ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మిగిలిన పార్టీ నేతలతో పోలిస్తే సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్నారు. ఇప్పటికే మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా ప్రజలతో మమేకం అయిన ముఖ్యమంత్రి జగన్ ఎన్నికలకు సమాయత్తం అవుతూ పలు బహిరంగ సభలు నిర్వహిస్తూ తనకు ఎందుకు ఓటు వేయాలో చాటి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లా వెంకటగిరిలో నిర్వహించిన ప్రచార సభలో సీఎం వైయస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్.జగన్ ఏమన్నారంటే.. ఆయన మాటల్లోనే..
వెంకటగిరి సిద్ధమేనా?.. మధ్యాహ్నం 2.30 గంటలు తీక్షణమైన ఎండ అయినా కూడా.. ఆ ఎండను ఏమాత్రం కూడా ఖాతరు చేయడం లేదు. మీ చిక్కటి చిరునవ్వులు, ఆప్యాయతలకు, ఈ ప్రేమానురాగాలకు మీ బిడ్డ రెండుచేతులు జోడించి పేరుపేరున నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు, నా ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, స్నేహితుడికి.. మీ అందరి ప్రేమానురాగాలకు రెండు చేతులు జోడించి పేరుపేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
మరో రెండు వారాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. మీ కళ్ల ఎదుటే ఈ కురుక్షేత్ర మహాసంగ్రామం కనిపిస్తోంది. మీ అందరితో కూడా ఈరోజు ఒక విన్నపం చేస్తున్నాను. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికలు వచ్చే 5 ఏళ్ల మీ ఇంటింటి అభివృద్ధిని, ప్రతి పేదవాడి భవిష్యత్తును నిర్ణయించబోయే ఎన్నికలని ప్రతి ఒక్కరూ కూడా గుర్తించుకోవాలని ప్రార్థిస్తున్నాను.
ఈ ఎన్నికల్లో జగన్ కు ఓటు వేస్తే మీరు పథకాలన్నీ కొనసాగింపు. పొరపాటు జరిగితే చంద్రబాబుకు ఓటు వేస్తే మన పథకాలన్నీ ముగింపు, మళ్లీ మోసపోవటమే అన్నది ప్రతిఒక్కరూ జ్ఞాపకంలో పెట్టుకోమని కోరుతున్నాను. ఇదే మనకు చరిత్ర చెప్తున్న సత్యం. ఇదే సాధ్యం కాని హామీలతో మేనిఫెస్టో అంటూ చంద్రబాబు చెప్తున్న మోసానికి అర్థం. ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోమని కోరుతున్నాను. చంద్రబాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే అన్న విషయం ప్రతి ఒక్కరూ జ్ఞాపకం పెట్టుకోమని కోరుతున్నాను.
బాబు మోసాల మీద తిరుగుబాటు చేసి వైఎస్సార్సీపీ జెండాను ఎగురవేసిన ఈ కోటలో మళ్లీ మీ ముందుకు వచ్చిన ఈ మోసాల బాబును ఈ ఒరిజినల్ 420 గారిని కొన్ని ప్రశ్నలు అడుగుదామా? చంద్రబాబును అడుగుదామా అక్క కొన్ని ప్రశ్నలు? బాబూ.. ఓ చంద్రబాబు నేను చేసిన కొన్ని స్కీముల పేర్లు నేను చెప్తాను మరి నువ్వు చెప్పగలవా? నువ్వు చేసిన మంచి ఏ పేదకైనా కూడా, ఏ ఇంటికైనా కూడా ఉందా అని ఈ సందర్భంగా అడుగుతున్నాను. 14 ఏళ్లు సీఎం అంటావ్, 3 సార్లు సీఎంగా చేశానంటావు.. మరి 58 నెలల్లో మనం అమలు చేసిన స్కీములు కొన్నింటి పేర్లు నేను చెప్తాను రెడీనా?
ఇంటి వద్దకే రూ.3 వేల పెన్షన్ కానుక రాగానే గుర్తుకు వచ్చేది మీ జగన్. పూర్తి ఫీజులు చెల్లిస్తూ ప్రతి పేదఅక్కచెల్లెమ్మకు తోడుగా ఉంటూ ఓ విద్యాదీవెన, ఓ వసతిదీవెన అంటే గుర్తుకు వచ్చేది మీ జగన్. బడులకు పంపే తల్లులకు ప్రోత్సాహకమిస్తూ ఆ తల్లులకు తోడుగా ఉంటూ ఒక అమ్మఒడి అంటే గుర్తుకు వచ్చేది మీ జగన్. అక్కచెల్లెమ్మలకు తోడుగా ఓ చేయూత, ఓ కాపు నేస్తం, ఓ ఈబీసీ నేస్తం అంటే, ఓ ఆసరా అంటే, ఓ సున్నావడ్డీ అంటే, అక్కచెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల పట్టాలు అంటే, అందులో కడుతున్న 22 లక్షల ఇళ్లు అంటే, మహిళా సాధికారత అంటే గుర్తుకు వచ్చేది మీ జగన్. రైతన్నలకు అండగా ఉంటూ రైతన్నను చేయి పట్టుకుని నడిపిస్తూ, పెట్టుబడికి రైతన్నకు తోడుగా ఉంటూ ఓ రైతుభరోసా అన్నా గ్రామాలల్లో రైతుభరోసా కేంద్రాలన్నా రైతన్నను చేయి పట్టి నడిపిస్తున్నదెవరూ అంటే గుర్తుకు వచ్చేది మీ జగన్.
ప్రతి పేదవాడు వైద్యం కోసం అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదని ఆ పేదవాడికి ఓ విస్తరించిన ఆరోగ్యశ్రీ , ఆ పేదవాడికి ఆపరేషన్ అయ్యాక కూడా విశ్రాంతి సమయంలో అండగా ఉంటూ ఆరోగ్య ఆసరా, ఇంటింటికీ జల్లెడ పడుతూ ఆ పేదవాడికి మందులిస్తూ, టెస్టులు చేస్తూ ఓ ఆరోగ్య సురక్ష, ఆ పేదవాడికి అండగా ఉంటూ ఫ్యామిలీ డాక్టర్, గ్రామాల్లోనే విలేజ్ క్లినిక్ అంటూ ఆ పేదవాడికి అండగా అడుగులు వేస్తున్నప్పుడు ఆ పేదవాడికి గుర్తుకొచ్చేది మీ జగన్.
స్వయం ఉపాధికి ఊతమిస్తూ ఒక లా నేస్తమన్నా, ఒక మత్స్యకార భరోసా అన్నా, ఒక నేతన్న నేస్తం, వాహనిమిత్ర, చేదోడు, తోడు ఇలా ఆ స్వయం ఉపాధికి అండగా ఉన్నప్పుడు ఆ పేదవాడికి గుర్తుకొచ్చేది మీ జగన్. ప్రతిగ్రామంలోనూ ఓ సచివాలయ వ్యవస్థ, ప్రతి 60-70 ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ, ఇంటికే వచ్చే పౌరసేవలు, ఇంటికే వచ్చే పథకాలు చూస్తే.. గుర్తువచ్చేది మీ జగన్.
నాడు-నేడుతో బాగుపడ్డ ఇంగ్లీష్ మీడియం బడులు, నాడు-నేడుతో బాగుపడ్డ మన గవర్నమెంట్ హాస్పిటళ్లు చూస్తే గుర్తుకువచ్చేది మీ జగన్. గ్రామంలోనే మహిళా పోలీస్, ప్రతి అక్కచెల్లెమ్మ ఫోన్లోనో దిశ యాప్ చూస్తే.. గుర్తుకొచ్చేది మీ జగన్. గుర్తుకొచ్చేది మీ బిడ్డ.
మరి ఇన్ని స్కీములు ఈ 58 నెలలకాలంలోనే వచ్చినవి . మరి బాబూ.. చంద్రబాబు నీ పేరు చెబితే గుర్తుకువచ్చే స్కీములేంటయ్యా అని ఈ చంద్రబాబును అడుగుతున్నాను. ఇంటింటికీ నువ్వు చేసిన మంచి ఏమిటయ్యా చంద్రబాబూ అని అడుగుతున్నాను. 14 ఏళ్లు సీఎం అంటావు, నిన్ను చూసిన వెంటనే ఏ పేదవాడికైనా గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా ఉందా అని అడుతున్నాను. ఒక్కటంటే ఒక్క మంచి ఉందయ్యా అని అడుతున్నాను.
అయ్యా బాబు నిన్ను మరోమాట అడుగుతాను.. సమాధానం చెబుతావా చంద్రబాబూ? 2014 నుంచి 2019 మధ్య నీ పాలన జరిగింది. ఆ చంద్రబాబు పాలనలో …. ఆ 2014 నుంచి 2019 మధ్య జన్మభూమి కమిటీలను నువ్వు పెడితే, 2019లో మేం అధికారంలోకి రాగానే మీ జగన్ ప్రతి గ్రామంలోనూ గ్రామ సచివాలయాలు తీసుకొచ్చాడు, ప్రతి గ్రామంలోనూ, ప్రతి వార్డులోనూ వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చాడు. అంటే నీది జన్మభూమి కమిటీల వ్యవస్థ, నాది సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ. మరి చంద్రబాబును నేను అడుగుతున్నాను. నువ్వు పెట్టిన జన్మభూమి కమిటీల వ్యవస్థ మీద నీకు నమ్మకం, విశ్వాసం ఉంటే మళ్లీ నువ్వు అధికారంలోకి వస్తే మళ్లీ జన్మభూమి కమిటీలు తెస్తానని చెప్పి చెప్పే ధైర్యం నీకుందా చంద్రబాబు అని అడుగుతున్నాను. ఇదే చంద్రబాబును అడుగుతున్నాను. ఆ ధైర్యం నీకుందా అని అడుగుతున్నాను.
నువ్వేమంటున్నావ్ చంద్రబాబూ.. నేను పెట్టిన అంటే మీ జగన్ పెట్టిన ఈ వాలంటీర్లు, ఈ సచివాలయాల వ్యవస్థలను కొనసాగిస్తానంటావేంటబ్బా?. వాలంటీర్లకు నువ్వు జీతం పెంచుతాను అంటావేంటబ్బా? వీటిని చేస్తానంటావే తప్ప నీ హయాంలో నువ్వు పెట్టుకున్న నీ జన్మభూమి కమిటీలను నువ్వు తీసుకొస్తానని చెప్పే ధైర్యం నీకు ఎక్కడుంది చంద్రబాబు అని అడుగుతున్నాను.
అయ్యా చంద్రబాబు.. నువ్వు 14 ఏళ్లు పరిపాలించావ్ కానీ ప్రజల బిడ్డగా నేను కేవలం 58 నెలలే పరిపాలన చేశాను. మరి నేను కేవలం 58 నెలల పరిపాలన చేస్తే 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన నువ్వేమంటావ్.. జగన్ అమ్మఒడి పెడితే నువ్వేమంటావ్? జగన్ కన్నా నేను ఎక్కువ ఇస్తా అంటావ్. మరి జగన్ 58 నెలల పరిపాలనే చేశాడు నువ్వు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశావు. జగన్ చేయూత పెడితే నువ్వేమంటావ్ నేను ఇంకా ఎక్కువమందికి ఇస్తాను అంటావ్. జగన్ రూపాయి ఇస్తే నువ్వు రెండు రూపాయలు ఇస్తానంటావు.
ఒకవేళ జగన్ ఏదైనా స్కీమ్ తీసుకువస్తే, ఆ స్కీమ్ బాగోలేకపోతే ఆ స్కీమ్‌ను రద్దు చేస్తాను అని చెప్పే ధైర్యం నీకుందా చంద్రబాబూ?జగన్ తెచ్చిన వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తాను అని చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా అని అడుగుతున్నా. జగన్ తెచ్చిన సచివాలయ వ్యవస్థను రద్దు చేస్తాను అని చెప్పగలిగిన ధైర్యం నీకుందా చంద్రబాబు? అని అడుగుతున్నా.
జగన్ తెచ్చిన రైతుభరోసా కేంద్రాలను తీసేస్తాను అని చెప్పే ధైర్యం ఉందా? జగన్ తెచ్చిన రైతన్నలకు తోడుగా ఉండే రైతుభరోసా సొమ్ము రద్దు చేసే ధైర్యం బాబుకు ఉందా? జగన్ తెచ్చిన అమ్మ ఒడి అనే పథకాన్ని రద్దు చేస్తాను అనే ధైర్యం ఉందా? జగన్ తెచ్చిన చేయూత అనే పథకాన్ని,. జగన్ తెచ్చిన ఈ బీసీ నేస్తం అనే పథకాన్ని, కాపునేస్తం అనే పథకాన్ని, జగన్ చేసిన ఓ ఆసరాను, ఓ సున్నా వడ్డీని, ఓ రైతు భరోసాను ఒక తోడు, చేదోడు, లానేస్తం, మత్స్యకార భరోసా, నేతన్న నేస్తం, వాహన మిత్ర, 31 లక్షల ఇళ్లపాట్టాలు, అందులో 22 లక్షల ఇళ్లు, నాడునేడుతో మారిన గవర్నమెంట్ బడులు, హాస్పటళ్లు..ఈ పథకాల్లో ఏదైనా ఒక్కటైనా నువు చేసావా చంద్రబాబు? అని అడుగుతున్నాను.
మరి 14 ఏళ్ల నీ పాలనలో ఏ ఒక్క పథకాన్నీ పెట్టని నువ్వు, నేను పెట్టిన పథకాలను పట్టుకుని ఈ రోజు తెగ మాట్లాడుతున్నావేంటయ్యా చంద్రబాబూ అని అడుగుతున్నాను. 14 ఏళ్లు బాబును ముఖ్యమంత్రి హోదాలో చూసారు. జగన్‌ను 58 నెలలు మీ జగన్ ను ముఖ్యమంత్రిగా చూసారు. మరి జగన్ పేరు చెబితే ఇన్ని పథకాలు గుర్తొచ్చినప్పుడు, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన ఆ వ్యక్తి పేరు చెబితే..ఒక్కటంటే ఒక్క పథకం పేరు కూడా గుర్తుకు రాలేదు అంటే ఈ మనిషిని, ఆ చంద్రబాబును నమ్మగలమా అని అడుగుతున్నాను.
2014లో చంద్రబాబునాయుడు స్వయంగా సంతకం పెట్టి, ముఖ్యమైన హామీలు అని చెబుతూ, ఇదే చంద్రబాబు, ఇదే దత్తపుత్రుడు, ఇదే ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీగారి ఫొటోతో, ఇదే కూటమి, ముగ్గురూ ఒకటై ఈ పాంప్లెట్ మీ ఇంటింటికీ పంపించారు. ౨౦౧౪లో మీ ఇంటికి పంపించిన పాంప్లెట్లోని ముఖ్యమైన హామీలేమిటో చదవుదామా? ఆ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5లో అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ గుర్తున్నాయా? ఊదరగొట్టారు గుర్తున్నాయా? ముఖ్యమైన హామీలు అని అంటూ…నాడు బాబు మీ ఇంటికి పంపిన పాంప్లెట్ లో రాసినవి చూద్దాం.
రైతుల రుణాలన్నీ మొదటి సంతకంతోనే మాఫీ అన్నాడు. మరి రూ.87,612 రైతు రుణమాఫీ జరిగిందా?రెండో ముఖ్యమైన హామీ… పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తామన్నారు. రూ.14,205 కోట్ల రూపాయిలు అక్కచెల్లెమ్మల రుణాల మాఫీ జరిగిందా?ఒక్క రూపాయి అయినా మాఫీ చేసాడా? ఇంకా ముందుకు పోయి చూద్దాం. ఇంటింటికీ ఓ ఉద్యోగం.. ఉద్యోగం ఇవ్వలేకపోతే నెలకు రూ.2,000 నిరుద్యోగ భృతి అన్నాడు. అంటే అరవై నెలల్లో రూ.1,20,000 నిరుద్యోగ భృతి ఇచ్చాడా?
ప్రతి పేదవాడికి 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు… ఒక్కరికన్నా ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చాడా? ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ప్రతి బ్యాంక్ అకౌంట్ లోనూ రూ.25వేలు డిపాజిట్ చేస్తాను అన్నాడు. ఒక్కరూపాయి అయినా డిపాజిట్ చేసాడా?
పదివేల కోట్లతో బీసీ సబ్ ప్లాను, చేనేత, పవర్ లూమ్స్ రుణాల మాఫీ అన్నాడు. జరిగిందా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తానన్నాడు.. చేసాడా?సింగపూర్‌కు మించి అభివృద్ధి చేస్తాను అన్నాడు చేసాడా? ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తా అన్నాడు…ఇక్కడ కనిపిస్తోందా? నేను ఒక్కటే ఒకటి అడుగుతున్నాను. 2014 లో ఈ ముగ్గురు కూటమితో జతకట్టి… జెండాలు జతకట్టి ఆరోజు మీకు పంపిన ఈ పాంప్లెట్లో ఒక్కటంటే ఒక్కటైనా బాబు నెరవేర్చాడా? పోనీ ప్రత్యేక హోదా ఇచ్చాడా? అదీ లేదు. మరి ఇలాంటి వ్యక్తిని నమ్ముదామా? నమ్ముతారా? అన్నా, అక్కా మీరు నమ్ముతారా? ఇప్పుడు మళ్లీ ఇదే ముగ్గురూ..మనల్ని మళ్లీ మోసం చేసేందుకు సూపర్ సిక్స్ అంటున్నారు…నమ్ముతారా? సూపర్ సెవెన్ అంట..నమ్ముతారా? ఇంటింటికీ కేజీ బంగారం అంట.. నమ్ముతారా? ఇంటింటికీ బెంజ్ కారు కొనిస్తారట నమ్ముతారా?
ఈ ఎన్నికలు కేవలం ఎంపీలు, ఎమ్మెల్యేలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కాదు. ఈ ఎన్నికల్లో మన ఓట్లు మన తలరాతలు మారుస్తాయి. ఎవరి వల్ల మీకు మంచి జరిగింది, ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుంది అని ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి వోటు వేయమని మిమ్మల్ని కోరుతున్నాను.
వాలంటీర్లు మీ ఇంటికే రావాలన్నా.. పేదవాడి భవిష్యత్ మారాలన్నా… పథకాలన్నీ కొనసాగాలన్నా.. పథకాలన్నీ ఇంటికే రావాలన్నా….? లంచాలూ వివక్ష లేని పాలన జరగాలన్నా?మన పిల్లలు, చదువులు బాగుపడాలన్నా?మన హాస్పటళ్లు, వ్యవసాయం మెరుగుపడాలన్నా..ఫ్యాన్ గుర్తు మీద రెండు ఓట్లు..వేయాలి. ఒకటి ఎమ్మెల్యేకి, ఒకటి ఎంపీకి వేయాలి. 175 అసెంబ్లీ స్థానాలకు 175 అసెంబ్లీ స్థానాలు 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు తగ్గడానికి వీల్లేదు. మీరు సిద్ధమేనా ?
మంచి చేసిన ఈ ఫ్యాను ఇంట్లో ఉండాలి.చెడు చేసిన సైకిల్ ఇంటి బయటే ఉండాలి.తాగేసిన టీ గ్లాస్ సింక్ లో ఉండాలి.ఇవన్నీ గుర్తు పెట్టుకుని మీ చల్లని దీవెనలు మాకు అందించండి అంటూ సీఎం వైయస్ జగన్ తన ప్రసంగం ముగించారు.