అధికారం కోసం తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నీచ రాజకీయాలకు దిగాడు. మొన్నటి వరకు వలంటీర్లను అనరాని మాటలు అన్నాడు. ఇప్పుడేమో వారిపై కపట ప్రేమ చూపిస్తున్నాడు. టీడీపీ అధికారంలోకి రాగానే వారిని తీసేస్తామని బెదిరించి నేడు ఓట్ల కోసం రూ.10 వేలు ఇస్తామని కట్టు కథలు చెబుతున్నాడు. అయినా సేవా సైన్యం బాబు మాటలను పట్టించుకోలేదు. దీంతో కొత్త కుట్రలకు తెరతీశాడు.
అధికారంలోకి వచ్చేది మనమేనని వలంటీర్లను మభ్యపెట్టండి. మాట వినకపోతే బెదిరించండి.. టీడీపీలో చేరకపోతే భవిష్యత్‌ను అంధకారం చేస్తామని భయపెట్టండి. వచ్చే వారికి డబ్బులిచ్చి కండువాలు కప్పండి. రాష్ట్రంలో హైప్ తీసుకురావాలంటే ఇలా చేయాల్సిందేనని చంద్రబాబు తన పార్టీ అభ్యర్థులు, ముఖ్య నేతలను ఆదేశించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల్లో తెలుగు తమ్ముళ్లు వలంటీర్లపై జులం ప్రదర్శిస్తున్నారు. తమ వెంట నడవాలని ఆదేశిస్తున్నారు.
చంద్రబాబు ఆదేశించడమే తరువాయి టీడీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి రంగంలోకి దిగారు. తన భార్య ప్రశాంతిరెడ్డి పోటీ చేస్తున్న కోవూరు నియోజకవర్గంలో స్థానిక తమ్ముళ్ల ద్వారా వలంటీర్లపై బెదిరింపులకు పాల్పడ్డారు. జై కొడితే మనిషికి రూ.50 వేల చొప్పున ఇస్తామన్నారు. 40 మంది డబ్బు కోసం కాకుండా ఆ రౌడీ టీడీపీ నాయకుడికి భయపడి కండువా కప్పుకొనేందుకు అంగీకరించారు. వారిని వేమిరెడ్డి, ప్రశాంతిరెడ్డి తెలుగుదేశంలో చేర్చుకుని.. అందరూ చంద్రబాబుపై నమ్మకంతో చేరారని డబ్బా కొట్టుకున్నారు. తీరా చేరిన వాళ్లే తమను ఎలా భయపెట్టారో ఒకరికొకరు చెప్పుకొని బాధపడ్డారు.
చంద్రబాబు కుట్రల కారణంగా వలంటీర్లు ప్రజలకు దూరమయ్యారు. పింఛన్లు కూడా ఇవ్వకుండా టీడీపీ అడ్డుకుంది. వారి తీరుకు నిరసనగా సేవా సైన్యం తమ పోస్టులకు రాజీనామా చేసి జగన్ కోసం వైఎస్సార్సీపీలో చేరుతోంది. దీంతో భయపడిన బాబు ఈ తరహా పనులకు పాల్పడుతున్నారు. ఎన్ని కుతంత్రాలు చేసినా వలంటీర్లకు నమ్మకం రాదు. పార్టీలో చేర్చుకోవచ్చు కానీ మనసులో జగన్‌పై ఉన్న అభిమానాన్ని చెరపలేరని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.