ఎన్డీఏలో చేరేశాం.. విజయం మనదేనంటూ చంద్రబాబు నాయుడు విర్రవీగాడు. కానీ జరుగుతోంది వేరు. ఇక్కడ సమీప బంధువైన పురందేశ్వరి, ఇతర టీడీపీ అనుకూల బీజేపీ నాయకులు పిలవగానే స్పందిస్తున్నారు కానీ హస్తిన పెద్దల నుంచి బాబుకు ఇంత వరకు ఆశీస్సులు లభించలేదు.
మార్చి 17వ తేదీన చిలకలూరుపేట సమీపంలో టీడీపీ ప్రజాగళం సభ నిర్వహించింది. దీనికి ప్రధాని నరేంద్రమోదీ, చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పురందేశ్వరి హాజరయ్యారు. అయితే సభ నిర్వహించడంలో తెలుగుదేశం విఫలమైంది. వేల సంఖ్యలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చారు. కనీసం పుష్పగుచ్ఛం ఇచ్చి పీఎంను సన్మానించలేకపోయారు. మైక్ చాలాసార్లు కట్ అయ్యింది. వీటిని కూడా టీడీపీ వైఎస్సార్సీపీపై నెట్టాలని చూసింది.
చిలకలూరిపేట సభ తర్వాత కూటమి వైపు నుంచి ఏడు భారీ సభలు ప్లాన్ చేశారని ఎల్లో మీడియాలో వార్తలొచ్చాయి. వాటిల్లో మూడింటిలో మోదీ, మిగిలిన చోట్ల కమలం పార్టీ అగ్రనేతలు పాల్గొంటారని ప్రచారం చేశారు. కర్నూలు లేదా కడపలో ఒక సభ పెట్టి ప్రధానిని పిలవాలని కూటమి నేతలు అనుకున్నారు. తిరుపతి లేదా కర్నూలులో ఒకటి పెట్టి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేత మాట్లాడిస్తారని చెప్పారు. విజయనగరంలో సభ పెట్టి ప్రధానిని ఆహ్వానిస్తే ఎలా ఉంటుందనే అంశంపై చర్చ జరిగినట్లు వార్తలొచ్చాయి. ఇక రాజ్‌నాథ్‌సింగ్, అమిత్‌షాలతో సభలు ఏర్పాటు చేయించాలని ప్లాన్ చేసినట్లు పేజీలకు పేజీలు రాసుకున్నారు.
కాగా మొదటి సభ ఫెయిలవడంతో హస్తిన పెద్దలు చంద్రబాబును లైట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజులుగా బాబు, పవన్ ప్రజాగళం, వారాహి యాత్ర పేరుతో ఉమ్మడి సభలు నిర్వహిస్తున్నారు. వీటికి పురందేశ్వరి హాజరయ్యారు తప్ప ఢిల్లీ నుంచి బీజేపీ పెద్దలు ఎవరూ రాలేదు. ఇంతకీ ఆ ఏడు సభల విషయం ఏమైందనే చర్చ మూడు పార్టీల్లో నడుస్తోంది. ఈనెల 16న విజయనగరం, నెల్లిమర్ల నియోజకవర్గాల్లో, 17న పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల్లో ఉమ్మడి సభలు నిర్వహిస్తారు. ఇంకా మరికొన్ని చోట్ల జరిగే అవకాశముంది. కానీ వీటికి మోదీ, అమిత్‌షా, ఇతర పెద్దలు రారు.
చంద్రబాబంటే హస్తిన కాషాయ పెద్దలు చాలామందికి ఇష్టం లేదు. ఆయన ఏపీలో బీజేపీని ఎదగనివ్వలేదని వారి భావన. ఎన్డీఏలోకి రానిస్తే సీనియర్ నేతలకు టికెట్లు ఇవ్వకుండా తనకు కావాల్సిన పురందేశ్వరి, సుజనా చౌదరి, సీఎం రమేష్, సత్యకుమార్ తదితరులకు టికెట్లు ఇప్పించడంతో ఏపీ సీనియర్ కమలం నేతలు గుర్రుగా ఉన్నారు. అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు. ఇక రఘురామకృష్ణరాజు విషయంలో బాబు ఆడుతున్న డ్రామాలకు వారి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. దీంతో బీజేపీ అధినాయకత్వం ఎన్నికలయ్యాక ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలు చూద్దామని సైలెంట్‌గా ఉన్నట్లు తెలిసింది. పురందేశ్వరి పార్టీని పూర్తిగా డ్యామేజ్ చేశారని, టికెట్లు అమ్ముకున్నారని పెద్దల వద్ద సమాచారం ఉంది.
బాబు మాత్రం మోదీ మరో సభకు రాకపోతే తన పరువు పోతుందని, ఆయన్ను రప్పించేందుకు తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నారు. మొదటి సభలోనే ఆయన చేసిన భజన చూసి మూడు పార్టీల నేతలు అవాక్కయ్యారు. ఈసారి వస్తే మాత్రం కాళ్ల మీద పడి మొక్కడం ఖాయమని చెబుతున్నారు. ఎల్లో మీడియా కొద్దిరోజుల క్రితం వరకు ఏడు సభలంటూ ఊదరగొట్టింది. ప్రస్తుతం ఆ ఊసే ఎత్తడం లేదు. మొత్తానికి మోదీ.. బాబును ఛీ కొట్టాడని పొలిటికల్ సర్కిల్లో ప్రచారం జరుగుతోంది.