రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరుపై ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో వేటిని ఆమోదించాలి, వేటిని తిరస్కరించాలని స్పష్టమైన నిబంధనలు కేంద్ర ఎన్నికల సంఘం తన నిబంధనల పుస్తకంలో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ వాటిని సవరిస్తూ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టుగా మారనున్నాయి అని వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు,. కేంద్ర ఎన్నికల సంఘం తాజా సవరణల వల్ల దొంగ ఓట్లకు ఆస్కారం కల్పించడమే కాకుండా నిజమైన ఓట్లు చెల్లకుండా పోయే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు
కేంద్ర ఎన్నికల సంఘ నిబంధనల్లో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకుంటున్న ఓటరు తన వివరాలు, బ్యాలెట్ నంబర్‌తో డిక్లరేషన్ ఫాం13ఏ సమర్పించాలని, ఈ ఓటరు తనకు తెలుసని ఒక గెజిటెడ్ అధికారి ధృవీకరించి సంతకం చేస్తూ.. పొడి అక్షరాలతో ఆ అధికారి పేరు, హోదా వివరాలు, చిరునామాతో పాటు సీల్ వేయాలని స్పష్టంగా ఉంది. మన రాష్ట్రం విషయానికి వస్తే గెజిటెడ్ అధికారి సంతకం ఉండి, అధికారి హోదా వివరాలు లేదా సీల్.. ఏదో ఒకటి ఉన్నా.. ఆ ఓట్లను పరిగణనలోకి తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా టీడీపీ అడిగిన వెంటనే మోమో జారీ చేయడం తెలిసిందే. వీటిని సవాలు చేస్తూ వైసీపీ ఎంపీ హైకోర్టు ను ఆశ్రయించగా ఆ మెమో ని విత్ డ్రా చేసుకుంటున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు తెలిపింది.
అయితే ఆ మెమో పై సవరణ చేస్తూ పోస్టల్ బ్యాలట్ ఓట్ల లెక్కింపు సమయంలో ఓటరు డిక్లరేషన్‌కు సంబంధించిన ‘ఫారం- 13ఏ’పై అటెస్టింగ్ అధికారి పేరు, హోదా, సీలు లేకపోయినా పర్వాలేదు, ఆ అధికారి సంతకం ఉంటే చాలు వాటిని పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం గురువారం మరో ఉత్తర్వులను ఇచ్చింది,ఈ ఉత్తర్వులు పై కూడా సవాలు చేస్తూ వైకాపా ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో అనుబంధ పిటిషన్ వేశారు.
ఈసీ ఇచ్చిన మార్గదర్శకాలకు భిన్నంగా రాష్ట్ర సీఈఓ జారీ చేసిన ఉత్తర్వులున్నాయన్నారు. పోస్టల్ బ్యాలట్‌పై అటెస్టేషన్ లేకపోతే వాటిని తిరస్కరించడం తప్ప వేరే మార్గం లేదన్నారు. చెల్లని ఓట్లను పరిగణనలోకి తీసుకోవాలన్నట్లు సీఈఓ ఉత్తర్వులున్నాయన్నారు. మెమోల అమలును నిలుపుదల చేయాలని అప్పిరెడ్డి తరపు న్యాయవాదులు ధర్మాసనాన్ని కోరారు.
పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ల వద్ద ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన అటెస్టింగ్ ఆఫీసర్లు కొంత మంది సీల్ వేయకుండా కేవలం సంతకాలు మాత్రమే చేసారు, ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని తమ ఓట్లను తిరస్కరించకుండా ఆమోదించేలా చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ నుంచి ఇలా అభ్యర్ధనలు రాగానే ఎన్నికల సంఘం వెంటనే పలు నిర్ణయాలు తీసుకుంటూ మొత్తం పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియనే పూర్తి గందరగోళంగా మార్చింది. టీడీపీ ఫిర్యాదు చేయగానే ముఖేష్ కుమార్ మీనా ఈ నెల 25న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం డిక్లరేషన్ ఫారం మీద అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం, పేరు, హోదా (డిజిగ్నేషన్) పూర్తి వివరాలు తప్పనిసరిగా ఉండాలని.. ఇవి ఉండి స్టాంప్ లేకపోయినా వాటిని పరిగణనలోకి తీసుకోవచ్చని ఉంది.
ఒకవేళ ఏమైనా అనుమానం వస్తే దాన్ని రిటర్నింగ్ ఆఫీసర్, జిల్లా ఎన్నికల అధికారి వద్ద ఉన్న సంబంధిత అటెస్టింగ్ ఆఫీసర్ సంతకంతో సరిపోల్చుకుని పోస్టల్ బ్యాలెట్‌ను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. తాజాగా గురువారం కేంద్ర ఎన్నికల సంఘం మీనాకు రాసిన లేఖలో మరో ముందడుగు వేసి అటెస్టింగ్ ఆఫీసర్ సీల్ వేయకపోయినా, అతని హోదా వివరాలు లేకపోయినా సంతకం ఉంటే చాలు అని పేర్కొంది. ఎవరి ప్రయోజనాల కోసం ఎన్నికల సంఘం ఇలాంటి గందరగోళ నిర్ణయాలు తీసుకుంటోందని పలువురు ప్రశ్నిస్తున్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పటి నుంచో అనుసరిస్తున్న నిబంధనలను ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే సడలింపునిస్తూ సీఈవో ఆదేశాలు జారీ చేయడమే విడ్డూరమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈసీ మరో అడుగు ముందుకేసి వివరాలు రాయకపోయినా, సీల్ వేయకపోయినా పోస్టల్ బ్యాలెట్‌ను పరిగణనలోకి తీసుకోవాలనడం తొలి నుంచి ఈసీ నిష్పాక్షికతపై వ్యక్తమవుతున్న అనుమానాలకు మరింత బలం చేకూర్చినట్లయిందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.