ఐదేళ్ళ అవినీతి పరిపాలనలో పాపాల పుట్ట పెద్దదే
టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు ఆయన అనుచరవర్గం పాల్పడిన అవినీతి అక్రమాల పై యథేచ్చగా సాగించిన భూ కుంభకోణాలపై సీఐడీ విరుచుకుపడింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో ఫిబ్రవరి 8, 2024 న చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఐఆర్ఆర్ కేసులో ఏ–1గా చంద్రబాబు, ఏ–2గా పొంగూరి నారాయణ, ఏ–14గా నారా లోకేష్, లింగమనేని రమేశ్ లతో పాటు మరికొంతమందిని నిందితులుగా చార్జ్‌షీట్ లో పేర్కొంది. వారిపై ఐపీసీ 120(బి), 409, 420, 34, 35, 37.. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(2), రెడ్‌విత్ 13(1)(సి),(డి)ల ప్రకారం వారిపై కేసు నమోదు చేసినట్టు ఆ చార్జ్‌షీట్‌లో వెల్లడించింది. ఇది టీడీపీ ప్రభుత్వం చేసిన భారీ కుంభకోణాల్లో ఒకటి. చంద్రబాబు నాయుడు తన అనుచర వర్గానికి ప్రభుత్వ సొమ్మును అప్పనంగా కట్టబెట్టేందుకు కాగితాల మీదే ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో ఇష్టానుసారం మార్పులు చేసి, వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టారు.
టీడీపీ ప్రభుత్వంలో సీఆర్డీఏ చైర్మన్‌గా అప్పటి సీఎం చంద్రబాబు, వైస్ చైర్మన్‌గా అప్పటి మంత్రి పొంగూరు నారాయణ బరితెగించి ఇలా అవినీతికి పాల్పడ్డారు. ఇందుకోసం లింగమనేని రమేశ్‌తో క్విడ్ ప్రో కో కు తెరలేపారు. భూముల విషయంలో హెరిటేజ్ ఫుడ్స్ తరుపున నారా లోకేష్ కూడా పాలుపంచుకున్నాడు.చంద్రబాబు బినామీ, సన్నిహితుడు లింగమనేని భూముల విలువ.. నారాయణ భూముల విలువ పెంచేందుకు ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌ను మార్చారు. విదేశీ సంస్థల ముసుగుతో టీడీపీ ప్రభుత్వమే అవినీతికి పాల్పడింది.
అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్ కోసం సీఆర్డీయే అధికారులు 94 కిలోమీటర్ల పొడవుతో అలైన్మెంట్ రూపొందించారు. ఆ ప్రకారం అమరావతిలోని చంద్రబాబు, లింగమనేని, నారాయణ కుటుంబాలకు చెందిన భూములకు 3 కిలోమీటర్ల దూరం నుంచి పెద్దమరిమి, నిడమర్రు, చిన వడ్లపూడి, పెద వడ్లపూడి మీదుగా ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మించాలి. దాంతో తమ భూముల విలువ పెరగదని గ్రహించిన చంద్రబాబు, నారాయణ.. సీఆర్డీయే అధికారులతో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో మార్పులు చేపించారు. అలైన్‌మెంట్‌ను 3 కిలోమీటర్లు దక్షిణానికి జరిపి.. తాడికొండ, కంతేరు, కాజాలలోని చంద్రబాబు, లింగమనేని కుటుంబాలకు చెందిన 355 ఎకరాలు, హెరిటేజ్ ఫుడ్స్‌కు చెందిన 13 ఎకరాలను ఆనుకుని నిర్మించేలా ఖరారు చేశారు.
ఆ విషయాన్ని గోప్యంగా ఉంచి.. చంద్రబాబు, నారాయణ తమ కుటుంబ సంస్థలు హెరిటేజ్, రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్‌లతో పాటు తమ బినామీ లింగమనేని రమేష్ సంస్థల పేరిట ఇన్నర్ రింగ్ రోడ్డుకు అటూ ఇటూ భారీగా భూములు కొన్నారు. అనంతరం సింగపూర్‌కు చెందిన సుర్బాన జ్యురాంగ్ కన్సల్టెన్సీ ముసుగులో చంద్రబాబు ముఠా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ పేరిట భూ దోపిడీకి పాల్పడింది. సీఆర్డీయే ఏకంగా సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నట్టుగా టీడీపీ ప్రభుత్వం భ్రమింపజేసింది. సింగపూర్‌లోని ప్రైవేట్ కన్సల్టెన్సీ సుర్బాన జ్యురాంగ్ కన్సల్టెన్సీని తీసుకువచ్చి పక్కాగా అవినీతి కథ నడిపించింది. అలా టీడీపీ అండ్ కో నిర్ణయించిన ఇన్నర్ రింగ్ రోడ్ డిజైన్‌ను అమరావతి మాస్టర్ ప్లాన్‌లో చేర్చారు. అనంతరం ఎస్టీయూపీ అనే కన్సల్టెన్సీని నియమించారు. అప్పటికే సీఆర్డీయే అధికారుల ద్వారా తాము ఖరారు చేసిన అలైన్‌మెంట్‌నే ఎస్టీయూపీ కన్సల్టెన్సీ ద్వారా ఆమోదించేలా చేశారు.
ఐఆర్ఆర్ అలైన్మెంట్ కుంభకోణం ద్వారా చంద్రబాబు ముఠా లింగమనేని కుటుంబంతో క్విడ్ ప్రో కోకు పాల్పడింది. లింగమనేని కుటుంబానికి కల్పించిన ప్రయోజనానికి ప్రతిగా చంద్రబాబు.. కృష్ణా నది కరకట్ట మీద ఉన్న లింగమనేని బంగ్లా మరియు హెరిటేజ్ ఫుడ్స్‌కు భూములు పొందారు. ఈ ప్రక్రియలో అప్పటి హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్ హోదాలో లోకేశ్ కీలక పాత్ర పోషించారు. ఐఆర్ఆర్ అలైన్మెంట్ మార్పు వల్ల చంద్రబాబు, లింగమనేని రమేశ్ కుటుంబాలకు చెందిన భూముల విలువ భారీగా పెరిగింది. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఖరారుకు ముందు ఆ ప్రాంతంలో ఎకరా భూమి మార్కెట్ ధర ప్రకారం ఎకరా రూ.50 లక్షలతో.. భూముల మార్కెట్ విలువ రూ.177.50 కోట్లుగా ఉండేది. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ తర్వాత మార్కెట్ ధర ప్రకారం ఎకరా రూ.2.50 కోట్లతో.. 355 ఎకరాల విలువ మార్కెట్ ధర ప్రకారం అమాంతం రూ.887.50 కోట్లకు పెరిగింది.
తరువాత రాజధాని అమరావతి నిర్మాణం పూర్తయితే ఎకరా విలువ సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో ఇన్నర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న భూముల విలువ ఎకరా రూ.6 కోట్లకు చేరుతుందని అంచనా వేశారు. అంటే అమరావతి నిర్మాణం పూర్తయితే ఆ 355 ఎకరాల విలువ ఏకంగా రూ.2,130 కోట్లకు చేరుతుందని అంచనా. మార్కెట్ ధర ప్రకారం హెరిటేజ్ ఫుడ్స్ 9 ఎకరాల విలువ రూ.4.50 కోట్ల నుంచి రూ.22.50 కోట్లకు పెరిగింది. అమరావతి రాజధాని నిర్మాణం పూర్తయితే అది రూ.54 కోట్లకు చేరుతుందని లెక్క తేలింది. హెరిటేజ్ ఫుడ్స్ ఒప్పందం చేసుకున్న మరో 4 ఎకరాల విలువ కూడా రూ.24 కోట్లకు చేరుతుంది.
లింగమనేని కుటుంబంతో క్విడ్ ప్రో కో ద్వారా పొంగూరు నారాయణ.. తమ బంధువులు, బినామీల పేరిట 58 ఎకరాలు పొందారు. చంద్రబాబు, నారాయణ కుటుంబాలు అక్రమంగా దక్కించుకున్న భూముల సమీపంలోనే ప్రభుత్వ నిధులతో సీడ్ క్యాపిటల్ ఏరియా, స్టార్టప్ ఏరియాను అభివృద్ధి చేయాలని టీడీపీ ప్రభుత్వం ప్రణాళికను ఆమోదించింది. అందుకోసం ఏకంగా ప్రభుత్వ నిధులు రూ.5,500 కోట్లు వెచ్చించాలని నిర్ణయించింది. తద్వారా తమ భూముల ధరలు అమాంతం పెరిగేలా చేసేందుకు కుట్ర పన్నింది.
క్విడ్ ప్రో కో కింద చంద్రబాబు పొందిన కరకట్ట నివాసాన్ని, నారాయణ కుటుంబ సభ్యులు సీడ్ క్యాపిటల్‌లో పొందిన 75,888 చదరపు గజాల ప్లాట్లు, కౌలు మొత్తంగా పొందిన రూ.1.92 కోట్లను అటాచ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఐడీ విజయవాడ ఏసీబీ న్యాయ స్థానంలో పిటిషన్ దాఖలు చేసింది.