సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జూన్ 4వ తేదీన ఓట్లు లెక్కింపు ప్రారంభం కానుంది, ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ నిర్వహించేందుకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు అధికారులు. ఈ క్రమంలో కౌంటింగ్ రోజున వివిధ పార్టీల ఏజెంట్లు సైతం కీలక పాత్ర పోషించనున్నారు. ఏజెంట్లకు నిబంధనలపై అవగాహన కలిగేలా ఆయా పార్టీ నేతలు సూచనలు చేస్తున్నారు
ఎన్నికల లెక్కింపు ప్రక్రియలో ఫారమ్–17సీ, ఫారమ్–17సీ పార్ట్–2 లు ఎంతో కీలకమైనవి, ప్రతి కౌంటింగ్ ఏజెంట్, పరిశీలకులు, సహాయ పరిశీలకులు దీనిపై అవగాహన కలిగి ఉండాలి. కంట్రోల్ యూనిట్లో నమోదైన మొత్తం ఓట్లు, ఫారమ్–17సీలో పొందుపరిచిన మొత్తం ఓట్లు సరిపోల్చి చూసుకోవాలి. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గం నంబర్, పోలింగ్ కేంద్రం పేరు, అక్కడ వినియోగించిన కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్ల గుర్తింపు నంబర్లను ఆ ఫారమ్లోనే నమోదు చేస్తారు.
ఆ పోలింగ్ కేంద్రం పరిధిలోని ఓటర్ల సంఖ్య, ఓటు వేయడానికి వచ్చిన వారి సంఖ్య, పోలింగ్ కేంద్రంలోకి వచ్చాక ఓటు వేయడానికి నిరాకరించి వెళ్లిపోయిన వారు, ఓటింగ్ యంత్రంలో నమోదైన మొత్తం ఓట్ల సంఖ్య ఫారమ్–17సీలో ఉంటాయి. టెండర్ బ్యాలెట్లు, సరఫరా చేసిన పేపర్ సీళ్లు (ఓటరుకు పోలింగ్ కేంద్రంలో ఇచ్చే రెండు రంగుల స్లిప్‌లు), సీరియల్ నంబర్లు, ఎన్ని పేపర్లు వినియోగించారు, వినియోగించని పేపర్ సీళ్లు ఎన్ని తిరిగి రిటర్నింగ్ అధికారికి వెళ్లాయి, పాడైపోయిన పేపర్ సీళ్లు, సీరియల్ నంబర్ల వంటి వివరాలు ఇందులో ఉంటాయి.
కౌంటింగ్ సమయంలో టేబుల్ వద్దకు కంట్రోల్ యూనిట్‌తో పాటు ఫారమ్–17సీ లోని వివరాలను ఏజెంట్లు తప్పనిసరిగా రాసుకోవాలి. కంట్రోల్ యూనిట్ డిస్ప్లే సెక్షన్లో చూసిన పోలైన మొత్తం ఓట్లు, ఫారమ్–17సీలో నమోదు చేసిన ఓట్ల సంఖ్య సమానంగా ఉండాలి. క్లరికల్ తప్పిదం, మరో కారణంతో కానీ కంట్రోల్ యూనిట్ ఫారమ్–17సీ లో ఓట్ల సంఖ్యలో తేడా వస్తే అది వివాదాస్పదంగా మారుతుంది. అలాంటి కంట్రోల్ యూనిట్లను రిటర్నింగ్ అధికారి పక్కన ఉంచి ఎన్నికల కమిషన్‌కు సమాచారం అందిస్తారు. కంట్రోల్ యూనిట్ టేబుల్ పైకి రాగానే ఏజెంట్ల పరిశీలనకు ఉంచుతారు. ఆ కంట్రోల్ యూనిట్ ఏ పోలింగ్ కేంద్రానికి చెందినదో ఏజెంట్లు నిర్ధారించుకోవాల్సి ఉంటుంది.
కౌంటింగ్ ఒక రౌండ్ పూర్తయిన వెంటనే అందులోని రెండు కంట్రోల్ యూనిట్లను జనరల్ పరిశీలకులు తన టేబుల్ వద్దకు తెప్పించుకుంటారు. అదనపు పరిశీలకులతో ఓట్లు లెక్కిస్తారు. కంట్రోల్ యూనిట్‌లోని ఓట్ల సంఖ్యకు ఫారమ్–17సీ, పార్టు–2లో కౌంటింగ్ సూపర్వైజర్ నమోదు చేసిన ఓట్ల సంఖ్యకు సమానంగా ఉంటే ఇబ్బంది లేదు. ఒకవేళ ఏదైనా తేడా వస్తే పరిశీలకుడు తనిఖీ చేసిన మిగిలిన కంట్రోల్ యూనిట్లన్నిటినీ జనరల్ అబ్జర్వర్ మరోసారి లెక్కిస్తారు. అసాధారణంగా ఇద్దరు అభ్యర్థులకు కౌంటింగ్ ఓట్లు సమానంగా వస్తే ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం రిటర్నింగ్ అధికారి లాటరీ ద్వారా ఫలితం ప్రకటిస్తారు.