కొన్ని దశాబ్దాలుగా ఉద్దానం ప్రాంతంలో నెలకొన్న సమస్యకు చెక్ పెడుతూ సీఎం జగన్ వైఎస్సార్ సుజలధార మంచినీటి ప్రాజెక్టు,డాక్టర్ వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ ఆస్పత్రిని ప్రారంభించనున్నారు. నాడు ప్రతిపక్ష నేత హోదాలో ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ బాధితులకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు రూ.742 కోట్లతో వైఎస్సార్ సుజలధార మంచినీటి ప్రాజెక్టు, రూ.85 కోట్లతో 200 పడకల డాక్టర్ వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ ఆస్పత్రిని ఏర్పాటుచేశారు. ఈ రెండింటినీ సీఎం జగన్ గురువారం ప్రారంభించనున్నారు.
ఉద్దానంలో పెరుగుతున్న కిడ్నీ సమస్యలకు కారణం అక్కడి తాగునీరే కారణమని భావించి ఆ ప్రాంతంలో ఉన్న వారందరికీ సురక్షిత మంచినీరు అందించాలనే ఉద్దేశ్యంతో వైఎస్సార్ సుజలధార మంచినీటి ప్రాజెక్టుకు 2019 సెప్టెంబర్ 6న సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల పరిధిలో ఉన్న ఏడు మండలాల్లోని 807 గ్రామాలకు ఇంటింటికీ కుళాయిల ద్వారా మంచినీటిని రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా అందించనుంది. భవిష్యత్‌లో శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం, మెలియాపుట్టి మండలాల్లోని 170 గ్రామాలకు కూడా పైపులైన్ ద్వారా తాగునీరు అందించే వీలుగా ఈ పథకాన్ని డిజైన్ చేయడం విశేషం.
అందుబాటులో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి
ఉద్దానం ప్రాంతంలో ఉన్న జనాభాలో దాదాపు 21 శాతానికి పైగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో 112 గ్రామాలు కిడ్నీ బారినపడి విలవిల్లాడుతుండగా ఇప్పటికే 15వేల మంది చనిపోయినట్లు అంచనా. దాంతో కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారంగా ఇక్కడ 85 కోట్లతో 200 పడకల డాక్టర్ వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ ఆస్పత్రి ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. ఇందులో రూ.60 కోట్లు ఆస్పత్రి నిర్మాణానికి కేటాయించగా, మరో రూ.25 కోట్లు అధునాతన వైద్య పరికరాలు, ఇతర వనరుల కల్పనకు కేటాయించారు. ఈ ఆస్పత్రిలో 41 మంది సూపర్ స్పెషలిస్టులు, స్పెషలిస్టులు, వైద్యాధికారులను రెగ్యులర్ ప్రాతిపదికన నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జూలై 3న ఉత్తర్వులు జారీచేసింది. వీరితోపాటు స్టాఫ్ నర్సు పోస్టులు 60, ఇతర సహాయ సిబ్బంది పోస్టులు కలిపి 154 పోస్టులను కొత్తగా మంజూరు చేసి భర్తీ చేపట్టారు.
కాగా ఈ ఆసుపత్రిలో ప్రపంచస్థాయి, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన యంత్ర పరికరాలను జగన్ సర్కారు సిద్ధంచేసింది. యూరాలజీ, నెఫ్రాలజీ, రేడియాలజీ, కార్డియాలజీ, ఎనస్తీషియా, వ్యాస్కులర్ సర్జన్, పల్మనాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, బయో కెమిస్ట్రీ లాంటి సూపర్ స్పెషాలిటీస్ సేవలు జనరల్ సర్జన్, జనరల్ మెడిసిన్ సేవలు అందిస్తారు. గత 20 రోజులుగా ఈ ఆసుపత్రి ద్వారా రోగులకు చికిత్స అందిస్తుండడం గమనార్హం.
అధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ ఉద్దానంలోని కిడ్నీ బాధితుల గురించి చంద్రబాబు పట్టించుకోలేదు సరికదా తమ గోడు చెప్పుకోవడానికి వచ్చిన బాధితులతో నాకు 40 ఏళ్ల అనుభవం ఉంది.. నాకు అడ్డొస్తే బుల్డోజర్తో తొక్కేస్తా.. తొక్కతీస్తా.. తోలు తీస్తా’ అని రెచ్చిపోయారు. మరోవైపు పార్ట్ టైం పొలిటీషియన్ గా మారిన పవన్‌కళ్యాణ్ కిడ్నీ బాధల నుంచి విముక్తి కల్పిస్తానని హడావుడి చేయడానికి 2017లో దీక్ష పేరుతో పెద్ద డ్రామా ఆడారు. వైఎస్ జగన్ అధికారం చేపట్టిన తర్వాత కిడ్నీ రోగులకు అండగా ఉండేందుకు అప్పటివరకు రూ.3,500 ఉన్న పింఛన్‌ను రూ.10వేలకు పెంచారు. వ్యాధి తీవ్రత ఆధారంగా రెండు రకాలుగా పింఛన్లు అందజేస్తున్నారు. 5కు పైబడి సీరం క్రియాటిన్ ఉన్న వారికి రూ.5వేలు, డయాలసిస్ రోగులకు రూ.10వేల పింఛన్ ఇస్తున్నారు. కాగా ఉద్దానం ప్రజలకు అండగా ఉంటానని మాట ఇచ్చి ఆ మాటను నిజం చేస్తూ అక్కడి ప్రజల కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన ఘనత ముఖ్యమంత్రి జగన్ కి దక్కింది.