వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరికలు వెల్లువలా కొనసాగుతున్నాయి. మేమంతా సిద్ధం బస్సు యాత్ర విశాఖపట్నం జిల్లాలో కొనసాగుతోంది. ఎండాడ ఎంవీవీ సిటీ నైట్ స్టే పాయింట్ నుంచి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 21వ రోజు యాత్ర మంగళవారం మొదలైంది. తొలుత భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన నుంచి పలువురు కీలక నేతలు వైఎస్సార్సీపీలో చేరారు. గాజువాక నియోజకవర్గం నుంచి మాజీ మేయర్, బీజేపీ నాయకుడు పులుసు జనార్దనరావు, 65వ వార్డు అధ్యక్షుడు వీఎస్ ప్రకాష్‌రావు, ఉపాధ్యక్షుడు కర్రి గోవింద్, తప్పాల అప్పారావు, కార్యదర్శి గొల్లపల్లి గోవింద్, వరప్రసాదరెడ్డి, సంపత్ కుమార్, టీడీపీ నుంచి యువజన విభాగం నేత ఏఎన్ఆర్ పార్టీలో చేరగా వారికి జగన్ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అండగా ఉంటానని భరోసానిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థ్ధి గుడివాడ అమర్నాథ్, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
తొలుతస్టే పాయింట్ వద్దకు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. జగన్ అందరిని పేరుపేరునా పలకరించి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఎన్నికల విషయాలపై చర్చించారు. అనంతరం బస్సు యాత్ర మొదలైంది. మధురవాడలోని వైఎస్సార్ స్టేడియం వద్దకు చేరుకున్న సీఎంకు జనం ఘన స్వాగతం పలికారు. ఎండలను సైతం లెక్క చేయకుండా ప్రజలు పెద్ద ఎత్తున విచ్చేశారు. ఉత్తరాంధ్ర సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. దారి పొడవునా పార్టీ శ్రేణులు బ్రహ్మరథం పట్టాయి. మొత్తంగా ఓ వైపు చేరికలు.. మరో వైపు ప్రజల ఘన స్వాగతాల నడుమ మేమంతా సిద్ధం యాత్ర రాష్ట్రంలో హాట్‌టాపిక్ అయ్యింది.