కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే వర్మకి తన అనుచరుల నుండే చుక్కెదురైంది. ఇంతకాలం వర్మని కంటికి రెప్పలా కాపాడుకుంటూ నీడలా నడిచిన కార్యకర్తల నుండే వ్యతిరేకత మొదలైంది. ఒక రకంగా పిఠాపురం నియోజకవర్గంలో వర్మ అనుచరులు టిడిపి కార్యకర్తలు ఎవ్వరు కూడా వర్మ నిర్ణయంతో సంతోషంగా ఉన్నట్లు కనిపించడం లేదు. తమ అభిమాన నాయకుడికి టికెట్ వస్తుందని, మేమంతా ఆయన వెనుక ఉండి గెలిపించుకుంటామని కలలు కన్న కార్యకర్తల ఆశలు అడియాశలుగా మిగిలిపోయిన నేపథ్యంలో సొంత పార్టీ కార్యకర్తల నుంచే తీవ్ర వ్యతిరేకత మొదలైంది.
నిజానికి వర్మ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో తెలుగు దేశానికి బలమైన క్యాడర్ కలిగిన లీడర్.. స్వతంత్ర అభ్యర్థిగాను తనదైన అభిమాన గణాన్ని కలిగిన నాయకుడు. పొత్తులో భాగంగా కూటమి అభ్యర్థిగా జనసేన నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేయడం కోసం తాను ఎన్నికల నుండి తప్పుకున్నాడు. అయితే ఒకపక్క టీడీపీ కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా చంద్రబాబు మాటలు నమ్మి పవన్ కళ్యాణ్‌కి ఎమ్మెల్యే టికెట్‌ను త్యాగం చేసిన వర్మకి చేదు అనుభవమే ఎదురైంది. అది కూడా ఇంతకాలం గుండెల్లో పెట్టుకుని చూసుకున్న సొంత కార్యకర్తల నుండే కావడం సర్వత్ర చర్చనీయాంశమయింది.
నిన్నటి పిఠాపురం నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కోసం ప్రచారం చేయడానికి వెళ్లిన వర్మను నీకు సిగ్గులేదా? అంటూ ప్రశ్నలు సంధించారు. ఏం ఆశించి పవన్ కళ్యాణ్ కాళ్ల కింద నీ నాయకత్వాన్ని, నీపై మా అభిమానాన్ని తాకట్టు పెట్టావు అంటూ రాయడానికి వీలు లేని భాషలో బూతుల వర్షం కురిపించారు. ఆ విధంగా వర్మ సమక్షంలోనే పవన్ కళ్యాణ్ కి ఓటమి సంకేతాలు పంపించారు. దీంతో అవమానభారం తట్టుకోలేక వర్మ అక్కడ నుండి కారెక్కి వెళ్లిపోయారు. ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గ ప్రజల ఆగ్రహవేశాలు చూస్తుంటే వర్మ చేతిలో తన భవిష్యత్తును పెట్టిన పవన్ కళ్యాణ్ కి పంగనామాలు మిగిలే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.