దర్శి నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థిగా గొట్టిపాటి నరసయ్య కూతురు గొట్టిపాటి లక్ష్మీకి అవకాశం ఇచ్చారు చంద్రబాబునాయుడు. తనకు టికెట్ కేటాయించిన తరువాత సొంత నియోజకవర్గం అద్దంకి నుండి తన అన్న గొట్టిపాటి రవి అండ దండలతో సొంత అభిమానుల మధ్య దర్శిలో అడుగుపెట్టిన గొట్టిపాటి లక్ష్మీకి ఘన స్వాగతం పలికారు. ఆరోజు జరిగిన స్వాగత సత్కారాలు, కార్యక్రమాలు చూసిన దర్శి టీడీపీ నాయకులు ఆశ్చర్యపొయ్యారు. గొట్టిపాటి లక్ష్మీ నరసరవుపేటలో గైనకాలజిస్టుగా పని చేస్తూ తన అన్న అద్దంకి ఎమ్మేల్యే గొట్టిపాటి రవి సహాయంతో దర్శి లో పోటీకి సిద్ధమై వచ్చారు. అలానే నామినేషన్ ర్యాలీని కోట్ల రూపాయల ఖర్చుతో అంగరంగ వైభవంగా వెళ్ళి దాఖలు చేశారు.
ఇక్కడి వరకు బాగానే జరిగింది , ఇక్కడి నుంచే గొట్టిపాటి లక్ష్మీకి తెలుగు తమ్ముళ్లు చుక్కలు చూపించడం మొదలు పెట్టారు. గొట్టిపాటి లక్ష్మీ ఆర్ధిక బలం గురించి వినడం , నియోజకవర్గానికి వచ్చిన రోజు అలాగే నామినేషన్ దాఖలులో పెట్టిన కోట్ల ఖర్చు చూసి ఇన్ని రోజులు మేము మా సొంత నిధులతో పార్టీని నడిపాము ఇప్పుడు మీరు నిధులను సమకూరిస్తేనే ప్రచారంతో పాటు పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తాం అంటూ తెగేసి చెప్పడంతో ఏమి చెయ్యాలో పాలుపోని స్థితిలో పడ్డారు లక్ష్మీ. ఇప్పటికే టీడీపీ టికెట్ కోసం, ఎన్నికల ప్రచారానికి పదుల కోట్లు ఖర్చు చేశాము మీకు ఎక్కడి నుండి తేవాలి అని గొట్టిపాటి లక్ష్మీ కుటుంబ సభ్యులు ఇచ్చేది లేదు అని ఖరాఖండిగా చెబుతున్నారు.
దీనితో టీడీపీ ప్రచారం ఎక్కడిక్కడే ఆగిపోయి డబ్బులు ఇస్తేనే తిరుగుతూ లేకుంటే ఎవరు గడప దాటడం లేదు. దీని గురించి టీడీపీ నాయకులను కదిలిస్తే రేప్పొద్దున లక్ష్మీ ఎక్కడ వుంటారో మాకు తెలియదు దీపం వుండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి లేకుంటే మమ్మల్ని ఎవరు పట్టించుకోరు అంటూ తమ స్థితినీ తెలిపారు.