2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎప్పుడెప్పుడా ప్రజానీకం ఎదురు చూస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీమేనిఫెస్టోను మరో రెండు రోజుల్లో ఆ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విడుదల చేస్తారని రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడారు. మేనిఫెస్టోను జగన్ భగవద్గీతలా, ఖురాన్లా, బైబిల్లా భావిస్తారనే విషయం ప్రజలందరికీ తెలుసు. తుదిమెరుగులు పూర్తి అయ్యాయి. గతం కంటే ఎక్కువగా సంక్షేమ పథకాలు అందిస్తాం. రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తాం.
2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు నవరత్నాలంటూ ఒక మేనిఫెస్టోని తీసుకురావడం, నూటికి 99 శాతం నెరవేర్చడాన్ని ప్రజలందరూ చూశారు. జగనన్న అమ్మఒడి, వైఎస్ఆర్ చేయూత, నాడు – నేడు, విద్యా దీవెన, ఆసరా, జగనన్న తోడు, రైతు భరోసా, డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ వంటి పథకాలను పూర్తిస్థాయిలో నెరవేర్చాం, ముఖ్యమంత్రి జగన్ ప్రతి పథకాన్ని అర్హులకు అందించారు. కులమతాలు, రాజకీయ పార్టీలు చూడలేదు. ప్రతి కుటుంబం లబ్ధి పొందింది.