నైరుతి రుతు పవనాలు శర వేగంగా విస్తరిస్తూ వస్తున్నాయి. ఈరోజు ఉదయం కేరళను తాకాయి. కేరళ సహా ఈశాన్య రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. వారం రోజుల్లో తెలుగు రాష్టాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. దీంతో గతేడాది కంటే ముందుగానే నైరుతి పవనాలు రాష్ట్రాలను తాకనున్నట్టు తెలుస్తుంది, ఇప్పటికే కేరళ వ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి.
ప్రస్తుతం రోహిణీ కార్తె ప్రభావం వల్ల రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి బుధవారం పలుచోట్ల 42 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పార్వతీపురం మన్యం జిల్లా పోయిమలలో అత్యధికంగా 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత కాగా పల్నాడు జిల్లా చిరుమామిళ్లలో 42.5, గరికపాడులో 42 డిగ్రీలు, విజయవాడలో 39.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వచ్చే రెండు రోజులు కూడా వాతావరణం ఈ మాదిరిగానే ఉండవచ్చని వాతావరణ శాఖాధికారులు తెలిపారు.
అయితే నాలుగైదు రోజుల్లో రుతుపవనాలు రాయలసీమలోకి ప్రవేశించే అవకాశం ఉంది, ఇప్పటికే నైరుతి రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రంలోని ఎక్కువ ప్రాంతాలు, మాల్దీవులు, కొమోరిన్ ప్రాంతాల్లో విస్తరించాయి. లక్షద్వీప్‌లోని కొన్ని ప్రాంతాలు, కేరళ, మరికొన్ని భాగాలు నైరుతి, మధ్య బంగాళాఖాతం, ఈశాన్య బంగాళాఖాతం, ఈశాన్య రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాల్లోకి విస్తరిస్తున్నాయి, కాగా వారం ముందుగానే రుతుపవనాలు పురోగమిస్తుండడంతో ఈ సీజన్లో సమృద్ధిగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.