సీఎం జగన్ కి ప్రజల్లో దక్కుతున్న ఆదరణను ఓర్వలేక ఆయనపై హత్య ప్రయత్నానికి పూనుకోవడం కలకలం రేపుతోంది. మేమంతా సిద్ధం బస్సు యాత్రను సీఎం జగన్ విజయవాడలో కొనసాగిస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఆయనను అడ్డు తొలగించుకోవడమే లక్ష్యంగా గుర్తు తెలియని ఆగంతకుడు సింగ్ నగర్ లోని వివేకానంద రెండో అంతస్తు నుండి దాడికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
కాగా సీఎం జగన్ యాత్ర కారణంగా కరెంటు వైర్లు తగులుతాయనే ఉద్దేశ్యంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీన్ని అనువుగా మలచుకున్న నిందితుడు సీఎం జగన్ పై దాడికి పాల్పడ్డాడు. ఒక పదునైన వస్తువు సీఎం జగన్ ఎడమ కంటి పై భాగంలో కనుబొమ్మ పైన బలంగా తాకడంతో సీఎం జగన్ కి గాయం అయింది. పక్కనే ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ కు కూడా కంటిపై గాయం కావడం గమనార్హం. టప్ అనే శబ్దం విన్నానని ఎంపీ కేశినేని నాని చెబుతుండడంతో దుండగుడు ఎయిర్ గన్ వాడి ఉంటాడనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
కాగా తనకు గాయమై రక్తం కారుతున్నా ప్రథమ చికిత్స అనంతరం సీఎం జగన్ అదే చిరునవ్వుతో యాత్రను కొనసాగించడం విశేషం. యాత్ర ముగిసిన అనంతరం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న జగన్ నైట్ స్టే పాయింట్ కి వెళ్లిపోయారు. సీఎం జగన్ కి రెండు కుట్లు పడగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించడంతో ఈరోజు యాత్రకు సీఎం జగన్ బ్రేక్ ఇచ్చారు.
కాగా సీఎం జగన్ పై జరిగిన దాడిని ప్రధాన మాంత్రి మోడీ ఖండించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, కేటీఆర్ సహా పలువురు నేతలు సీఎం జగన్ దాడిని ఖండిస్తూనే ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సీఎం జగన్ పై దాడి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఘటనాస్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన క్లూస్ టీమ్ కొన్ని ఆధారాలను సేకరించింది. ఘటనాస్థలంలో వేలిముద్రలను సేకరించిన పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించిపలువురు అనుమానితులను విచారిస్తున్నారు. కాగా ఈ ఘటనకు పాల్పడిన నిందితులను త్వరలో పట్టుకోవాలని వైసీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి.