జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. 20 సీట్లకే పవన్ ముఖ్యమంత్రి అవుతారంట. ఆ 20 సీట్లు కూడా త్యాగం చేసి జనసేనను క్లోజ్ చేస్తే పవన్ త్యాగశీలిగా మిగిలిపోతాడని ముద్రగడ ఎద్దేవా చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో వైసీపీ కాపు సోదరులు ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
పవన్ పేకాట క్లబ్‌లు నడిపే వారితో తనను తిట్టిస్తున్నాడని సోషల్ మీడియాలో చెత్త మెసేజ్‌లు పెడుతూ తనను అవమానిస్తున్నారని ముద్రగడ వెల్లడించారు. సీఎం జగన్ పాలనపై తాను ప్రశ్నించలేదంటున్న పవన్, చంద్రబాబు ఐదేళ్ల పరిపాలనలో పవన్ ఏ మడుగులో దాక్కున్నారు? మీరు సమాధానం చెప్తే అప్పుడు తాను సమాధానం చెప్తా. తెరవెనుక ఉండి మాట్లాడించడం మగతనం కాదు.. దమ్ము ధైర్యం ఉంటే నేరుగా తన గురించి ప్రశ్నించమని ముద్రగడ మండిపడ్డారు.
చంద్రబాబు లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేయాలని చూస్తాడు కానీ పవన్‌ను ఎందుకు సీఎంను చేయాలనుకుంటాడు. 2024 ఎన్నికల్లో జనసేన పార్టీని ప్యాకప్ చేసి పంపాలని ప్రజలను కోరిన ముద్రగడ పిఠాపురంలో తనను ఓడించేందుకు కోట్లు ఖర్చు చేస్తున్నారని పవన్ చెబుతూనే మరోవైపు ఆయనే రెండు లక్షల మెజార్టీ వస్తుందంటూ ప్రచారం చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. టీడీపీ,జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే సీఎం జగన్ పథకాలను అమలు చేస్తామంటున్నారు. ఆ పథకాలను అమలు చేయడానికి మీకు అధికారం కావాలా అని ముద్రగడ ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలోని పేదలకు అండగా ఉన్నారు. పేదలు ఐదు వేళ్లతో అన్నం తినే పరిస్థితి గతంలో ఎవరూ చేయలేదు. కానీ సీఎం జగన్ పేదల అభ్యున్నతి కోసం కృషి చేశారు. పేదల పెన్నిది సీఎం జగన్‌ను తిరిగి ముఖ్యమంత్రిని చేయాలని ముద్రగడ పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో ముద్రగడ పద్మనాభం, మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ వంకా రవీంద్ర, నరసాపురం పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి ఉమాబాల, ఏలూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి కారుమూరి సునిల్ కుమార్ ఇతర నేతలు పాల్గొన్నారు.