వైఎస్సార్ కాంగ్రెస్ పాలనలో వైద్య రంగం బలోపేతమైంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న చర్యలతో పేదలకు నాణ్యమైన వైద్యం అందుతోంది. కరోనా సమయంలో చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి. అయితే తెలుగుదేశం ఈ–పత్రిక చైతన్య రథంలో మాత్రం తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దిక్కులేని వైద్యమంటూ కాకి లెక్కలతో కథనాన్ని వండి వడ్డించారు. సీఎంఆర్ఎఫ్ను పట్టించుకోవడం లేదని, ఆరోగ్య కోమాలో ఉందని రాసుకొచ్చారు. అయితే ఇవన్నీ అవాస్తవాలే. గత టీడీపీ ప్రభుత్వం పేదల ఆరోగ్యాన్ని గాలికొదిలేసింది.
జగన్ హయాంలో ఇలా..
కేంద్రం ప్రతి ఐదువేల మందికి ఒక సబ్ సెంటర్ ఉండాలని చెప్పింది. జగన్ హయాంలో ప్రతి 2 వేల మంది జనాభాకు ఒక హెల్త్ క్లినిక్ ఉంది. గ్రామీణ వైద్య రంగం బలోపేతానికి 10,032 వైఎస్సార్ క్లినిక్‌ల్లో 105 రకాల మందులు, 14 రకాల వైద్యసేవలు అందిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వంలో నిర్వీర్యమైన 108 వ్యవస్థకు జగన్ ఊపిరి పోశారు. 786 అంబులెన్స్‌ల ద్వారా ప్రజలకు ఉచితంగా సేవలందించేందుకు రూ.650 కోట్లకు పైగా ఖర్చు చేశారు. కొత్త వాహనాల కొనుగోలుకే రూ.136 కోట్లు వెచ్చించారు. అంబులెన్స్‌లు రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు సగటున 3 వేల మందికి సేవలు అందిస్తున్నాయి. ప్రభుత్వ రంగంలో క్యాన్సర్‌కు ఆధునిక వైద్యం అందించేందుకు రూ.400 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఫ్యామిలీ డాక్టర్ పేరుతో వినూత్న కార్యక్రమాన్ని జగన్ మొదలుపెట్టారు. 10,032 విలేజ్ క్లినిక్‌లను వైద్యులు 1.14 లక్షల సార్లు సందర్శించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.8,480 కోట్లతో రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కళాశాలల ఏర్పాటుకు నడుం బిగించింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో ఐదు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మరో ఐదింటిని వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే ఉన్న కళాశాలలు, అనుబంధ ఆస్పత్రులను రూ.3,820 కోట్లతో బలోపేతం చేసింది. నాడు – నేడు కింద ప్రభుత్వ ఆస్పత్రులను అభివృద్ధి చేస్తున్నారు. ఇందుకు వెచ్చిస్తున్న మొత్తం రూ.16 వేల కోట్లు. 1,142 పీహెచ్‌సీల్లో మరమ్మతులు చేశారు. 121 సీహెచ్‌సీలు, 42 ఏరియా ఆస్పత్రులు, రెండు ఎంసీహెచ్‌లను అభివృద్ధి చేశారు. ఉద్ధానంలో రూ.50 కోట్లతో కిడ్నీ బాధితుల కోసం రీసెర్చ్ సెంటర్ నిర్మాణం చేసి మొదలు పెట్టారు. 500 కొత్త వాహనాలతో తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలను విస్తరించారు. వైద్య శాఖలో 53 వేలకు పైగా పోస్టులను భర్తీ చేశారు. ఇంకా వైఎస్సార్ ఆరోగ్య సురక్ష క్యాంపులు ఏర్పాటు చేశారు. తొలి విడతలో 12,123 శిబిరాలు నిర్వహించి, 60.27 లక్షల మందికి ఓపీ సేవలు అందించారు. రెండో దశ కొనసాగుతోంది. మెరుగైన వైద్యం అవసరమైన వారిని జిల్లా ప్రధానాస్పత్రులకు రెఫర్ చేస్తున్నారు. వృద్ధులకు రూపాయి ఖర్చు లేకుండా కంటి వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఆరోగ్యశ్రీతో భరోసా
డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ.. ఈ పథకం పేదలకు చేస్తున్న మేలు గురించి ఎంత చెప్పినా తక్కువే. రాజన్న తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక ఆరోగ్యశ్రీకి పూర్వ వైభవం వచ్చింది. మొన్నటి వరకు ఆరోగ్యశ్రీ పరిమితి రూ.5 లక్షల వరకు ఉండేది. జగన్ దీనిని ఏకంగా రూ.25 లక్షలకు పెంచి కొత్త కార్డులు అందజేశారు. దీంతో ఖరీదైన వైద్యం చేయించుకునేందుకు పేదలకు మరింత అవకాశం కలిగింది. ప్రొసీజర్లు టీడీపీ హయాంలో 1,059 ఉండగా.. నేడు 3,255 ఉన్నాయి. 2019 నుంచి చూస్తే ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా కోసం ఏకంగా రూ.13 వేల కోట్లకు పైగానే ఈ ప్రభుత్వం ఖర్చు చేసింది. మొత్తంగా 40 లక్షల మంది ఉచితంగా వైద్య సేవలు అందుకున్నారు. రాష్ట్రంలో 2019 నుంచి ఇప్పటి వరకు 3,67,305 మంది గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులు ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య సేవలు అందుకున్నారు. రూ.2,229.21 కోట్లు ఖర్చు చేసింది. మరో వైపు చికిత్స అనంతరం ఆరోగ్య ఆసరా కింద విశ్రాంత సమయానికి నెలకు గరిష్టంగా రూ.5 వేల వరకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. పేదల కోసం హైదరాబాద్, చెన్నై, బెంగళూరు తదితర చోట్ల నెట్వర్క్ ఆస్పత్రుల వ్యవస్థను బలోపేతం చేశారు. దీంతో కార్పొరేట్ హాస్పిటళ్లలో ఉచితంగా వైద్యం చేయించుకునే వెసులుబాటు కలిగింది.
కరోనా సమయంలో..
కరోనా మహమ్మారి సమయంలో జగన్ ప్రభుత్వం పేదలకు అండగా నిలిచింది. ఉచితంగా టెస్ట్‌లు చేయించింది. క్వారంటైన్ కేంద్రాలు నిర్వహించి భోజన, వైద్య సదుపాయాలు కల్పించింది. ప్రైవేట్ ఆస్పత్రులను స్వాధీనం చేసుకుని అత్యసవర వైద్యం అవసరమైన వారిని ఆదుకున్నారు. వలంటీర్లు, సచివాలయ సిబ్బంది ఎంతో ధైర్యంగా ప్రజల వద్దకు వెళ్లి భరోసా కల్పించారు.
ఇంత చేసినా.. ఇంకా చేస్తున్నా తెలుగుదేశం ఈ ప్రభుత్వంపై ఏడుస్తూనే ఉంది. కళ్లు మూసుకుని చూస్తే ఏమీ కనిపించదు. అదే కనులారా చూస్తే వైద్య రంగంలో జగన్ తెచ్చిన సంస్కరణలు కనిపిస్తాయి. వైద్యం అందుకున్న ప్రతి గుండెలో నిండిన సంతోషం కనిపిస్తుంది.