పెన్షన్ల పంపిణీ విషయంపై తెలుగుదేశం, జనసేన, బీజేపీలు దుష్ప్రచారం చేస్తున్నట్లు తేలిపోయింది. గత టీడీపీ పాలనలో లబ్ధిదారులు డబ్బు అందుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక కొత్తవి ఇవ్వాలంటే జన్మభూమి కమిటీల సిఫార్సులు ఉండాల్సిందే. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చేది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించిన గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థలతో పింఛన్‌దారుల కష్టాలు తొలగిపోయిన విషయం తెలిసిందే. తుపాన్లు, వరదలు, కరోనా విపత్తు సమయంలోనూ ప్రతి నెలా ఒకటో తేదీన ఉదయాన్నే వలంటీర్లు పింఛన్ కానుకను లబ్ధిదారులకు అందజేసి అండగా నిలిచారు. అనారోగ్యంతో వేరే ప్రాంతాల్లోని హాస్పిటళ్లలో చికిత్స పొందుతుంటే సొంత ఖర్చులతో అక్కడికి వెళ్లి నగదు అందించి భరోసా కల్పించిన సందర్భాలున్నాయి.
జగన్ వల్ల పింఛన్లు, సంక్షేమ పథకాలను ప్రజల ముంగిటకు చేర్చడంలో వలంటీర్లు కీలకంగా వ్యవహరించారు. వారిని ప్రజానీకం తమ కుటుంబసభ్యుల్లా చూస్తోంది. దీంతో సేవా సేవకులపై ఎల్లో గ్యాంగ్ కక్ష కట్టింది. వీలు చిక్కినప్పుడల్లా విష కక్కుతూ వచ్చింది. వలంటీర్ల సేవల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే అక్కసుతో కుట్రలకు తెరతీసింది. ఎన్నికలను అడ్డం పెట్టుకుని వారిని పింఛన్లు, సంక్షేమ పథకాలకు దూరంగా ఉంచాలని ఈసీకి ఫిర్యాదు చేయించింది. దీంతో కమిషన్ వారి సేవలను ఆపేయించింది. ఈనెల నుంచి వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్యంతో మంచంలో ఉన్న వారు తదితరులు ఇంటి వద్దే పింఛన్లు అందుకునే అవకాశం లేకుండాపోయింది. టీడీపీ కక్ష కట్టి వలంటీర్ల సేవలు ప్రజలకు అందకుండా చేసింది. ఇకపై లబ్ధిదారులకు సచివాలయాల్లోనే పింఛన్ నగదు అందజేయనుండడంతో ఇకపై తమకు ఇబ్బందులు తప్పవని వారు వాపోతున్నారు. నడవలేని స్థితిలో ఉన్న తాము సచివాలయాలకు వెళ్లి నగదు ఎలా తీసుకోగలమని టీడీపీని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు దాష్టీకానికి తాము ఇబ్బందుల పాలవుతున్నామని మండిపడుతున్నారు.
టీడీపీ చేసిన పనికి అన్ని వర్గాల నుంచి విమర్శలు వచ్చాయి. దీంతో ఆత్మరక్షణలో చంద్రబాబు కొత్త నాటకానికి తెరతీశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం తమకు అనుకూలమైన కాంట్రాక్టర్లకు కోట్ల రూపాయలు ఇచ్చేసిందని, దీంతో ఖజానాలో డబ్బుల్లేక పింఛన్లను ఎగ్గొట్టేందుకు నాటకాలు ఆడుతోందని పచ్చ గ్యాంగ్ అబద్ధాలను ప్రచారం చేసింది. అంతటితో ఆగకుండా నారా వారి వాయిస్‌తో అందరికీ రికార్డెడ్ ఫోన్ కాల్స్ వెళ్లాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే సర్కారు కొద్దిరోజుల క్రితమే క్లారిటీగా చెప్పింది. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో బ్యాంకుల్లో పని అధికంగా ఉంటుందని, దీనికితోడు సెలవులు రావడంతో మూడో తేదీ నుంచి వలంటీర్ల ద్వారా పెన్షన్లు ఇస్తామని చెప్పింది. ఇంతలో బాబు జేబులో మనిషి నిమ్మగడ్డ రమేష్ పుణ్యాన ఈసీ వలంటీర్లను పక్కనపెట్టింది. అయినా ప్రభుత్వం వెనకడుగు వేయకుండా వెంటనే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి ముందు చెప్పినట్లుగానే 3వ తేదీ నుంచి నగదు పంపిణీని ప్రారంభించింది.
ఖజానాలో డబ్బు లేదని టీడీపీ ఆరోపిస్తోంది. కానీ ప్రభుత్వం బుధవారం నుంచి సచివాలయాల్లో పింఛన్లు పంపిణీని పక్కాగా మొదలుపెట్టడంతో వారి మాటలన్నీ అబద్ధాలేనని తేలిపోయింది. పెన్షన్లపై రాజకీయం చేసి వైఎస్సార్సీపీపై బురద చల్లి లబ్ధి పొందాలని ఎల్లో గ్యాంగ్ చూసింది. కానీ అవన్నీ బూమరాంగ్ అయ్యాయి. రాజమహేంద్రవరం సిటీ టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి అభ్యర్థి ఆదిరెడ్డి వాసు అవ్వాతాతలు, ఇతర లబ్ధిదారులకు వలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ జరగకుండా ఆపింది తామేనని గొప్పగా ప్రకటించుకున్నారు. దీనిని బట్టి ఈ కుట్రల వెనుక చంద్రబాబు ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. సొమ్ము కోసం సచివాలయాల వద్దకు వెళ్లిన లబ్ధిదారులు టీడీపీ అధినేత నిర్వాకంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత కాలం ఇంటి వద్దే పింఛన్ తీసుకున్నామని, వారి వల్ల ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరైతే బాబు గ్యాంగ్‌కు శాపనార్థాలు పెట్టారు.