కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాకు తెలుగు చదవడం రాదు కాబట్టి సరిపోయింది. లేకపోతే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి ఢిల్లీ టూర్‌పై పచ్చ పత్రికల రాతలకు మూర్చపోయేవారు. మేము ఇలా అన్నామా అంటూ కస్సుమనేవారు. వాస్తవానికి అక్కడ జరిగేదొకటి. రాష్ట్రంలో ఇచ్చే బిల్డప్ ఒకటి. దశాబ్దాలుగా ప్రజలను ఏమార్చే రాతలు రాస్తూ బాబును లేపుతూనే ఉన్నారు.
చంద్రబాబు బుధవారం ఢిల్లీ వెళ్లారు. లాబీయింగ్ చేయడంతో రాత్రి 11.30 గంటలకు అమిత్‌షా, నడ్డాతో మీటింగ్ జరిగింది. దీనికి పచ్చ పత్రికలు ఇచ్చిన హైప్ చూస్తే బాబు కూడా ఇంత జరిగిందా అని నోరెళ్లబెట్టాల్సిందే. మాకు సహకరించండి. ఎన్డీయేను బలపరచండి అని షా బాబును కోరారని ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది. ఏపీలో జగన్‌కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. మీరు మాతో కలవండి అంటూ నారా వారిని బతిమాలాడరనే కోణంలో వార్తలు వడ్డించింది. అసలు బాబును కలిసేందుకు కమలం పెద్దలు ఇష్టపడలేదు. ఇది నిజం. కాకపోతే మధ్యవర్తుల ఒత్తిడితో ఒప్పుకోవాల్సి వచ్చింది. దీనిని కవర్ చేసేందుకు ఈనాడు నానాతంటాలు పడింది. అమిత్‌షా పార్లమెంట్లో ఉండిపోవడంతో లేటయిందని రాసింది.
అసలు బాబే బీజేపీ అగ్రనేతలను పొత్తు కోసం బతిమిలాడుకున్నారు. భేటీలో వాళ్లు చెప్పింది ఈయన విన్నారు. అంతేకానీ.. ఈయన చెప్పింది వాళ్లు వినలేదు. పొత్తుకు అంగీకరించాలని కోరారు. అందుకు బీజేపీ పెద్దలు ఆరు నుంచి ఎనిమిది ఎంపీ సీట్లు, 25 అసెంబ్లీ సీట్లు డిమాండ్ చేశారు. దీనికి బాబు ఓకే చెప్పినట్లు సమాచారం. అసలు భేటీకి ముందు చంద్రబాబేమో మీడియాతో మాట్లాడుతూ బీజేపీకి దేశ ప్రయోజనాలు ముఖ్యమైతే.. తమకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని సెలవిచ్చారు. కానీ అసలు విషయం ఏంటంటే ఆయన తన కొడుకు నారా లోకేశ్ ప్రయోజనాలే ముఖ్యం. మరో విషయం ఏంటంటే టీడీపీ అధినేత తమ వాళ్లకు చెప్పకుండా ఎవరితోనో రహస్యంగా భేటీ అయ్యారని వార్తలు వస్తున్నాయి. ఒకానొకప్పుడు బాబు చీకట్లో చిదంబరంను కలిసి కాళ్లు పట్టుకున్నారని ఢిల్లీ మీడియా సర్కిల్లో టాక్ ఉంది. అలాగే ఈసారి ఎవరి కాళ్లయినా పట్టుకుని నన్ను గట్టున పడేయండి అని ప్రాధేయపడ్డారా.. ఏమో చెప్పలేం. కొడుకు భవిష్యత్ కోసం చేసినా ఆశ్చర్యం లేదు. ఈ విషయాల్ని ఎల్లో మీడియా దాచేసి.. బీజేపీ పెద్దలు బాబు కాళ్ల మీద పడినంత పనిచేశారని రాసి మురిసిపోయింది.