ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 సార్వత్రిక ఎన్నికలు ఎంత ఉత్కంఠను రేకెత్తిస్తూ జరిగాయో, అంతకుమించిన ఆశక్తిని కలిగించింది పిఠాపురం నియోజకవర్గ పోటీ… దానికి కారణం పిఠాపురం నియోజకవర్గ నుండి కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడం ఒక కారణమైతే… అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి పిఠాపురం నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా గతంలో జిల్లా పరిషత్ చైర్మన్ గా శాసనసభ సభ్యురాలుగా విశేష సేవలు అందించి, ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యురాలుగా ఉన్న వంగా గీత పోటీలో ఉండడం మరొక కారణం.
అయితే గతంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో భీమవరం, గాజువాక రెండు చోట్ల పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ అనేక తర్జనభర్జణ తర్వాత పిఠాపురం ఎంచుకుని అక్కడ నుండి బరిలో దిగడం, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక మహిళ పోటీలో నిలబడటం సర్వత్ర ఆసక్తిని రేకెత్తించింది. ఈ దశలో పవన్ కళ్యాణ్ స్వయంగా తన గెలిపు మీ చేతుల్లో పెడుతున్నాను అంటూ వర్మను ఆ వేదిక మీదే బ్రతిమిలాడుకోవడం పవన్ కళ్యాణ్ కి ఈ గెలుపు ఎంత కీలకమో చెప్పకనే చెప్తుంది. అయితే పవన్ కళ్యాణ్ తన చరిష్మాను నాయకత్వాన్ని కాకుండా కేవలం సామాజిక వర్గపు ఓట్లను మాత్రమే దృష్టిలో పెట్టుకుని కాపు నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు అంటూ విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో హోరాహోరీగా సాగిన ఎన్నికల అనంతరం ఆయా పార్టీల అధినేతలు నాయకులు కాస్త ఆటవిడుపు కోసం విహారయాత్రలకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై యస్ జగన్ కుటుంబ సమేతంగా లండన్ వెళ్ళగా ప్రతిపక్ష పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు నిన్ననే అమెరికా నుంచి తిరిగి వచ్చిన పరిస్థితి. అలాగే ఆయా పార్టీల దిగువ స్థాయి నాయకులు కూడా తమ తమ పరిధిలో విహారయాత్రకు వెళ్లినటువంటి సందర్భాలు రాష్ట్రంలో ఉన్నాయి. ఎన్నికలకు ఫలితాలు వెల్లడికి మధ్య ఎక్కువ సమయం ఉండడంతో పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు ఆయా పరిధిలో ఉన్నటువంటి పార్టీల నాయకులందరూ కూడా కాస్త ఆటవిడుపు కోసం బయటకు వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి.
అయితే పవన్ కళ్యాణ్ గెలుపుకు నాది పూచి అని చెప్పిన వర్మ ఎన్నికల అనంతరం ఎక్కడికి వెళ్లకపోగా పిఠాపురం రాజకీయాలపై పవన్ కళ్యాణ్ గెలుపు పై విశ్లేషణలు చేస్తూ మీడియా డిబేట్లకు పరిమితమయ్యారు. ఇక్కడే జనసైనికుల మనసుల్లో ఎక్కడో తెలియని సందేహం మొదలైంది. నిజంగా పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశం ఉందా… ఉంటే అందరి నాయకుల్లా వర్మ కూడా రిలాక్స్డ్ గా ఉండకుండా ఎందుకు ఉపన్యాసాలతో ఊదరగొడుతున్నారు లేకపోతే వర్మ దగ్గరుండి దెబ్బ కొట్టి దానికి కప్పిపుచ్చుకోవడం కోసం ఇలా మీడియా డిబేట్లతో కవర్ చేస్తున్నారా అంటూ జనసేన పార్టీ కార్యకర్తల నుంచి సందేహాలు వ్యక్తం అవటం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వర్మ పవన్ కళ్యాణ్ ను నిజంగాన్నే బుజాన్న మొసారా లేక పుట్టి ముంచారా అన్నది రేపటి ఫలితాల్లో తేలనున్న అంశం.