మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా విజయవాడ చేరుకున్న సీఎం జగన్ పై దాడి జరిగింది. విజయవాడలోని సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోని సింగ్ నగర్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి రాయితో దాడి చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. దాడి కారణంగా సీఎం జగన్ ఎడమ కంటి పై భాగంపై గాయమైంది. ప్రథమ చికిత్స అనంతరం యాత్రను సీఎం జగన్ కొనసాగించారు.
కాగా శనివారం రాత్రి బస్సు యాత్ర ముగిసిన అనంతరం వైద్యులు సూచనల మేరకు సీఎం జగన్ కేసరపల్లి నైట్ స్టే పాయింట్ నుంచి విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లారు. సీఎం వైయస్ జగన్ కు తగిలిన గాయాన్ని పరిశీలించిన వైద్యులు లోకల్ ఎనస్థిషియా ఇచ్చి రెండు కుట్లు వేశారు. ముఖ్యమంత్రి జగన్ కి గాయం కావడంతో ఆయనను చూసేందుకు, యోగక్షేమాలు తెలుసుకునేందుకు పెద్ద ఎత్తున ఆస్పత్రి సిబ్బంది తరలి రావడం గమనార్హం.
ఈసందర్భంగా ముఖ్యమంత్రిని జాగ్రత్తగా ఉండమని ఏమరపాటుగా ఉండవద్దని చెప్పిన ఆస్పత్రి సిబ్బంది జాగ్రత్తలు చెప్పారు. తన యోగక్షేమాలను చూసేందుకు వచ్చిన ఆస్పత్రి సిబ్బందిని అప్యాయంగా పలకరించిన సీఎం జగన్ అనంతరం నైట్ స్టే పాయింట్ కు తరలివెళ్లారు. గాయం కారణంగా సీఎం వైయస్ జగన్ గారిని విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచికచడంతో రేపటి యాత్రకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విరామం ప్రకటించింది. తదుపరి కార్యక్రమాన్ని ఆదివారం విడుదల చేస్తామని తెలిపిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది.
కాగా సీఎం జగన్ కి దక్కుతున్న ఆదరణను చూడలేకే ప్రతిపక్షాలు రాళ్ళ దాడికి పాల్పడ్డాయని వైసిపి శ్రేణులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు జరగాలని కుట్రలో పాల్గొన్న నిందితులను అరెస్ట్ చేయాలని వైసీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి…