ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న జగన్ ప్రభుత్వంపై విష ప్రచారం చేయడం ఈనాడుకు పరిపాటిగా మారింది. పొదుపు సంఘాల అప్పులను మాఫీ చేస్తానని డ్వాక్రా మహిళలను నట్టేట ముంచిన చంద్రబాబు విషయంలో ఏనాడూ నోరెత్తని రామోజీ డ్వాక్రా సంఘాలను ఆదుకున్న సీఎం జగన్ పై మాత్రం అసత్య కథనాలను ప్రచురిస్తుండటం రామోజీలో జగన్ పై ఉన్న ద్వేషానికి పరాకాష్టగా చెప్పొచ్చు.
వాస్తవానికి 2014లో అధికారంలోకి రాగానే చంద్రబాబు బేషరతుగా మాఫీ చేస్తానన్న పొదుపు సంఘాల అప్పులు రూ.14 వేల కోట్లు కాగా వాటిని మాఫీ చేయకుండా కాలం వెళ్ళబుచ్చడంతో ఐదేళ్లలో వడ్డీలపై వడ్డీలు పెరిగి 2019 ఎన్నికల నాటికి ఆ ఆప్పుల మొత్తం రూ. 25,571కోట్లకు చేరింది. ఈ మొత్తాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ‘వైఎస్సార్ ఆసరా’ పథకం ద్వారా నాలుగు విడతల్లో నేరుగా ఆ మహిళలకు చెల్లిస్తున్నారు. వైఎస్ జగన్ హామీ ఇచ్చిన విధంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2019 ఏప్రిల్ 11వ తేదీ నాటికి పొదుపు సంఘాల పేరిట బ్యాంకుల్లో ఉండే అప్పుల మొత్తం రూ. 25,571 కోట్లకు గాను ఇప్పటికే మూడు విడతల్లో రూ.19,178 కోట్లు చెల్లించింది. నాలుగో విడత ఈ నెలలో రాష్ట్ర ప్రభుత్వం చెల్లించనుంది.
పొదుపు సంఘాలకు జీవం పోసిన జగన్ ప్రభుత్వం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పటినుండి అమలులో ఉన్న పొదుపు సంఘాల సున్నా వడ్డీ పథకానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పూర్తిగా మంగళం పాడడంతో 2016 ఆగస్టు తర్వాత సకాలంలో రుణాలు చెల్లించిన పొదుపు సంఘాల మహిళలెవరికీ అప్పటి టీడీపీ ప్రభుత్వం సున్నా వడ్డీ పథకం ద్వారా వడ్డీ డబ్బు చెల్లించలేదు. దీంతో పొదుపు సంఘాల మహిళలు తీవ్రంగా నష్టపోయారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే పొదుపు సంఘాల సున్నా వడ్డీ పథకాన్ని పునరుద్ధరించడంతో పాటు గత నాలుగేళ్లుగా సకాలంలో రుణాలు చెల్లించిన పొదుపు సంఘాల మహిళల వడ్డీని ఏ ఏడాదికి ఆ ఏడాదే వారి ఖాతాల్లో జమ చేస్తున్నారు. తద్వారా 1.05 కోట్ల మంది పేరిట ఉన్న 9.76 లక్షల పొదుపు సంఘాల రుణాలకు రూ.4,969 కోట్ల వడ్డీ భారం ఆ పేద మహిళల నెత్తిన పడకుండా ప్రభుత్వమే పూర్తిగా చెల్లించింది.
వైఎస్ జగన్ ప్రభుత్వం క్రమం తప్పకుండా సున్నా వడ్డీ సొమ్ము చెల్లిస్తుండటంతో గత ప్రభుత్వంలో నిర్వీర్యమైన పొదుపు సంఘాలు తిరిగి క్రియాశీలకంగా మారాయి. మొండి బకాయిలు, నిరర్ధక ఆస్తులు 18.36 శాతం నుంచి 0.33 శాతానికి తగ్గిపోయాయి. గత ప్రభుత్వంలో సి, డి గ్రేడ్లోకి దిగజారిన సంఘాలు జగనన్న ప్రభుత్వ సహకారంతో తిరిగి ఎ, బి‘ గ్రేడ్ లోకి చేరాయి. చంద్రబాబు పొదుపు సంఘాలను నిర్లక్ష్యం చేయడంతో నిర్వీర్యంగా మారిన పొదుపు సంఘాలకి జగన్ ప్రభుత్వ తోడ్పాటుతో తిరిగి జీవం వచ్చింది. కానీ వాస్తవాలను కప్పిపుచ్చుతూ పొదుపు సంఘాల మహిళలకు అన్ని విధాలా సహాయం చేస్తున్న జగన్ ప్రభుత్వంపై ఈనాడు బురదజల్లడాన్ని ప్రజలంతా ఖండించాల్సిన అవసరం ఉంది.