ఇప్పుడంటే మెగా సోదరులు ఒకరినొకరు పొగుడుకుంటూ.. కౌగలించుకుంటూ డ్రామాను రక్తి కట్టిస్తున్నారు. అధికారం కోసం సహకారం అందించుకుంటున్నారు. ఒకప్పుడు ఇదే బ్రదర్స్ మాధ్య మాటల యుద్ధాలు ఒక స్థాయిలో జరిగాయి. అప్పట్లో చిరంజీవి కాంగ్రెస్‌లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ వేరుగా ఉన్నారు.
ఓ సందర్భంలో చిరంజీవి తన తమ్ముడి మాటలపై ఇలా స్పందించారు. ‘ఈరోజున కాంగ్రెస్ పార్టీ హఠావో అన్నారు. మా పార్టీ నిన్న, మొన్న పుట్టింది కాదు. వంద సంవత్సరాలకు పైనే చరిత్ర కలిగింది. నేను భారతీయుడినని చెప్పుకోవడానికి అవకాశం కల్పించిన పార్టీ ఇది. స్వాతంత్రోద్యమంలో పాల్గొని బ్రిటిష్ వారిపై పోరాడి మనం భారతీయులమని చెప్పుకొనే అవకాశం ఇచ్చింది కాంగ్రెస్సే’ అంటూ మీడియా ముందు చెప్పారు.
పవన్ తన అన్న మాటలకు ఓ సభలో కౌంటర్ ఇచ్చారు. ‘పదేపదే మాది 150 సంవత్సరాలు.. 150 సంవత్సరాలంటే నాకు తెలుగు సామెత గుర్తుకొస్తోంది. మా తాతలు నేతలు తాగారు. వచ్చి మా మూతులు వాసన చూడండి. వాసన చూస్తే ఇది వచ్చింది. వీళ్లు చెప్పుకొన్నట్లుగా కాంగ్రెస్‌ది 150 సంవత్సరాల చరిత్ర కాదు. ప్రతి ఐదు సంవత్సరాలకు ఎన్నికల కోసం అవకాశవాదం ముసుగు వేసుకునే లక్షణం కాంగ్రెస్‌ది. మనందరం ప్రేమించే మొదటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కుటుంబీకులే కావొచ్చు. జాతిపిత మహాత్మా గాంధీ ఇంటి పేరే పెట్టుకుని ఉండొచ్చు. అలా పెట్టుకున్నంత మాత్రాన వాళ్లు వీళ్లయిపోరు. నిజానికి వారి ఇంటి పేరు పెట్టుకున్నందుకు.. వారి ఆశయాలు డీఎన్ఏలో ఉండే ఉంటే ఈరోజు దేశం, రాష్ట్రం ఈ పరిస్థితుల్లో ఉండేది కాదు’ అప్పట్లో ఈ మాటల యుద్ధాలు అనేకసార్లు హాట్‌టాపిక్ అయ్యాయి.
ఒకప్పుడు చిరంజీవి కాంగ్రెస్‌లో ఉండడం పవన్‌కు ఇష్టం లేదని, అందుకే అన్న మీద తిరుగుబాటు చేశాడని మెగా అభిమానులు చెబుతుంటారు. మరి ఇప్పుడు ఒకే గూటికి ఎందుకు చేరారంటే.. అధికార కాంక్షే కారణంగా తెలుస్తోంది. ప్రజారాజ్యం మూతపడ్డాక విడివిడగా ఉండి నష్టపోయామని, ఒకే మాట మీద ఉంటే లాభపడతామని బ్రదర్స్ భావించారట. ముందు పవన్ బీజేపీకి జై కొట్టాడు. తర్వాత అన్న పార్టీతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నాడు. మధ్యలో సేనాని కమలం పార్టీతో విభేదించినా చిరు మాత్రం పరోక్షంగా మద్దతు ఇస్తూనే వచ్చాడు. తనకు కావాల్సిన పనులు చేయించుకున్నాడు. ఇప్పుడు ఇద్దరూ కాషాయ పార్టీకి గులాంగిరీ చేస్తున్నారు.
పవన్ నేరుగా పొత్తు పెట్టుకున్నాడు. చిరంజీవి కూటమికి మద్దతు ఇవ్వండంటూ వీడియోలు విడుదల చేస్తున్నాడు. వీళ్లందరి ద్వారా లబ్ధి పొంది కుర్చీ ఎక్కాలని గుంటనక్కలా చంద్రబాబు నాయుడు చూస్తున్నాడు. అటు మెగా బ్రదర్స్ కావొచ్చు.. ఇటు చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ కావొచ్చు.. ప్రజా సంక్షేమం మరిచి స్వార్థపూరిత రాజకీయాల్లో మునిగి తేలుతున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. రేపు ఒకవేళ కాంగ్రెస్ కేంద్రంలో పవర్లోకి వస్తే చిరంజీవి మా పార్టీ అంటాడు. తమ్ముడికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాడు. ఇక చీకట్లో వెళ్లి కాళ్లు పట్టుకోవడం చంద్రబాబుకు అలవాటే కదా..
– వీకే..