‘ఓ లంచాల బాబు.. ఓ జన్మభూమి కమిటీల బాబు.. నీ పాలనలో ఏముందయ్యా గర్వకారణం చెప్పవయ్యా చంద్రబాబూ.. చెప్పవయ్యా.. ఏనాడైనా ప్రజలకు మంచి చేశావా?’ అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నించారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా అనకాపల్లి జిల్లా చింతపాళెంలో జరిగిన భారీ బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు.
రాష్ట్ర చరిత్రను నిర్ణయించే ఎన్నికలుగా ఇవి ఎప్పటికీ గుర్తుండి పోతాయి. ఇవి కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేవి మాత్రమే కావు. వచ్చే 5 ఏళ్లు పేదల భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు. మనం మంచి చేసి ప్రజల మనసు గెలిచాం. చేసిన మంచి ఏదీ లేక మోసాలు, కుట్రలు, అబద్ధాలు, పొత్తులతో కూటమిగా వారు. అది చేస్తాం, ఇది చేస్తామంటూ మళ్లీ భ్రమలు కల్పిస్తున్న అన్యాయస్తులను ఓడించేందుకు మీరంతా సిద్ధమేనా? జగన్‌ను ఓడించాలని వారు.. పేదల్ని గెలిపించాలని మనం. సిద్ధం సభలను చూసి ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. చంద్రబాబు ఉక్రోశంతో నా మీద రాళ్లు వేయమంటున్నాడు. నన్ను దగ్ధం చేస్తానంటున్నాడు. దోచుకోవడానికి, దోచుకున్నది పంచుకోవడానికి వాళ్లకు అధికారం కావాలట. ఈ మధ్య బాబు జగన్ ఒక బచ్చా అంటున్నాడు. విలన్లందరికీ హీరోలు బచ్చాలుగానే కనిపిస్తుంటారు. అయ్యా చంద్రబాబూ.. నేను ప్రజలకు మంచి చేసి ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నా. 14 ఏళ్లు సీఎంగా చేశావు కదా.. పేదలకు నువ్వు చేసిన మంచి ఉంటే ఈ బచ్చాను చూసి భయపడుతూ పొత్తుల కోసం ఎగబడుతున్నావు. ఈ 75 ఏళ్ల వయసులో నువ్వు పదిమందిని ఎందుకు పోగేసుకోవాల్సి వస్తోంది. మీ బిడ్డ ఒక్కడి చుట్టూ ఎంత మంది బాణాలు పట్టుకుని ఉన్నారో గమనించమని కోరుతున్నాను.
నేను బచ్చా అయితే నా చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోయి కేవలం 23 మంది ఎమ్మెల్యేలను మాత్రమే గెలిపించుకున్న నువ్వు ఎవరయ్యా?. ఓ బాబూ నిన్నే అడుగుతున్నాను. నేను బచ్చా అయితే ఐదేళ్ల తర్వాత కూడా నాతో పోటీకి ఒక్కడివే రావడానికి నీకు ధైర్యం చాలడం లేదు. అరడజను మందిని వెనకేసుకుని వస్తున్న నిన్నే ఏమనాలి. నేను బచ్చా అయితే ఈ ఐదేళ్లలో రైతులకు, పేదలకు, అక్కచెల్లెమ్మలకు, పిల్లలకు, అవ్వాతాతలకు, వివిధ సామాజికవర్గాలకు, నేను చేసిన మంచిని నువ్వు 14 ఏళ్లు సీఎంగా ఉన్నా కూడా ఎందుకు చేయలేకపోయావు. మీ బిడ్డ ఈరోజు గర్వంగా చెబుతున్నాడు. ఈ 58 నెలల కాంలో ఏకంగా 2.70 లక్షల కోట్లు నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోనే వేశాను. 31 లక్షల ఇళ్ల పట్టాలిచ్చాం. 22 లక్షల ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతోంది. గతంలో ఎప్పుడైనా ఇంతగా పట్టించుకున్న ప్రభుత్వాన్ని చూశారా..
ప్రతి నెలా ఒకటో తేదీనే ఇంటికే వచ్చే రూ.3 వేల పెన్షన్. ఇలా గతంలో ఎప్పుడైనా జరిగిందా? అమ్మఒడి అనే పథకాన్ని గతంలో వచ్చిందా? ఆసరా, సున్నా వడ్డీ, చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తం చూశారా? పెద్ద చదువులు చదువుతున్న పిల్లలకు అండగా ఉన్నాం. వంద శాతం పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నాం. వసతి దీవెన, విద్యాదీవెన వంటి పథకాలు ఎప్పుడైనా మీరు చూశారా? ఇవి ఎప్పుడైనా చేశావా చంద్రబాబూ.. రైతు భరోసా, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, వాహన మిత్ర, చేదోడు, తోడు, లా నేస్తం వంటి పథకాలు ఎప్పుడైనా చూశారా? మీ బిడ్డ ప్రతి గ్రామంలోనూ గతంలో ఎప్పుడూ జరగనట్టుగా 7 వ్యవస్థలు తీసుకొచ్చాడు. గ్రామ, వార్డు సచివాయాలు తీసుకొచ్చింది మీ జగన్. ఇంటికే వచ్చే వలంటీర్ల వ్యవస్థ ఎవరు తీసుకొచ్చారంటే మీ జగన్. విలేజ్ అండ్ వార్డు అర్బన్ హెల్త్ క్లినిక్స్ కనిపిస్తున్నాయి. ప్రతి గ్రామంలోనూ మహిళా పోలీసులు కనిపిస్తున్నారు. ఇంగ్లిష్ మీడియం స్కూలు కనిపిస్తోంది. మీ బిడ్డ రాక ముందు, వచ్చిన తర్వాత ఎంత వ్యత్యాసం ఉందో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతున్నాను.
ప్రతి కుటుంబం ఎదగాలి. పేదరికం నుంచి బయట పడాలి. విద్యా విప్లవాన్ని ఈరోజు మీ బిడ్డ తీసుకొస్తుంటే చంద్రబాబు ఇంగ్లిష్ మీడియం వద్దంటాడు. ఏకంగా ఉద్యమాలు చేయించాడు. ఆరోగ్యశ్రీ ద్వారా అండగా నిలిచాం. కొత్తగా మెడికల్ కాలేజీల నిర్మాణం వేగంగా జరుగుతున్నాయి. ఏకంగా 54 వేల డాక్టర్లు, నర్సుల నియామకాలు చేశాం. ఇలాంటి ఆరోగ్యకరమైన ఆలోచనలు ఏరోజైనా చంద్రబాబు చేశాడా. వేగంగా 4 కొత్త సీ పోర్టులు నిర్మాణం జరుగుతున్నాయి. ఇందులో ఒకటి మన ఉత్తరాంధ్రలో, మన మూలపేటలో వేగంగా అడుగులు వేస్తూ కనిపిస్తోంది. కొత్తగా 10 ఫిషింగ్ హార్బర్లు వేగంగా నిర్మాణంలో ఉన్నాయి. 6 కొత్త ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ఈరోజు వేగంగా పనులు జరుగుతున్నాయి. రూ.లక్ష కోట్ల పెట్టుబడులు, ఎయిర్ పోర్టుల విస్తరణ కొత్తగా వేగంగా మన కళ్ల ఎదుటే కనిపిస్తోంది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు పనులు జరుగుతున్నాయి. కొత్తగా రాష్ట్రంలో 2 ఇండస్ట్రియల్ కారిడార్లు, 10 ఇండస్ట్రియల్ నాడ్స్ వస్తున్నాయి. చంద్రబాబు పేరు చెబితే ఇవేవీ గుర్తుకురావు. ప్రజలకు చేసిన మంచి గుర్తుకురాదు.
జగన్ ఉంటే పేదలకు పథకాలన్నీ కొనసాగుతాయి. లేకపోతే మళ్లీ ప్రజలు మోసపోయి పథకాలన్నింటికీ కూడా ముగింపే. కేవలం రంగు రంగుల మోసపూరిత వాగ్దానాలు, మేనిఫెస్టోలు చూసి ఓటు వేస్తారా? లేక జరిగిన మంచిని చూసి ఓటు వేస్తారా? ఆలోచన చేయమని కోరుతున్నాను. 2014లోనూ కూటమిగా వచ్చి మోసం చేశారు. రైతులకు, పొదుపు మహిళలకు రుణమాఫీ చేయలేదు. ఇంటికో ఉద్యోగం ఇవ్వలేదు. సెంటు స్థలం ఇచ్చిన దాఖలాల్లేవు. ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. నిర్మించాడా? మన అనకాపల్లిలో ఏమైనా కనిపిస్తోందా? పోనీ ప్రత్యేక హోదా ఏమైనా తెచ్చారా? అదీ లేదు. ఆలోచన చేయమని అడుగుతున్నా.