మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై అగంతకులు రాయితో దాడి చేయడంతో, సీఎం జగన్ మోహన్ రెడ్డి గాయపడిన విషయం తెలిసిందే . అనంతరం ప్రభుత్వ వైద్యశాలలో ట్రీట్మెంట్ తీసుకొన్న జగన్ వైద్యుల సూచన మేరకు బస్సు యాత్రకు ఒక రోజు విశ్రాంతి తీసుకున్నారు. ఒక రోజు విరామం తర్వాత తిరిగి ఈ రోజు నుంచి నుంచి యాత్ర తిరిగి ప్రారంభంకానుంది. ఈ విషయాన్ని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. దీంతో పాటు 15వ రోజు మేమంతా సిద్దం బస్సయాత్ర పూర్తి షెడ్యూల్ కూడా విడుదల చేశారు.
ఈరోజు ఉదయం 9 గంటలకు కేసరపల్లి నైట్ స్టే చేసిన పాయింట్ నుంచి యాత్ర ప్రారంభం కానుంది. గన్నవరం, ఆత్కూర్, వీరవల్లి క్రాస్ , హనుమాన్ జంక్షన్, పుట్టగుంట మీదుగా జొన్నపాడు వద్ద బస్సు యాత్రకు విరామం ఇవ్వనున్నారు. అక్కడే భోజనం చేసి కాసేపు విశ్రాంతి అనంతరం జొన్నపాడు, జనార్దణపురం మీదుగా సాయంత్రం 3.30 గంటలకు గుడివాడ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు సీఎం జగన్. సభ అనంతరం హనుమాన్ జంక్షన్ జాతీయ రహదారి, గుండుగొలను మీదుగా నారాయణపురంలో రాత్రికి బస చేసే శిబిరానికి చేరుకోనున్నారు సీఎం. రేపు గోదావరి జిల్లాల్లో మేమంతా సిద్దం బస్సుయాత్ర కొనసాగుతుంది.