ఎన్నికల వేళ తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి నోటికి అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ఇష్టానుసారంగా అధికార పార్టీని తిడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నాడు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం వ్యక్తిగత దూషణలు చేయకూడదు. కానీ నారా వారు ప్రతి సభలో ఉల్లంఘిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై ఎన్నికల సంఘానికి అనేక ఫిర్యాదులు వెళ్లాయి.
సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని చంద్రబాబు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. ఎన్నికల కోడ్ మొదలయ్యాక ఇది మరీ ఎక్కువైంది. ప్రతి బహిరంగ సభలో అభ్యంతరకర పదజాలాన్ని వాడుతున్నాడు. ఉద్వేగాలను రెచ్చగొట్టేలా బాబు మాటలు ఉంటున్నాయి. వీటిని వైఎస్సార్ కాంగ్రెస్ సీరియస్‌గా తీసుకుంది. 18సార్లు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసింది. వీటికి సంబంధించి వివరణ ఇవ్వాలని సీఈఓ చంద్రబాబుకు నోటీసులు జారీ చేశారు. కొన్నింటికి సమాధానాలిచ్చిన బాబు మరికొన్నింటికి అసలు స్పందించలేదు. అలాగే బాబు సమాధానంపై సంతృప్తి చెందని రాష్ట్ర ఎన్నికల సంఘం ఫిర్యాదులను పరిశీలించిన తర్వాత బాబు ప్రసంగాలు ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా ఉన్నట్టు ప్రాథమికంగా అంచనాకు వచ్చింది. 18 ఫిర్యాదులకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్‌లను జత చేస్తూ తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ సీఈఓ ముకేష్‌కుమార్ మీనా కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్యకార్య దర్శి అవినాష్ కుమార్‌కు లేఖ రాశారు.
ఇదిలా ఉండగా మళ్లీ మరో ఫిర్యాదు ఎన్నికల సంఘానికి అందింది. ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు, వైఎస్సార్సీపీ గ్రీవెన్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.నారాయణమూర్తి, న్యాయవాది కె.శ్రీనివాసరెడ్డి వెలగపూడి సచివాలయంలో సీఈఓను కలిశారు. ఈనెల 22న జగ్గంపేట సభలో చంద్రబాబు సీఎం జగన్, సజ్జల రామకృష్ణారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.