వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో అనేకమంది వైఎస్ జగన్మోహన్రెడ్డిని మీ వెంట నడుస్తామని చెప్పి పార్టీ కండువాలు కప్పించుకుంటున్నారు. తాజాగా దెందులూరు నియోజకవర్గం టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ నేతలు చేరారు. ప్రకాశం జిల్లా జువ్విగుంట క్రాస్ స్టే పాయింట్ వద్ద జగన్‌ను అనేక మంది కలిశారు. టీడీపీ బీసీ సాధికార స్టేట్ కన్వీనర్, ఏపీ గౌడ సంఘం అధ్యక్షుడు చలుమోలు అశోక్‌గౌడ్, క్లస్టర్ ఇన్చార్జి భానుప్రకాష్, సొసైటీ మాజీ అధ్యక్షుడు మేడికొండ శ్రీనివాసరావు, జిల్లా గౌడ సంఘం నేత ఎం.వరప్రసాద్, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ, నియోజకవర్గ ఇన్చార్జి డీవీఆర్కే చౌదరి, డీసీసీ కార్యదర్శి సీహెచ్ కిరణ్, పెదవేగి మండల బీపేపీ అధ్యక్షుడు పొన్నూరు శంకర్ గౌడ్లు వైఎస్సార్సీపీలో చేరారు.
దీంతో స్టే పాయింట్ వద్ద సందడి నెలకొంది. దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి వారిని సీఎంకు పరిచయం చేశారు. ఆ నియోజకవర్గం నుంచి నేతలు భారీగా తరలివచ్చి జై జగన్ అంటూ నినాదాలు చేశారు. మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా జగన్ ఏ జిల్లాకు వెళ్లినా ఇతర పార్టీల నాయకులు తరలివచ్చి వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. ఇప్పటికే చిత్తూరు జిల్లాలో టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే లలిత కుమార్, ఉపాధ్యక్షుడు రావూరి ఈశ్వరరావు, శ్రీకాళహస్తి వద్ద నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి, ఇక కావలిలో అమలాపురానికి చెందిన నేతలు జగన్ చేత కండువాలు కప్పించుకున్న విషయం తెలిసిందే.