అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడిన నేపథ్యంలో టీడీపీ జనసేన పొత్తుతో వస్తుండగా అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగబోతుంది. తానూ ఉనికిలో ఉండాలని ఆరాటపడుతున్న కాంగ్రెస్ పార్టీ, బీజేపీ మాత్రం గోడమీద పిల్లిలా రాష్ట్రంలో జరిగే పరిణామాలను గమనిస్తూ ఉన్నాయి .
టీడీపీ జనసేనపార్టీలకు ఇవి జీవన్మరణ ఎన్నికలుగా దాపురించాయి. ఒకవేళ వైసిపి మళ్ళీ గెలిస్తే తమ పార్టీల ఉనికికే ప్రమాదం ఉందని ప్రతీ చిన్న విషయాన్ని తన అనుకూల మీడియాలో భూతద్దంలో చూపించే ప్రయత్నం చేస్తున్నాయి. ముఖ్యంగా జగన్ ఎప్పుడైతే విడతల వారీగా టికెట్లు ప్రకటించడం మొదలుపెట్టాడో వైసీపీ మొత్తం తిరుగుబాట్లతో కుతకుతలాడిపోతుందని పార్టీ కూలిపోనుందనే ప్రచారంతో ఓ వర్గం మీడియా గొట్టాలన్నీఊదరగొట్టాయి. కానీ రియాలిటీలోకి వస్తే ఇప్పటికి దాదాపు 70 స్థానాల వరకూ ప్రకటించారు. చాలామంది అభ్యర్థులను స్థానాలను మార్చారు. (ఈ స్థానాల మార్పు విషయంలో ఓ వర్గం మీడియా ఊదరగొడుతుంది కానీ 2019 ఎన్నికల్లో కూడా వైసీపీ & టీడీపీ రెండు పార్టీలు ఇబ్బడిముబ్బడిగా అభ్యర్థులను మార్చాయి) కానీ ఎంతమంది జగన్ పార్టీకి ఎదురుతిరిగారో గమనిస్తే మీకు విషయం అర్థం అవుతుంది. ఫట్టుమని పదిమంది నాయకులూ ఎదురుతిరిగారో లేదో చెప్పడం కష్టం.
పార్టీలు మారుతున్న & ఎదురుతిరుగుతున్న నాయకులందరూ ఆ పార్టీ టికెట్ నిరాకరిస్తే తప్ప బయటకు రావడం లేదన్నది అందరూ అంగీకరించాల్సిన సత్యం. కానీ జరుగుతున్న పరిణామాలకు వ్యతిరేకంగా సదరు పార్టీలను మభ్యపెడుతూ ఆ వర్గం మీడియా పార్టీ మొత్తం ఖాళీ అయిపోతుందన్న భ్రమలో ముంచెత్తుతూ సదరు పార్టీకి తీరని నష్టం చేకూరుస్తుంది. చివరికి ఆ పార్టీ మీడియా ఎంతగా దిగజారిపోయిందంటే ఎవరైనా సామాన్యుడు మద్యం మత్తులోనో లేక రచ్చబండల వద్దనో అధికార పార్టీని తిడితే వాటిని ప్రధాన వార్తలుగా ప్రచురిస్తూ రాష్ట్రమంతటా ఇదే స్థాయిలో వ్యతిరేకత ఉందనే భ్రమ కలిగించడానికి నానా పాట్లు పడుతుంది.
అభ్యర్థుల స్థానాలను మారిస్తే అక్కడ చెత్త ఇక్కడ బంగారం అవుతుందా అనే స్టేట్మెంట్స్ పాస్ చేస్తున్న టీడీపీ మాత్రం వైసిపి తిరస్కరించిన నాయకులను తమ పార్టీలో చేర్చుకుంటూ అక్కడ తిరస్కరించిన చెత్తను తమ నెత్తిపై బంగారంగా మారుతుందనే భ్రమలోకి జారిపోయింది. జగన్ ని ఎవరు తిట్టినా వారికి తమ హెడ్ లైన్స్ లో స్థానం కల్పించే ఓ వర్గం మీడియా ఇప్పుడు కొత్తగా వచ్చిన షర్మిలను నెత్తిపై పెట్టుకుని మోస్తుంది. కానీ వాళ్లకు అర్థం కాని విషయం ఏమంటే షర్మిల వల్ల వాళ్ళ పార్టీలకు ఒక్క ఓటు ఉపయోగం కూడా ఉండదని. జగన్ పనితీరు నచ్చిన ప్రజలు ఆయనకు తప్ప వేరే వారికి ఓటు వేసే పరిస్థితి లేదు. కాబట్టి జగన్ వ్యతిరేక ఓట్లకు షర్మిల గండికొట్టడం తప్ప ఇందులో దాగిన పరమార్ధం మరేదీ లేదు. దీనివల్ల నష్టం చేకూరేది టీడీపీ జనసేన కూటమికే అనేది సుస్పష్టం. కానీ షర్మిలను మోస్తున్న సదరు మీడియా ఛానెల్స్ కి ఇవన్నీ అనవసరం. కేవలం జగన్ ని విమర్శిస్తే చాలు మా మీడియాలో హెడ్ లైన్స్ వేస్తామనే బోర్డులు పెట్టుకున్నాయి కాబట్టి తమ పనిలో తాము సాగిపోతున్నాయి.
రాష్ట్రం మొత్తం ఫ్యాన్ గుర్తుకి వ్యతిరేకత ఉన్నప్పుడు అన్నేసి షాకింగ్ థంబ్నెయిల్స్ ఎందుకో అర్థం కాదు. కావాలంటే ఆ వర్గం మీడియా యూట్యూబ్ ఛానెల్స్ థంబ్నెయిల్స్ గమనిస్తే ఇవన్నీ ప్రజా సమస్యలపై పోరాటం చేయకుండా, కేవలం వ్యక్తిగత కారణాలతోనో లేక ఒక రాజకీయ పార్టీకి లబ్ది చేకూర్చడానికి పోరాటం చేస్తున్నాయని సామాన్య ప్రజలకు కూడా అర్ధమైపోతుంది. తమ వ్యతిరేకతను ప్రజా వ్యతిరేకతగా చాటి చెప్పడానికి సదరు మీడియా చేస్తున్న కృషి అనన్య సామాన్యం. నిజానికి సదరు మీడియా సంస్థల వల్ల అధికార పార్టీకి జరుగుతున్న మేలును ప్రత్యర్థి పార్టీలు గుర్తించే స్థితిలో లేవు.
ఎంతవరకూ టికెట్లు నిరాకరించిన అభ్యర్థుల తిరుగుబాటుతో అధికార పార్టీ ఖాళీ అవుతుందనే ప్రచారం తప్ప తమ అనుకూల పార్టీల పరిస్థితి ఏంటనేది ఎప్పటికీ సదరు ఛానెల్స్ చెప్పవు. ఎప్పుడైతే టీడీపీ జనసేన నుండి టికెట్ల ప్రకటన మొదలవుతుందో అప్పుడు మొదలవుతుంది అసలుసిసలు ఆట.. సాధారణంగానే టికెట్ల ఆశావహులు ఆయా పార్టీల్లో ఎక్కువగా ఉంటారు. పొత్తులో ఉన్నప్పుడు ఆయా పార్టీలో ఉన్న కొందరు నాయకులను పక్కనపెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అసలే టీడీపీ పార్టీలో కాకలు తీరిన నాయకులున్నారు. తమకు టికెట్లను నిరాకరిస్తే వాళ్ళు ఊరుకునే ప్రసక్తి ఉండదు. తప్పకుండ తిరుగుబాటు బావుటా ఎగరవేసే అవకాశం ఉంది. అప్పుడు టీడీపీ అధినేత ఎలా మేనేజ్ చేస్తారనేది ఆసక్తికరమైన అంశం. పొత్తులో ఉన్నప్పుడు ఇరు పార్టీల ఓట్ల షేరింగ్ ఒకే పార్టీకి కన్వర్ట్ అవ్వాలి. అలా ఖచ్చితంగా ఓట్ల షేరింగ్ ఉంటుందని ఘంటాపథంగా చెప్పలేని పరిస్థితి. ఇంత వరస్ట్ ఫేజ్ లో ఉండి కూడా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారంటే వాళ్ళవి మాములు గుండెలు కాదు.
ఏది ఏమైనా గతంలో జరిగినట్లు 2024 ఎన్నికలు జరిగే అవకాశం లేదు. పార్టీల ఉనికి కోసం ఒకరు అధికారం కోసం మరొకరు తలపడుతున్న ఈ సమరంలో సోషల్ మీడియా ప్రధాన పాత్ర పోషించనుంది. ఫలానా చోట వ్యతిరేకత ఉందనగానే ఆహా ఓహో అని ఊదరగొడుతున్న మీడియా గొట్టాలను నమ్ముతున్నారా? అయితే కాస్త ఆ థంబ్నెయిల్స్ గురించి ఆలోచించండి మీకే ఒక అవగాహన వస్తుంది.