి మాటలివి.
చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రూ.40 వేల కోట్ల విలువైన గంజాయిని ధ్వంసం చేయించాం. ఎక్కడుందో గుర్తించి అంతా నిర్మూలించామని లోకేశ్ ఆనాడు యువగళం పాదయాత్రలో అన్నాడు. ఇప్పటి ప్రభుత్వం గంజాయిని ప్రోత్సహిస్తోందని, స్వయంగా వైఎస్సార్సీపీ నాయకులు సాగు చేసి అమ్ముతున్నారని ఆరోపించారు. కానీ ఇదంతా నిజం కాదు.
ప్రభుత్వ రికార్డులు పరిశీలిస్తే చంద్రబాబు, లోకేశ్‌లు అబద్ధాలు చెబుతున్నారని ఎట్టే తెలిసిపోతుంది. టీడీపీ హయాంలో గంజాయి విషయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. 2014లో బాబు సీఎం అయ్యాక గంజాయి సాగు, రవాణా, నిల్వ తదితర అంశాల్లో నమోదైన కేసులు 1,364. పట్టుకున్న నిందితులు 1,845 మంది. సీజ్ చేసిన సరుకు 1,250 క్వింటాలు. స్వాధీనం చేసుకున్న వాహనాలు 397. సాక్షాధారాలు చూపకుండా నాశనం చేశామని చెబుతున్న పంట 17,660 టన్నులు.
వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక గంజాయిపై ఉక్కుపాదం మోపారు. 2023 మార్చి వరకు 4,846 కేసులు పెట్టారు. పట్టుబడిన నిందితులు 12,872 మంది. సీజ్ చేసిన మొత్తం 4,466 క్వింటాలు. స్వాధీనం చేసుకున్న వాహనాలు 2,784. ఈ ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్, సాగుదారుల్లో పరివర్తన తెచ్చి.. మీడియా ఎదురుగా సాక్షాధారాలతో ధ్వంసం చేసిన పంట 37,727, టన్నులు. 2024ను పరిగణలోకి తీసుకుంటే ఈ సంఖ్యలు ఇంకా పెరిగి ఉంటాయి.
కానీ తండ్రీకొడుకులు కొంతకాలంగా ఎల్లో మీడియా ద్వారా అబద్ధాలు ప్రచారం చేస్తూనే ఉన్నారు. టీడీపీ హయాంలో విచ్చలవిడిగా సాగు జరిగింది. ఇది నిజం. తెలుగు తమ్ముళ్లే పొట్లాలు కట్టి అమ్మకాలు సాగించారు. ఇతర రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక పట్టుబడిన వారిలో చాలామంది టీడీపీ నాయకులే ఉన్నారు. కానీ నేడు చంద్రబాబు ఆర్యవైశుల్ని అవమానించేలా మాట్లాడాడు. జగన్ ఉక్కుపాదం మోపితే వైఎస్సార్సీపీ నాయకులు కిరాణా దుకాణాల్లో పెట్టి అమ్మిస్తున్నారని ఎన్నికల సభలో అన్నారు. రాష్ట్రంలో చాలా వరకు కిరాణా షాపులను వైశ్యులే నిర్వహిస్తున్నారు. వారిని మాదక ద్రవ్యాలు విక్రయించే వారిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు టీడీపీ అధినేత.
అసలు నాడు ఎక్కడికక్కడ గంజాయి దొరకడానికి దోహదపడింది చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశే. దాని ద్వారా వేల కోట్ల రూపాయలు సంపాదించారు. జగన్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను ఏర్పాటు చేసి చర్యలు తీసుకునే సరికి తమ ఆదాయం పడిపోయిందని ఇలా బురద చల్లుతున్నారు. కిరాణా షాపుల్లో గంజాయి అమ్ముతున్నారంటూ తమపై అభాండాలు వేసిన చంద్రబాబు వెంటనే క్షమాపణలు చెప్పాలని ఆర్యవైశ్యులు కోరుతున్నారు.