ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలు జోరుగా ప్రచారంలో మునిగి తేలుతున్నాయి. ఒక ప్రచార సమావేశంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పైన తీవ్రస్థాయిలో సీపీఐ రామకృష్ణ మండిపడ్డారు. రామకృష్ణ మాట్లాడుతూ 40 సంవత్సరాలు సీనియారిటీ అని చెప్పే చంద్రబాబుకి ఉన్న కన్ఫ్యూజన్ ఎవరికీ లేదని వెల్లడించారు. ల్యాండ్ టైటిలింగ్ పై దుష్ప్రచారం చేస్తున్న చంద్రబాబు ఆ చట్టాన్ని తీసుకొచ్చింది బీజేపీ అనే సంగతి ఎందుకు మరిచాడని ప్రశ్నించారు. ప్రచార సభల్లో ల్యాండ్ టైటిలింగ్ అంశంపై వైఎస్ఆర్సిపి నిందిస్తున్న చంద్రబాబు బీజేపీని ఎందుకు నిందించడం లేదని ఇలాంటి ద్వంద వైఖరి ఉన్న నేతను నేనెప్పుడూ చూడలేదని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
జాతీయస్థాయిలో బీజేపీ పాలసీలు వేరే విధంగా ఉన్నాయి, వారు వాటిని పాటిస్తామని తెలుపుతూ బహిరంగంగానే ప్రకటన చేస్తుంటారు కానీ తెలుగుదేశం అంశాల పైన స్పష్టత తీసుకోకపోవడం విడ్డూరమని పేర్కొన్నారు. ముస్లిమ్స్ కు ప్రస్తుతం ఉన్న నాలుగు శాతం రిజర్వేషన్ ను బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే ముస్లిమ్స్ రిజర్వేషన్ తీసివేస్తామని ఆ పార్టీ నాయకులు బహిరంగంగానే ప్రకటించుకుంటూ వస్తున్నారు. అలాంటప్పుడు బీజేపీతో జోడీ కట్టి ముస్లిం రిజర్వేషన్లు కొనసాగిస్తానంటే మోసం కాదా అని రామకృష్ణ ప్రశ్నించారు. గతంలో మోడీని తిట్టి నేడు పొగుడుతున్నాడు ఈ నాలుగు సంవత్సరాలలో ఆంధ్ర ప్రదేశ్ కి మోడీ ఏ మంచి చేశాడో చెప్పాలని, కూటమి మేనిఫెస్టో విడుదల సందర్భంగా పురందేశ్వరి వస్తారంటూ మీడియా సమావేశంలో తెలిపి ఆ సమావేశానికి ఆమె ఎందుకు హాజరు కాలేదో తెలపాలని, కూటమి మేనిఫెస్టోతో బీజేపీకి సంబంధం లేదని బీజేపీ నేతలు చెప్పడం దేనికి సంకేతం అని ప్రశ్నించారు. అవకాశవాదం, స్వార్థంతో చంద్రబాబు వ్యవహరిస్తున్నారు అని చంద్రబాబు నాయుడుని నమ్మకండి అంటూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సీపీఐ రామకృష్ణ పిలుపునిచ్చారు.