ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసారు. 2019 లో ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేసామని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడం వల్లే ప్రజల్లో హీరోగా నిలిచే అవకాశం దక్కిందన్నారు. 2014లో చంద్రబాబుతో మోసపూరిత హామీలతో పోటీ పడలేక ఓడిపోయానని వ్యాఖ్యానించారు. 2014లో చంద్రబాబు 600 హామీలు ఇచ్చి ఒకటి కూడా పూర్తిస్థాయిలో చేయలేదని తెలిపారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అమలు చేసేవే చెబుతున్నామని..చెబితే ఖచ్చితంగా చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. మరో సారి తన మేనిఫెస్టోలో సంక్షేమంకు ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పారు.
ఒకపక్క సంక్షేమం చేస్తూనే మరోపక్క రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని తెలిపారు. అందులో భాగంగానే నాడు నేడు భాగంగా పాఠశాలలు హాస్పిటల్లో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రానికి ఆదాయాన్ని పెంచడానికి 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు , 6 ఫిష్ లాండింగ్ సెంటర్లు ఏర్పాటుకు శ్రీకారం చుట్టాం అని తెలిపారు. నాలుగు పోర్టులు నిర్మాణం జరిగితే పోర్టు ఆధారిత ఇండస్ట్రీలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అని తెలిపారు. వీటితోపాటుగా ఇప్పటికే రెండు స్పెషల్ ఎకనామిక్ జోన్లు ఏర్పాటు చేశామని కూడా తెలిపారు. 17 మెడికల్ కాలేజీ, 17 నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేశాం అని తెలిపారు.
అమ్మఒడి పరిధి రూ 15 వేల నుంచి 17 వేలకు పెంపుకు జగన్ హామీ ఇచ్చారు. వైఎస్సార్ ఆసరా కింద 3 లక్షల వరకు సున్నా వడ్డీ ఇస్తామని ప్రకటించారు. వైఎస్సార్ ఈబీసీ నేస్తం 4 విడతల్లో 45 వేల నుంచి 60 వేలకు పెంచుతూ హామీ ఇచ్చారు. పేదలందరికీ ఇళ్ల పట్టాలు అందిస్తామని ముఖ్యమంత్రి హామీగా ప్రకటించారు. వైఎస్ఆర్ చేయూత, కాపు నేస్తం, మూడు లక్షల వరకు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తామని తెలిపారు.
విద్య, వైద్యం, వ్యవసాయం, పేదలకు ఇళ్లు, సామాజిక భద్రత, నాడు – నేడు, మహిళా సాధికారత, సామాజిక భద్రత లక్ష్యంగా పాలన కొనసాగుతుందని చెప్పారు. ప్రస్తుతం అందిస్తున్న పెన్షన్ ను రూ 3 వేల నుంచి రూ 3,500 కి పెంచుతామని జగన్ హామీ ఇచ్చారు. 2028, 2029 జనవరిలో రెండు విడతలుగా పెన్షన్ పెంచుతామని వెల్లడించారు. 66 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నట్లు వివరించారు. వైయస్సార్ కళ్యాణమస్తు-షాదీ తోఫా కొనసాగిస్తామని ప్రకటించారు. రైతులకు ఇచ్చే రైతు భరోసా సొమ్ము రూ 13,500గా ఉండగా…ఈ సారి ఈ మొత్తాన్ని రూ 16 వేలకు పెంచి అయిదేళ్ల కాలంలో రూ 80 వేలు ఇస్తామని ప్రకటించారు. రైతులకు ప్రస్తుతం అందిస్తున్న అన్ని రకాల లబ్ది కొనసాగుతుందని జగన్ వెల్లడించారు. మత్స్యకార, వాహనమిత్ర కొనసాగిస్తామని చెప్పారు. స్విగ్గి జొమాటో చేసే వారికి వైయస్సార్ బీమా వర్తింపజేస్తామని తెలిపారు. 25 లోపు లోపు జీతం ఉన్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు అన్ని పథకాలు అర్హులని తెలిపారు.