సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. ఓటుకు నోటు వ్యవహారంపై సీబీఐ విచారణ చేపట్టాలన్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. వేసవి సెలవుల అనంతరం కేసు విచారణ చేపడతామని జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎస్విఎన్ భట్టిల ధర్మాసనం వెల్లడించింది.
కాగా ఈ కేసులో చట్టానికి సంబంధించి అనేక అంశాలు ముడిపడి ఉన్నాయని, రెండు వారాల్లో కేసుతో ముడిపడి ఉన్న చట్టపరమైన అంశాలతో కూడిన వివరాలను అందించేందుకు సమయం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. రెండు వారాల తర్వాత సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు వస్తున్నాయని, కేసు విచారణ పూర్తిస్థాయిలో జరగటానికి అవకాశం లేదు కాబట్టి సెలవులు అనంతరం విచారణకు తీసుకోవాలని చంద్రబాబు తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్ర కోర్టును కోరారు. దీంతో తదుపరి విచారణను సుప్రీం కోర్టు జులై 24వ తేదీకి వాయిదా వేసింది. జూలై 24 తరువాత వాయిదాలు కోరవద్దని సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు జూలై 24కి వాయిదా వేసింది.
అసలేం జరిగిందంటే..
2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బు ఎరగా చూపి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు చంద్రబాబు, రేవంత్ రెడ్డి ప్రయత్నించారు. ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే అయినా స్టీఫెన్సన్ను ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాలని చంద్రబాబు ప్రలోభ పెట్టారు. స్టీఫెన్సన్కు డబ్బు ఇవ్వడానికి వెళ్లిన ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించినా అసలు కథ నడిపింది మాత్రం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడేనని ఆరోపణలున్నాయి. రేవంత్ రెడ్డి డబ్బు తీసుకొని స్టీఫెన్ సన్ వద్దకు వెళ్లిన సందర్భంలో చంద్రబాబు నాయుడు స్టీఫెన్సన్తో ఫోన్లో మాట్లాడారు. ఫోన్లో మాట్లాడిన ఆడియోను ఏసీబీ బయటపెట్టింది. ఆ సంభాషణలో చంద్రబాబు స్టీఫెన్సన్తో మాట్లాడుతూ”మనోళ్లు బ్రీఫ్డ్ మీ” అనే ఆడియో క్లిప్ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. కాగా ఆ గొంతు చంద్రబాబుదేనని ఫోరెన్సిక్ ఇప్పటికే నిర్ధారించింది.