పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట నియోజకవర్గం టీడీపీ టికెట్ పోరు తారాస్థాయికి చేరిందా?
ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అవునని అనిపించక మానదు? .
టీడీపీ ఆవిర్భావం నుండి 1999 వరకూ నరసరావుపేట టీడీపీకి పెట్టని కోటగా నిలిచింది. 1983 టీడీపీ ఆవిర్భావం నుండీ 99 వరకూ జరిగిన అయిదు శాసనసభ ఎన్నికల్లో వరసగా విజయాలు సాధిస్తూ వచ్చారు టీడీపీ నేత కోడెల శివప్రసాద్. 2004 లో వైఎస్ హవాలో కొట్టుకుపోయిన ఉద్దండుల్లో కోడెల ఒకరు. నాటి వరకూ ఓటమి ఎరగని నేతగా పేరున్న కోడెల వరసగా 2004, 2009 లలో ఓడిపోయిన తరువాత 2014 ఎన్నికల నాటికి ఇహ నర్సరావుపేటలో టీడీపీ గెలవదు అన్న నిచ్చయానికి వచ్చి సత్తెనపల్లి స్థానానికి మారాడు.
2014 లో టీడీపీ, బిజెపి పొత్తులో భాగంగా నరసరావుపేట స్థానం బిజెపికి కేటాయించడంతో వ్యాపారస్తుడైన నలబోతు వెంకట్రావు బిజెపి తరుపున పోటీ చేయగా వైఎస్సార్సీపీ నుండి పోటీ చేసిన డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు బిజెపి అభ్యర్థి వెంకట్రావు. ఆ తరువాత 2019లో టీడీపీ నుండి పోటీ చేసిన బీసీ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ చదలవాడ అరవింద బాబు వైసీపీ అభ్యర్థి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి చేతిలో 32 వేల ఓట్ల తేడాతో ఘోర పరాజయం పాలయ్యారు.
ఈ ఘటనతో నరసరావుపేట టీడీపీ శ్రేణులు పూర్తిగా నిర్వేదం చెందారని చెప్పొచ్చు.
నాటి నుండీ పేట టీడీపీ ఇంచార్జ్ గా ఓటమి పాలయ్యిన అరవింద బాబు వ్యవహారిస్తుండగా 2021 నుండీ టీడీపీ ఆధిపత్య సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ కడియాల వెంకటేశ్వర రావు బ్రదర్స్ కూడా టీడీపీ టికెట్ ఆశిస్తూ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహారించసాగారు . దీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉన్న కడియాల బ్రదర్స్ లో వెంకటేశ్వర రావు డాక్టర్ కాగా వీరి తమ్ముడు రమేష్ టీడీపీ హయాంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ గా వ్యవహారించారు. మరో వైపు అదే సామాజిక వర్గానికి చెందిన సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం నుండి నల్లపాటి రాము అనే రాజకీయ నాయకుడు కూడా టికెట్ ఆశిస్తుండటంతో నరసరావుపేట టీడీపీ స్థానం మూడు స్థంభాలాటలాగా మారి ఎవరి ప్రయత్నాలు వారు చేస్తూ వచ్చారు ఇన్నాళ్ళూ.
ముగ్గురిలో ఎవరికి ఇచ్చినా మిగతా ఇద్దరూ సపోర్ట్ చేయక టికెట్ పొందిన వారు ఓటమి పాలవ్వుతారన్న రిపోర్ట్స్ తో చంద్రబాబు తలపట్టుకొన్నవేల ఎవరూ ఊహించని విధంగా రేసులో మరో రెండు కొత్త పేర్లు చేరటంతో నివ్వెరపోవడం మిగతా ముగ్గురి వంతు అయ్యింది. ఆ ఇద్దరిలో ఒకరు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు కాగా, మరో వ్యక్తి వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి పదవికి, ప్రకాశం జిల్లా సంతమాగుళూరు ఎంపీపీ పదవికి ఇటీవల రాజీనామా చేసిన బాలినేని శిష్యుడు అట్లా చిన్న వెంకట రెడ్డి కావడం విశేషం .
గత వారం రోజులుగా టీడీపీ పబ్లిక్ పల్స్ తెలుసుకోవటానికి చేస్తున్న సర్వే కాల్స్ లో ప్రధానంగా అరవింద బాబు, ప్రత్తిపాటి పుల్లా రావు, అట్లా చిన్న వెంకట రెడ్డిల మూడు పేర్లు ఉదహరిస్తూ మీకే అభ్యర్థి కావాలో అభిప్రాయం చెప్పండంటూ నరసరావుపేట ప్రజల అభిప్రాయం కోరుతుండటంతో టికెట్ ఆశించి ఇన్నాళ్ళూ పార్టీ కార్యక్రమాలలో యాక్టివ్ గా పాల్గొంటూ, మహానాడులకు లక్షల్లో చందాలు ఇచ్చి, గత మూడు నెలలుగా అన్నా కాంటీన్లు నడుపుతున్న మిగతా అభ్యర్థులు అధిష్టానం పై కారాలు మిరియాలు నూరుతున్నట్టు సమాచారం .
ఈ క్రమంలో పేట టీడీపీ టికెట్ ఎవరికి దక్కినా మిగతా అభ్యర్థులు కట్టకట్టుకొని అతన్ని ఓడిస్తారని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం .