ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి దృష్టి ఇప్పుడు ఎన్నికల ఫలితాలపైనే ఉంది. కాబోయే ముఖ్యమంత్రి ఎవరు? ఏ పార్టీ అధికారం చేబట్టబోతుంది అనే అంశాలపైనే ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా తీవ్రమైన చర్చ నడుస్తుంది. దేశంలో ఏ రాష్ట్రంలో జరగనంత అధికశాతం పోలింగ్ ఏపీలో జరిగిందంటేనే ఏపీ ప్రజలు ఈ ఎన్నికలను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో అర్ధమవుతుంది. జగన్ పై చంద్రబాబు అనుకూల మీడియాగా తాము చేసిన ప్రచారాన్ని నమ్మి ప్రజలు పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొని జగన్ కు వ్యతిరేకంగా ఓట్లు వేశారని ఎల్లో మీడియా నమ్ముతుంటే, గతంలో ఏ ముఖ్యమంత్రి అందించని సంక్షేమ ఫలితాలు జగన్ నేరుగా ప్రజలకి అందించడం కారణంగానే మళ్ళీ ప్రజలు జగన్ నే బలంగా కోరుకున్నారని వైసీపీ నేతలు అభిమానులు నమ్ముతున్నారు.
ఇదిలా ఉంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 మీడియా ఛానల్స్ చెబుతున్నట్టు చంద్రబాబు అధికారంలోకి రాబోతున్నారని తెలుగుదేశం కార్యకర్తలు సంబరపడిపోతుంటే , వైసీపీ కార్యకర్తలు మాత్రం గతంలో సైతం ఇవే మీడియా సంస్థలు చంద్రబాబు అధికారంలోకి వస్తారని బలంగా చెప్పారని, కానీ వారి జోస్యం ఫలించలేదని ఇప్పుడు కూడా ఫలించే అవకాశం లేదని బల్ల గుద్ది చెబుతున్నారు. ముఖ్యంగా 2009లో ఈనాడు పత్రిక యాజమాన్యం పోలింగ్ తరువాత చేసిన సర్వేలో తెలుగుదేశం వస్తుందని చెప్పినా అది ఫలించలేదని. అలాగే 2019లో కూడా జోస్యం చెప్పారని చివరికి 23 సీట్లతోనే టీడీపీ సరిపెట్టుకుందని, ఇప్పుడు కూడా వారి జోస్యంలో పెద్ద మార్పు ఏమీ ఉండదని వైసీపీ శ్రేణులు చెబుతున్న మాట. ఎవరి మాటని ప్రజలు నిజం చేస్తారో తెలియాలంటే జూన్ 4వరకు వేచి చూడాల్సిందే.