2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పులివెందుల అసెంబ్లీకి సంబంధించి నామినేషన్ ను రేపు దాఖలు చేయనున్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఈరోజుతో ముగియనుంది. చివరి మేమంతా సిద్ధం సభ ముగిసిన తర్వాత టెక్కలి నుంచి హెలికాప్టర్లో విశాఖపట్నం చేరుకొని అక్కడి నుంచి గన్నవరంకి విమానంలో వస్తారు. ఈరోజు సాయంత్రం తాడేపల్లి ముఖ్యమంత్రి నివాసంలో బస చేసి రేపు ఉదయం 8.15 నిమిషాలకు గన్నవరం నుంచి కడప చేరుకుంటారు. కడప నుంచి హెలికాప్టర్ ద్వారా పులివెందుల చేరుకొని మొదట బహిరంగ సభలో పాల్గొని తర్వాత తన నామినేషన్ దాఖలు చేయనున్నారు.
సీఎం జగన్ ఇప్పటికే సిద్ధం సభలను జోన్లు వారిగా నిర్వహించి తన కార్యకర్తలని సిద్ధం చేసి, రెండో విడతగా మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇడుపులపాయ నుంచి మొదలుపెట్టి శ్రీకాకుళం దాకా ప్రజలతో మమేకం అవుతూ ఈ బస్సు యాత్ర కొనసాగించారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా ప్రతి జిల్లాలో ఒక సభను నిర్వహించుకుంటూ వచ్చి పోటీ చేయబోయే అభ్యర్థులను ప్రకటించి పరిచయం చేస్తూ వచ్చారు. ఇప్పుడు తుది విడతగా జగన్ కోసం సిద్ధం అంటూ తన ఎన్నికల ప్రచార కార్యక్రమాలను మొదలు పెట్టనున్నట్లు సమాచారం. జగన్ కోసం సిద్ధం పేరిట నిర్వహించబోయే మొదటి సభ పులివెందుల నియోజకవర్గంలో జరగనుంది. రేపు నామినేషన్, సభ తర్వాత 26వ తేదీన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనుంది అని ఇప్పటికే ప్రకటించారు. ఇలా వరస సభలతో ప్రచారంలో మరింత జోరు పెంచారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి .