సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసుకు సంబంధించి తెలుగుదేశం విజయవాడ సెంట్రల్ అభ్యర్థి బోండా ఉమా అరెస్ట్ కాకుండా ఆ పార్టీ పెద్దలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఉమాకు ఎటువంటి సంబంధం లేదని, అరెస్ట్ చేయకుండా ఆపాలని, ఇందులో ఈసీ జోక్యం చేసుకోవాలని ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ రాశారు.
చంద్రబాబు నాయుడి ఆదేశాలతో సీఎం జగన్‌ను అంతమొందించడానికి బోండా బ్యాచ్ స్కెచ్ వేసినట్లు వెలుగు చూసింది. సిమెంట్ కాంక్రీట్ రాయి విసిరిన ఏ1 వేముల సతీష్‌కుమార్, అతడిని ప్రేరేపించిన ఏ2 దుర్గారావులు ఉమాకు అత్యంత సన్నిహితులని విచారణలో తేలింది. వారు టీడీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. దాడి విషయంలో కట్టుకథలు అల్లుతూ వచ్చిన ఉమా బండారం చివరికి బయటపడింది. అతడితో నిందితులున్న ఫొటోలు పత్రికల్లో, సోషల్ మీడియాలో వచ్చాయి. దీంతో తెలుగుదేశం పెద్దలు ఉలిక్కిపడ్డారు.
చంద్రబాబు చేసిన పథక రచన తెలిసిపోవడంతో ఉమా అరెస్ట్ కాకుండా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో అరెస్ట్ చేస్తే పార్టీకి విపరీతమైన డ్యామేజీ జరుగుతుందని ఆందోళన చెందుతున్నారు. అందుకే బాబు రామయ్య చేత ఈసీకి లేఖ రాయించారు. ఉమాకు సంబంధం లేదని, ఇరికించాలని చూస్తున్నారని అందులో ఆరోపించారు. నిందితులతో ఉన్న ఫొటోలు బయటపడ్డాయి కదా అని ప్రజానీకం ప్రశ్నిస్తోంది. తెలుగు తమ్ముళ్ల నుంచి మాట కరువైంది. పోలీసులపై ఒత్తిడి ఉందని ఎల్లో బ్యాచ్ ఆరోపణలు చేస్తోంది. కానీ ఎన్నికల నేపథ్యంలో యంత్రాంగమంతా ఈసీ చేతుల్లో ఉందనే విషయం మర్చిపోతే ఎలా..? ఈ కేసుకు సంబంధించి నివేదికను ఎప్పకటిప్పుడు ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు పంపుతున్నారు.
అసలు బోండా ఉమా తప్పు చేయనప్పుడు టీడీపీకి ఎందుకు ఉలిక్కిపడుతోందనే ప్రశ్న వస్తోంది. పోలీసులు విచారణ చేస్తారు. అతని పాత్ర లేదని తేలితే వదిలేస్తారు. అలా కాకుండా అరెస్ట్ అడ్డుకోవాలని ఈసీకి లేఖ రాయడం అనేక అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు ఈ కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయించాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తోంది. ఉమా, అతని కుమారుల ప్రమేయం ఉందని విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని తెలిపారు.