సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా వేణుంబాక విజయసాయిరెడ్డిని ప్రకటించగానే.. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నా పోటీ చేయడం ఇదే మొదటిసారి. ఎలా చేస్తాడోనని వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణుల్లో కొంత అనుమానం ఉండేది. కానీ కొద్దిరోజులకే ఆయన తన పనితీరుతో అందరి మనసులను గెలుచుకున్నారు. నెల్లూరుకు వచ్చిన మొదటి రోజు నుంచి తనదైన శైలిలో ముందుకెళ్తున్నారు.
జిల్లాలోని ముత్తుకూరు మండలానికి చెందిన విజయసాయిరెడ్డి గతంలో అనేకసార్లు నెల్లూరుకు వచ్చారు. కానీ ఈసారి చాలా ప్రత్యేకం. పుట్టినగడ్డకు సేవ చేసే అవకాశాన్ని జగన్ కల్పించారు. అధినేత ఆదేశంతో ఆయన ఇక్కడికి రావడం.. క్యాంప్ కార్యాలయం పెట్టడం.. నామినేషన్ వేయడం.. చకచకా జరిగిపోయింది. గతంలో పోటీ చేసిన అనుభవం లేదని పెదవి విరిచిన వారే ప్రస్తుతం ఆయన జోష్‌కు ఫిదా అవుతున్నారు.
విజయసాయిరెడ్డి చాలాకాలంగా రాజ్యసభసభ్యుడిగా ఉన్నారు. దీంతో జాతీయ రాజకీయాలపై పట్టు ఉంది. ఢిల్లీ స్థాయిలో విస్తృతమైన పరిచయాలున్నాయి. ఇవే జిల్లా అభివృద్ధికి దోహదం చేయనున్నాయి. టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి వద్ద వేల కోట్ల రూపాయలున్నాయి. ఆయన డబ్బు ముందు చాలా కష్టమనే మాటలు వినిపించినా విజయసాయిరెడ్డి జనంతో మమేకమవుతున్న వైనాన్ని చూసి అందరూ వైఎస్సార్సీపీకే జై కొడుతున్నారు. వేమిరెడ్డికి ప్రజా బలం లేదు. దేశ, విదేశాల్లో వ్యాపారాలున్నాయి. సామాన్యులకు అందుబాటులో ఉండే వ్యక్తి కాదు. ఎన్నికలు కాబట్టి కొంతమేర అవకాశమున్నా సాధారణ రోజుల్లో అయితే టీడీపీ నేతలకే ఆయన్ను కలవడం సాధ్యం కాదు. ఎప్పుడు ఎక్కడుంటారో తెలియదు. దీనికితోడు చుట్టూ ఉండే కోటరీ దగ్గరకు కూడా వెళ్లనివ్వదు. ఈ నేపథ్యంలో ఎటువంటి వ్యాపారులు లేని, కేవలం రాజకీయాలే వ్యాపకంగా ఉన్న విజయసాయిరెడ్డి పట్ల ప్రజల్లో సానుభూతి రోజురోజుకు పెరుగుతోందని పొలిటికల్ సర్కిల్లో ప్రచారం ఉంది.
రాజ్యసభసభ్యుడు కదా.. ఇక్కడ చాలాకాలం లేడు. స్థానిక విషయాలు ఈయనకు ఏం తెలుసుంటాయని విజయసాయిరెడ్డి విషయంలో పలువురు భావించారు. కానీ లోకల్ నాయకుల కంటే కాస్త ఎక్కువే ఆయనకు తెలుసని ప్రసంగాల ద్వారా స్పష్టమవుతోంది. ఉదయం నిద్ర లేచింది మొదలు నెల్లూరు పార్లమెంట్ పరిధిలో పర్యటనలు, నేతలతో మీటింగ్‌లు, చేరికలు, ఎన్నికల వ్యూహాలతో బిజీబిజీగా ఉంటున్నారు. మరోవైపు మార్నింగ్ వాక్‌లతో ప్రజలతో మమేకమై సమస్యలు తెలుసుకుంటున్నారు. జిల్లా విషయంలో తనకు విజన్ ఉన్నట్లు విజయసాయిరెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ప్రత్యేక డాక్యుమెంట్ తయారు చేసి తన పరిచయాలను ఉపయోగించి పనులు చేస్తానని హామీ ఇచ్చారు. విజయసాయిరెడ్డి రాకతో వైఎస్సార్సీపీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. రానున్న రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది.
– వీకే..