YCP : గ్రామ రెవెన్యూ సహాయకులకు (వీఆర్ఏ) నెలకు రూ.500 తాత్కాలిక డియర్నెస్ అలవెన్స్(డీఏ) మంజూరు చేస్తూ ఆంధ్రప్రదేశ్ (YCP)ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా 19వేల 359 మంది వీఆర్ఎలకు ఆర్థిక వెసులుబాటు కలగనుంది. గతంలో వీఆర్ఏలకు నెలకు రూ.300 డీఏ వచ్చేది. కానీ గత టీడీపీ ప్రభుత్వం దానిని రద్దు చేసింది.
ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (ఏపీజీఈఎఫ్) విజ్ఞప్తిపై స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అడ్ హాక్ డీఏను పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడమే కాకుండా రూ.300 నుంచి రూ.500కి పెంచుతామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారమే 2018 జూలై నుంచి నిలుపుదల చేసిన కరవు భత్యాన్ని పునరుద్ధరిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. కాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయం పట్ల వీఆర్ఏలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. డీఏ మంజూరు చేసినందుకు ఏపీజీఈఎఫ్ చైర్మన్ కాకర్ల వెంకట్రామి రెడ్డి, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, వీఆర్ఏల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గరికపాటి బ్రహ్మయ్య, ముఖ్యమంత్రి జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు.