ఐటీ రంగంలో దూసుకుపోతున్న విశాఖ నగరంలో మరో దిగ్గజ సంస్థ కొలువుదీరనుంది. ఇప్పటికే ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ సంస్థలు విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించిన నేపథ్యంలో మరిన్ని కీలక సాఫ్ట్వేర్ సంస్థలు అదే బాటలో అడుగులు వేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఐటీ సంస్థలకు అందిస్తున్న ప్రోత్సాహకాలు, బీచ్ ఐటీ కాన్సెప్ట్‌తో ఆకర్షితులైన సంస్థలు విశాఖ వైపు దృష్టిసారిస్తున్నాయి.
కేప్ జెమినీ సంస్థ కూడా అదే దారిలో పయనిస్తోంది. దీనికి సంబంధించి ఉద్యోగుల మధ్య ఆ సంస్థ సర్వే నిర్వహించగా ఎక్కువమంది విశాఖను ఎంపిక చేసుకోవడం గమనార్హం. రెండు నెలల క్రితం సంస్థ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు. త్వరలోనే ఈ సంస్థ విశాఖలో ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ఏపీలో 300 వరకు ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్నాయి, ఏటా 1,20,000 మంది వివిధ కోర్సులు పూర్తి చేసుకుని బయటికి వస్తున్న విషయం తెలిసిందే, ఇక్కడ ఇంజినీరింగ్ కాలేజీల్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంపై విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు, అమెరికాలోని వివిధ టెక్ కంపెనీలలో పని చేస్తున్న ప్రతి నలుగురిలో ఒక తెలుగువాడు ఉంటున్నాడు, స్టార్టప్స్‌లోనూ తెలుగు విద్యార్థులు బాగా రాణిస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం బీచ్ ఐటీ కారిడార్‌ని అభివృద్ధి చేస్తుంది, విశాఖలో ప్రస్తుతం ఐటీ, ఐటీఈఎస్ సంస్థలు 150 వరకు నడుస్తున్నాయి. రానున్న రోజుల్లో విశాఖలో మరిన్ని ఐటీ సంస్థలు ఏర్పాటుకు ముందుకొస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. భవిష్యత్తులో విశాఖ ఐటీ రంగంలో హైదరాబాద్ తో పోటీపడే స్థాయిలోకి వస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.