పల్నాడు జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల్లో చిలకలూరిపేట విలక్షణమైనది. 1983 నుండి 2014 రాష్ట్ర విభజన వరకు కూడా ఎప్పుడు ఆ నియోజకవర్గం రెండు సార్లు ఒకే పార్టీని గెలిపించిన చరిత్రలేదు. రాష్ట్ర విభజన తరువాత మాత్రమే మళ్ళీ 2014లో తిరిగి తెలుగుదేశం అభ్యర్ధిగా ఉన్న పత్తిపాటి పుల్లారావుని గెలిపించింది. అయితే ఆ ఎన్నిక అభ్యర్ధి పని తీరుపై కాకుండా రాష్ట్ర విభజన సెంటిమెంట్ పైనే జరిగింది కాబట్టి ఆ విజయాన్ని పేట వాసులు సీరియస్ గా తీసుకోలేదు. ఇక 2019 ఎన్నికల్లో మళ్ళీ అభ్యర్ధిని మార్చి వైసీపీ తరుపున నిలబడిన విడుదల రజనీని గెలిపించారు పేట ప్రజలు.
అయితే తెలుగుదేశంవారు ఈ లెక్కలు చెబుతూ మళ్ళీ చిలకలూరి పేట ప్రజలు తిరిగి తెలుగుదేశానికే పట్టం కడతారని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో తెలుగుదేశం విజయావకాశాల ఆశకి, పేట ముస్లింస్ రూపంలో పెద్ద అడ్డంకే ఎదురయ్యేలా ఉంది. చిలకలూరి పేట నియోజకవర్గంలో ముస్లింలు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు . సామాజిక వర్గాల పరంగా లెక్కిస్తే కమ్మ, ఎస్సీ, ముస్లింలు పెద్దసంఖ్యలో ఉన్నారు. యడ్లపాడు, చిలకలూరిపేట మండలాల్లోని గ్రామాల్లో ముస్లిం జనాభా అధికంగా ఉంది. పట్టణంలోని గుర్రాలచావిడీ, సుభానినగర్, మద్దినగర్, పురుషోత్తమ పట్నం ప్రాంతాల్లో ముస్లింలు పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు. అయితే చిలకలూరిపేట నియోజకవర్గంలో నిన్న మొన్నటి వరకూ టీడీపీ పట్ల కాస్త సానుకూల ధోరణి కనబర్చిన ముస్లింలు, బీజేపీతో టీడీపీ జట్టుకట్టడంతో ఆందోళనకు గురవుతున్నారు.
బీజేపీ పాలిత ఉత్తరాది రాష్ట్రాల్లో మతోన్మాద అలజడులు, తాము ఆంధ్రప్రదశ్ రాష్ట్రంలో అధికారం చేపడితే 4% ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న ప్రకటనలు, హిజాబ్, హలాల్, అజాన్ ప్రార్ధన మైక్ వివాదం, వక్ఫ్ బోర్డు ఆస్తులను స్వాధీనం, సీఏఏ, ఎన్ఆర్సీ చట్టరూపం దాల్చబోతున్నాయని సోషల్ మీడియాలో విస్తృతంగా జరుగుతున్న ప్రచారంతో చిలకలూరి పేటలో ఉన్న ముస్లిం సామాజిక వర్గం పూర్తిగా తెలుగుదేశానికి దూరం జరిగిందనే వాదన వినిపిస్తుంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ పాలనలో బీజేపీ పెత్తనం చెలాయిస్తే మతపరమైన అలజడులు చెలరేగటంతో పాటూ రిజర్వేషన్లకు ఎసరు తెస్తారన్న భయం మైనార్టీల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
గతంలో నియోజకవర్గ ముస్లింలు 40% మంది టీడీపీకి మద్దతుగా ఉండేవారు. ప్రస్తుతం బీజేపీ భయం కారణంగా ఆ లెక్కలు పూర్తిగా మారుతున్నాయి. టీడీపీకి చెందిన పలువురు ముస్లిం నాయకులు, కార్యకర్తలు ఇటీవల వైసీపీలో పెద్ద సంఖ్యలో చేరుతున్నారు. పోలింగ్ కు కేవలం 15రోజులుమాత్రమే సమయం ఉండటం, ముస్లిం ప్రజానీకం ఆలోచనలలో వేగంగా టీడీపీకి వ్యతిరేకంగా మార్పులు చెందడం చూస్తే టీడీపీ చిలకలూరిపేటపై పెట్టుకున్న ఆశలు పూర్తిగా ఆవిరైపోయినట్టే అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది.