వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై చంద్రబాబు డైరక్షన్లో ఈనాడు రోజూ విషం కక్కుతూనే ఉంది. తనకు నచ్చని వారిపై దశాబ్దాలుగా అబద్ధాలను ప్రజల మెదళ్లలోకి ఎక్కిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్న పత్రిక ఇది. బాబు ప్రభుత్వంలో అవినీతి జరిగినా దాని కంటికి కనిపించదు. సాక్షాత్తు నారా వారు అక్రమాలకు పాల్పడినట్లు తెలిసినా ఎదుటివారిపైనే బురద జల్లుతుంది. తాజాగా ‘మంగంపేట ముగ్గురాయి గనుల్లో భారీ దోపిడీకి తొలగిన తెర’ పేరుతో ఆ పత్రిక కథనాన్ని ప్రచురించింది. దీనిని ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ తీవ్రంగా ఖండిచింది. ఏపీఎండీసీ వీసీ అండ్ ఎండీ వీజీ వెంకటరెడ్డి ఒక వాస్తవాలను వెల్లడిస్తూ శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. కనీస వాస్తవాలు తెలుసుకోకుండా ‘ఈనాడు’ పూర్తి అబద్ధాలతో తప్పుడు వార్తను ప్రచురించారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సీ, డీ గ్రేడ్ బెరైటీస్‌ను టెండర్ల ద్వారా విక్రయించేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని వక్రీకరించేలా కథనం ఇవ్వడం దారుణమన్నారు.
అసలు నిజాలు
అన్నమయ్య జిల్లా మంగంపేటలో బెరైటీస్ గనులున్నాయి. వీటి ద్వారా ఖనిజాభివృద్ధి సంస్థ ఏటా 30 లక్షల బెరైటీస్‌ను ఉత్పత్తి చేస్తోంది. ఇందులో సగటున 10 లక్షల టన్నులు ‘ఏ’ గ్రేడ్, 3 లక్షల టన్నులు ‘బీ’ గ్రేడ్, మిగిలిన 17 లక్షల టన్నులు ‘సీ, డీ మరియు డబ్లు్య (వేస్ట్) గ్రేడ్ల కిందకు వస్తుంది. అయితే సీ, డీ గ్రేడ్‌కు డిమాండ్ తక్కువగా ఉంది. దీంతో దాదాపు 80 లక్షల టన్నుల వరకు కాలేదు. వాటి విక్రయం, బెనిఫికేషన్ కోసం పలుసార్లు టెండర్లు నిర్వహించినా స్పందన లభించలేదు. ఈ–టెండర్ల ద్వారా విక్రయిస్తే నిర్వహణ ఖర్చు తగ్గడంతోపాటు సంస్థకు ఆదాయం వస్తుందని ప్రభుత్వం భావించింది.
ఇదీ జరిగింది..
అంతర్జాతీయంగా సీ, డీ గ్రేడ్ బెరైటీస్‌కు మార్కెట్ కల్పించాలనే లక్ష్యంతో ఖనిజాభివృద్ధి సంస్థ కోటి టన్నులకు తాజాగా ఎంఎస్టీసీ ద్వారా టెండర్లు పిలిచింది. సాధారణంగా ఏటా 20 లక్షల టన్నుల సీ, డీ, డబ్ల్యూ రకాలకు సంస్థ టెండర్లు పిలుస్తుంది. అయితే కొనుగోలుదారుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావడంలేదని అయిదేళ్లకు ఒకేసారి కోటి టన్నుల ఖనిజానికి టెండర్లు పిలవడం జరిగింది. ఈ విషయం తెలియని ఈనాడు పత్రిక అవగాహన లేని రాతలు రాసింది. సీ, డీ గ్రేడ్ ఖనిజానికి రిజర్వు ధరను కూడా తగ్గించారంటూ మరో తప్పుడు ఆరోపణ చేసింది. జీఓ నంబర్ 262 నిబంధనలకు అనుగుణంగానే రిజర్వు ధరను నిర్ణయించడం జరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగానే ఇది జరిగింది. ఎవరికో మేలు చేయాలనే ఆలోచన సంస్థకు లేదు. ఆసక్తి ఉంటే ఇదే ధరకు ఈనాడు యాజమాన్యం కూడా టెండర్లలో పాల్గొని, బిడ్‌ను దక్కించుకోవచ్చు. అందుకు పూర్తి సహకారం అందిస్తాం.
పర్యవేక్షణ కేంద్రానిది..
టెండర్ల ప్రక్రియను మినీరత్నగా కేంద్రం గుర్తించి ఎంఎస్టీసీ పర్యవేక్షిస్తోంది. కేంద్ర జీఎఫ్ఆర్ నిబంధనలకు అనుగుణంగా ధరావత్తును ఖరారు చేయడం జరిగింది. అలాగే 17 రోజుల్లోనే టెండర్లను పూర్తి చేస్తారనేది కూడా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే జరుగుతుంది. న్యాయసమీక్షకు ఎందుకు పెట్టలేదంటూ ఈనాడు చేస్తున్న వాదన ఆ పత్రికకు ఉన్న అవగాహనారాహిత్యానికి నిదర్శనం. రూ.100 కోట్లకు పైగా వ్యయం అయ్యే ప్రాజెక్ట్‌లకు నిర్వహించే టెండర్లకే సమీక్షను కోరుతారు. ఇక్కడ బెరైటీస్ నిల్వలను విక్రయించేందుకు పిలిచిన టెండర్లలో వ్యయం ఎక్కడ ఉంది? ఇది న్యాయ సమీక్ష పరిధిలోకి రాదనే కనీస జ్ఞానం కూడా ఆ పత్రికకు లేకపోవడం శోచనీయం. సదరు కథనంపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని ఎండీ వెల్లడించారు. అధికారులు ఖండించినా.. ప్రజలు నమ్మడం లేదని తెలిసినా ఈనాడు తన ధోరణి మార్చుకోదు. తన పంథాలో వెళ్తూ చంద్రబాబును సంతోషపెడుతూ ఉంటుంది.