కొంతమందికి అయిష్టంగానే టికెట్లు ఇచ్చేశాం.. ఇంకొంతమంది క్యాష్ ఇవ్వకుండా అప్పనంగా ఛాన్స్ కొట్టేశారు. ఇప్పుడేం చేయాలని ఆలోచిస్తున్న తరుణంలో చంద్రబాబు నాయుడికి ఒక ఆలోచన తట్టింది. వెంటనే తన గ్యాంగ్‌ను రంగంలోకి దించారు. అందరూ కలిసి అటు మెయిన్ స్ట్రీమ్, సోషల్ మీడియాలో అభ్యర్థుల మార్పంటూ ఊదరగొడుతున్నారు. కొద్దిరోజులుగా బాబు పునరాలోచనలో ఉన్నారని, రాబిన్ శర్మ టీంతో సర్వే చేయిస్తున్నారని, 15 మందిని మార్చే అవకాశముందని ప్రచారం చేస్తున్నారు.
పొత్తులో భాగంగా టీడీపీకి 144 అసెంబ్లీ, 17 ఎంపీ, జనసేనకు 21 అసెంబ్లీ, రెండు ఎంపీ, బీజేపీకి పది ఎమ్మెల్యే, ఆరు ఎంపీ సీట్లు దక్కాయి. మొదటి జాబితా విడుదల చేసిన నాటి నుంచి చంద్రబాబు కొత్త పాట అందుకున్నారు. మీ పనితీరును గమనిస్తుంటున్నానని, మెరుగ్గా లేకపోతే కొత్త అభ్యర్థిని తీసుకొస్తామని వీడియో, టెలీకాన్ఫరెన్స్లలో చెబుతున్నారు. అసలెందుకు ఇలా చేస్తున్నారని తెలుగు తమ్ముళ్లు తలలు బద్ధలు కొట్టుకుంటున్నారు.
పొత్తును, ఇతర కారణాలు చూపించి పార్టీ కోసం కష్టపడిన నేతలకు బాబు టికెట్లు ఎగ్గొట్టారు. వారి నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని ముందే తెలుసు. అవసరమైతే ఒకటి, రెండు సీట్లు మార్చాల్సి వస్తుందేమోనని పసిగట్టారు. అయితే ఊహించనిరీతిలో తమ్ముళ్లంతా వ్యతిరేకమయ్యారు. జనసేన, బీజేపీకి కలిపి 31 సీట్లు ఇవ్వడం టీడీపీ నేతలకు ఇష్టం లేదు. అలాగే కోరుకున్న స్థానాలు కొన్ని వారికి వెళ్లడంతో ఆగ్రహంతో ఊగిపోతున్నారు. దీనికితోడు 144లో కొన్ని ఉచితంగా ఇవ్వాల్సి వచ్చింది. వారి నుంచి నగదు వసూలు చేయాలి. ఈ నేపథ్యంలోనే బాబు తెలివిగా సీట్లు మారుస్తానంటూ చెబుతూ వస్తున్నారు.
ఏలూరు, నర్సాపురం, ధర్మవరం, రాజమండ్రి, మంత్రాలయం, నందికొట్కూరుల్లో మొదట అభ్యర్థులను మారుస్తారని ప్రచారం జరుగుతోంది. కానీ ఇది సాధ్యం కాదు. రాబిన్ శర్మ సర్వే అంటూ కట్టు కథలు చెబుతున్నారు. అయితే ఒక్కరిని కూడా మార్చే ధైర్యం బాబు చేయరు. ఇప్పటికే చాలామంది అభ్యర్థుల నుంచి పార్టీ, వ్యక్తిగత ఫండ్ కింద లోకేశ్ కోట్ల రూపాయలు వసూలు చేశారు. సర్వేను బూచిగా చూపించి భయపెడితే ఇవ్వాల్సిన కొందరు దారికొచ్చేస్తారనే ఆలోచన చేశారు. ధర్మవరం టికెట్‌ను వెంకయ్యనాయుడి మనిషి సత్యకుమార్‌కు ఇచ్చారు. ఆయన్ను కాదనే సాహసం చంద్రబాబు చేయరు. కాకపోతే పరిటాల శ్రీరామ్ పనిచేయడం లేదు కాబట్టి.. అతడిలో ఆశలు రేకెత్తించి పార్టీలో చురుగ్గా ఉండేలా చేయాలని వేసిన ప్లాన్‌లా తెలుస్తోంది. ఇక నందికొట్కూరు టికెట్‌ను మాండ్ర శివానందరెడ్డి అనుచరుడు గిత్త జయసూర్యకు ఇచ్చారు. ఇక్కడ కొత్త వారిని తెచ్చే చాన్స్ లేదు. మొత్తానికి నారా వారు తన అతి తెలివితేటలను బయటపెట్టారు.