సీఈఓ మీనా ఇచ్చిన మెమోపై కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్సార్ కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఈసీఐ కార్యదర్శి రాజీవ్ కుమార్ కి ఆ పార్టీ ఎంపీ నిరంజన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై ఇచ్చిన మెమో ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధమని వైఎస్సార్సీపీ పేర్కొంది. అటెస్టేషన్ అధికారుల స్పెసిమెన్ సంతకాల సేకరణ ఈసీఐ నిబంధనలకు విరుద్ధమని. ఇది పోస్టల్ బ్యాలెట్ ఓట్లను తిరస్కరించేందుకు దారితీసేలా ఉందని ఫిర్యాదు చేశారు. సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఇచ్చిన మెమోను తక్షణమే సమీక్షించి, పునరాలోచన చేయాలని వైఎస్సార్సీపీ విజ్ఞప్తి చేసింది.
ఇదే అంశంపై హైకోర్టురు వెళుతున్నట్టు వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫారంపై గెజిటెడ్ సంతకం లేకుంటే దానిని తిరస్కరించాలనేది రూల్. కానీ ఏపీలో గెజిటెడ్ సంతకం లేకపోయినా అనుమతించేలా ఈసీ మెమో ఇవ్వటం అభ్యంతరకరమని పేర్కొన్నారు. దేశం అంతటా ఒక రూల్ ఉంటే ఏపీలో మాత్రమే ఈసీ ప్రత్యేక రూల్స్ ఎలా అని సీఈసీకి ఫిర్యాదు చేసినా స్పందన లభించకపోవడంతో హైకోర్టుకి వెళ్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.