కూటమి తరుపున వైజాగ్ సౌత్ లో జనసేన పోటీలో ఉండబోతుంది. పార్టీ తరపున భీమిలీ లేదా వైజాగ్ లో ఎక్కడైన టికెట్ ఇస్తామనే హామీతో జనసేనలో చేరిన వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ కి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైజాగ్ సౌత్ టికెట్ కేటాయించారు. ఆరోజు నుండి వైజాగ్ సౌత్ జనసేనలో అసమ్మతి నిప్పు రాజుకొని, పార్టీ పెద్దలు పట్టించుకోకపోవడంతో ఈరోజు నియోజకవర్గంలో కార్చిచ్చులా రగిలి జనసేన పార్టీని నిలువెల్ల దహించి వేస్తున్నది. జనసేన పార్టీలో మొదటి నుండి పని చేస్తున్న డాక్టర్ మూగి శ్రీనివాస్ ఈసారి టికెట్ తనకే వస్తదని కష్టపడుతూ వచ్చారు. తీరా ఎన్నికల ముందు 32వార్డ్ కార్పొరేటర్ అయిన కందుల నాగరాజుని వైజాగ్ సౌత్ టికెట్ ఇస్తాము అనే హామీతో జనసేనలోకి జాయిన్ చేసుకున్నారు పవన్ కళ్యాణ్. ఇలా ఇద్దరికి టికెట్ హామీతో పార్టీకి పని చెయ్యమని చెప్పిన పవన్ కళ్యాణ్ ముచ్చటగా మూడో నాయకుడు వైసీపీ కార్పొరేటర్ సాధిక్ ని టికెట్ హామీతో పార్టీలోకి తీసుకొని పని చేసుకోమని ఆదేశించారు. ఇలా ఈ ముగ్గురి నాయకుల మధ్య టికెట్ గొడవలతో ఆధిపత్య పోరు జరుగుతున్న సమయంలోనే వీళ్ళందరికీ పిడుగు లాంటి వార్త పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మీరందరికి కాదు వంశీకృష్ణ శ్రీనివాస్ కి వైజాగ్ సౌత్ టికెట్ కేటాయిస్తున్నానని ప్రకటించారు.
అప్పటివరకు మాకంటే మాకు అని కొట్టుకున్న ఆ ముగ్గురు నాయకులు వంశీకృష్ణ శ్రీనివాస్ కి టికెట్ కేటాయించడంతో జన సేన పార్టీ మీద పవన్ కళ్యాణ్ మీద అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. ముఖ్యంగా కార్పొరేటర్ సాధిక్ అయితే వంశీకృష్ణ శ్రీనివాస్ అనుచరులతో కొట్లాటకు పోయి పెద్ద గొడవలే చేశారు. ఇంత జరుగుతున్నా వైజాగ్ జనసేన పార్టీ పెద్దలయిన శివ శంకర్, బొల్లిషెట్టి శ్రీనివాస్ లు ఇటు వైపు కన్నెత్తి చూసింది లేదు. పవన్ కళ్యాణ్ అయితే ఆ ముగ్గురి నాయకులను కనీసం పిలిచి మాట్లాడింది లేదు. వంశీకృష్ణ శ్రీనివాస్ ముగ్గురిని కలుపుకుపొదామని చూసిన ముగ్గురు నాయకులు అసలు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదు. పొత్తులో ఉన్న టీడీపీ నాయకులు మా బలమైన సీటును జనసేనకు ఇచ్చారని కూటమి తరుపున ప్రచారాన్ని అసలు పట్టించుకోవడమే మానేశారు.
ఇప్పుడు తాజాగా మూగి శ్రీనివాస్, సాధిక్, ఇతర కీలక నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎట్టి పరిస్థితుల్లో వైజాగ్ సౌత్ నుండి వంశీకృష్ణ శ్రీనివాస్ కాకుండా ఎవరికైనా టికెట్ ఇవ్వండి అతనికి టికెట్ ఇస్తే మేము సపోర్ట్ చెయ్యమని ఖరాఖండిగా తెలిపారు. మరోవైపు వైసీపీ అభ్యర్థి వాసుపల్లి గణేష్ రెండు సార్లు గెలిచిన అనుభవంతో దూసుకుపోతున్నారు. అదే సమయంలో ప్రత్యర్ధి పార్టీలోని కీలక నేతలను పార్టీ లోకి తీసుకొని ఇంకా బలంగా గెలుపు దిశగా ముందుకు వెళ్తున్నారు. ఇటు జనసేన పార్టీ మాత్రం మూడు గ్రూపులుగా విడిపోయి ఎవరికి వారు తమకు టికెట్ అంటే తమకే టికెట్ అంటూ గొడవలు పడుతూ తిరుగుతున్నారు. చూస్తుంటే ఇక్కడ జనసేన ఎన్నికల కంటే ముందుగానే చేతులెత్తేసేలా ఉంది.