‘నా సొంత గడ్డ పులివెందులంటే నా ప్రాణంతో సమానం. ప్రతి కష్టంలో నా వెంట నడిచింది. పులివెందులంటే నమ్మకం, అభివృద్ధి, సక్సెస్ స్టోరీ. మంచి మనసు, బెదిరింపులకు లొంగకపోవడం మన కల్చర్’ అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు.∙నామినేషన్ సందర్భంగా గురువారం ఆ ఊరిలో జరిగిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. టీడీపీ మాఫియా నాలుగు దశాబ్దాల దుర్మార్గాల్ని ఎదురించింది పులివెందుల బిడ్డలే. కరువు ప్రాంతంగా ఉన్న ఇక్కడికి కృష్ణా నది నీళ్లు వస్తున్నాయి. పులివెందుల కల్చర్, కడప కల్చర్, రాయలసీమ కల్చర్ అంటూ మనపై వేలెత్తి చూపిస్తున్నారు. కానీ ఇక్కడి అభివృద్ధికి కారణంగా వైఎస్సార్. ఆయన, నాపై లేనిపోని ముద్రలు వేసి దెబ్బతీయడానికి చంద్రబాబు, దత్తపుత్రుడు, పురందేశ్వరి ప్రయత్నిస్తున్నారు. ఈ మధ్య కాలంలో కొత్తగా వైఎస్సార్ వారసులమని.. వారి కుట్రలో భాగంగా ప్రజల మధ్యకు కొందరు వచ్చారు.
వైఎస్సార్ కుటుంబాన్ని టార్గెట్ చేసింది ఎవరు? నాన్నపై కక్షతో, కుట్రతో ఆయనపై కేసులు పెట్టింది ఎవరు?. ఇప్పుడు వారి పార్టీలో చేరిన వాళ్లు ఆయనకు వారసులా? ఆ మహానేతకు వారసులు ఎవరో చెప్పాల్సింది ప్రజలే. ఆయన లెగసీని లేకుండా చేయాలని చూసింది ఎవరు? ఆ పేరును సీబీఐ ఛార్జ్‌షీట్‌లో చేర్చింది ఎవరు?. మీ బిడ్డను ఎదుర్కోలేక ఇంతమంది ఏకమయ్యారు. కానీ సంక్షేమం, అభివృద్ధిలో వైఎస్సార్ బాటలో మరో రెండు అడుగులు ముందుకు వేసింది మన ప్రభుత్వం.
పసుపు చీర కట్టుకుని వాళ్ల కుట్రలో భాగమైన వీళ్లా వైఎస్సార్ వారసులు?. ఆయనపై కుట్రలు చేసిన వాళ్లు ఇస్తున్న స్క్రిప్ట్‌లు చదువుతున్న వాళ్లు వారసులు ఎలా అవుతారు. వైఎస్ వివేకానందను చంపింది ఎవరో అందరికీ తెలుసు. నేనే చంపానన్న వ్యక్తి బయట తిరుగుతున్నాడు. అవినాష్ ఏ తప్పు చేయలేదని నేను నమ్మాను కాబట్టే టికెట్ ఇచ్చాను. వివేకాను చంపిన నిందితుడికి మద్దతిస్తుంది ఎవరు? ఆయనకు రెండో భార్య ఉన్నది వాస్తవం కాదా? అవినాష్ లేవనెత్తిన ప్రశ్నలు సహేతుకమే కదా? అతని జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. నా చెల్లెమ్మలతో నడిపిస్తున్న ఈ కుట్రలను, చెడిపోయిన రాజకీయాల్ని ప్రజలు గమనిస్తున్నారు. పాలనలో మీ జగన్‌ను కొట్టేవాళ్లెవరూ లేరు. మళ్లీ ఆశీర్వదించాలని పులివెందుల ప్రజల్ని కోరుతున్నారు.