‘చేనేత రంగానికి వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం చేయూతనిచ్చింది. ఈ 58 నెలల్లో రూ.3,706 కోట్ల ఖర్చు చేశాం. నేతన్న నేస్తం ద్వారా రూ.970 కోట్లు అందించాం’ అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వెల్లడించారు. ఆయన చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర శనివారంతో 14వ రోజుకు చేరుకుంది. గుంటూరు జిల్లా నంబూరు బైపాస్ నుంచి ప్రారంభమైంది. ప్రజలు జననేతకు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి సీఎం సీకే కన్వెన్షన్ హాల్లో జరిగిన చేనేత కార్మికులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు
జగన్ ఏమన్నారంటే.. చేనేత కార్మికులను చంద్రబాబు మోసం చేశాడు. 2014లో కూటమిగా వచ్చి ఏం చేప్పారో గుర్తు చేసుకోండి. ఓటు వేసే సమయంలో అప్రమత్తంగా లేకుంటే మళ్లీ మోసపోతాం. గతంలో 98 శాతం హామీలను ఎగ్గొట్టాడు. గత పాలనకు, ఇప్పటి పాలనకు తేడాను మీరే గమనించారు. బాబు రంగురంగుల మేనిఫెస్టోతో వస్తున్నాడు. సూపర్ సిక్స్, సెవెన్ అంటున్నాడు. ఒక్కరికైనా సెంట్ స్థలం ఇచ్చాడా?, మనం స్థలం ఇస్తే కోర్టుకు వెళ్లి అడ్డుకున్నాడు. ఒక్క ఇళ్లయినా ఇచ్చాడా?, చేనేత కార్మికులకు ఇల్లు, మగ్గం అని బాబు మోసం చేశాడు. నేతన్న నేస్తం పథకం ప్రవేశపెట్టి అండగా నిలిచా. మగ్గం ఉన్న ప్రతి కుటుంబానికి చేయూతనిచ్చిన ప్రభుత్వం ఇదిది. కుల, మత, రాజకీయాలకు అతీతంగా లబ్ధి జరిగింది. గతంలో ఎప్పుడైనా ఇలాంటి పథకం అమలు చేసిన సందర్భం ఉందా?. 1.06 లక్షల మందికి పథకాలు అందించాం.
చంద్రబాబు 95 శాతం హామీలను ఎగ్గొట్టాడు. మీ బిడ్డ 99 శాతం హామీలను నెరవేర్చాడు. బాబుకు ఉన్న నెగిటివిటీ అనుభవం నాకు లేదు. 2014లో ఆయన చెప్పిన హామీలు చూస్తే చేనేత సహకార సంఘాలకు చేసింది ఏమీ లేదు. ఎన్నికల్లో మన బతుకులు మార్చే నాయకుడిని ఎన్నుకోవాలి. ప్రతి పేదవాడి గుండెల్లో నిలిచేలా మీ బిడ్డ అడుగులు వేశాడు. 58 నెలల పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజల నుంచి వింటున్నాను. రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలకు సూచనలు తీసుకుంటున్నాను. దళారులు లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించాం. నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో నగదు జమ చేసిన ప్రభుత్వం ఇది. వలంటీర్ వ్యవస్థతో అవ్వాతాతలకు పెన్షన్ అందించాం. పెన్షన్ను రూ.3 వేలకు పెంచి అందించే అవకాశం నాకు వచ్చింది.
చంద్రబాబు, లోకేశ్ బీసీల సీట్లను లాక్కొని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతు రాజకీయం చేస్తున్నారు. కానీ నేను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం సీట్లను ఇచ్చి మీ ముందు నిలబడ్డా. 50 శాతం వెనుకబడిన వర్గాలకు టికెట్ ఇచ్చిన ఘనత మనదే. దేశ రాజకీయ చరిత్రలోనే ఇది రికార్డు. బీసీలు ఎక్కువగా ఉన్నా.. బాబు సీట్లు ఇవ్వలేదు. కుప్పంలో కూడా బీసీలే ఎక్కువ. అక్కడా వారికి టికెట్ ఇవ్వరు. మనం మాత్రం చేనేత వర్గానికి చెందిన చెల్లెమ్మెకు టికెట్ ఇచ్చాం. మంగళగిరిలో 1.20 లక్షల ఇళ్లున్నాయి. 1.8 లక్షల ఇళ్లకు నేరుగా సంక్షేమ పథకాలు అందించాం. పేదలకు మంచి జరిగితే అడ్డుకునే వాడు రాజకీయ నాయకుడా?. మేనిఫెస్టోలో చెప్పే ప్రతి హామీని నెరవేర్చిన ప్రభుత్వం మనది. మంగళగిరిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే చంద్రబాబు అడ్డుకున్నాడు. కోర్టుల్లో పిటిషన్లు వేయించాడు. మీ ఇళ్ల పట్టాలు అడ్డుకున్నది బాబే. అందుకే ఓటు వేయమని ఆయన అడిగితే గట్టిగా నిలదీయండి.