ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో కాకినాడ జిల్లా టీడీపీ సీనియర్ నేత యనమల కృష్ణుడు వైఎస్సార్సీపీలోకి చేరారు. యనమల కృష్ణుడు వైఎస్ఆర్సిపిలో చేరడంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టిడిపికి ఎదురు దెబ్బ అని చెప్పవచ్చు. పార్టీ ఆవిర్భావం నుంచి యనమల కృష్ణుడు టిడిపిలో కొనసాగుతూ వచ్చారు. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విజయం వెనకాల యనమల కృష్ణుడి కృషి ఎంతో ఉంది.
టీడీపీలో డబ్బున్న వాళ్లకి, ఎన్నారైలకే టిక్కెట్లిచ్చారు, పార్టీలో మొదటి నుంచి ఉన్నవారిని మోసం చేశారని మండిపడ్డారు. టీడీపీలో 42 సంవత్సరాలుగా ఉన్నా. చంద్రబాబు, యనమల రామకృష్ణుడు మోసం వల్లే నాకు అన్యాయం జరిగింది. చంద్రబాబు బీసీలను మోసం చేశారనడానికి నేనే ఉదాహరణ. ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లో ఉన్నా. నాకు తుని టిక్కెట్ ఇవ్వకపోగా.. నన్ను ఘోరంగా అవమానించారు. తునిలో ఏరోజూ యనమల రామకృష్ణుడు లేరు అంటూ కృష్ణుడు ధ్వజమెత్తారు. తునిలో టీడీపీని అంత తానై నడిపితే యనమల రామకృష్ణుడు రాజ్య భోగం అనుభవించి, నాకు సపోర్ట్ చేయకుండా నన్ను మోసం చేశాడు అని ఈ సందర్భంగా తెలిపారు.
యనమల కృష్ణుడు మాట్లాడుతూ ఐదేళ్ల సీఎం జగన్ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, ఆ కారణం చేతే వైఎస్సార్సీపీలో భేషరతుగా చేరా అని తెలిపారు. వైఎస్ జగన్ ని మళ్లీ ముఖ్యమంత్రిని చేయడానికి కృషి చేస్తా అని అదే విధంగా కాకినాడ ఎంపీగా చలమలశెట్టి సునీల్, తుని ఎమ్మెల్యేగా దాడిశెట్టి రాజా గెలుపునకు కృషి చేస్తా అని కృష్ణుడు తెలిపారు. యనమల కృష్ణుడితో పాటు టీడీపీ నేతలు పి.శేషగిరిరావు, పి.హరిక్రిష్ణ, ఎల్.భాస్కర్ వైఎస్సార్సీపీలో చేరారు.