TDP : ‘తెలుగుదేశం నాయకులతో వేగలేం. డబ్బు తినేస్తారు తప్ప పనులు చేయరు. వాళ్లని నేను నమ్మను. నా టీంతో ఎన్నికల పనులు చేయించుకుంటా..’ ప్రస్తుతం మాజీ మంత్రి పొంగూరు నారాయణ ఈ దారిలో ఉన్నారు.(TDP) చంద్రబాబు నాయుడికి ప్రియ శిష్యుడైన ఈ విద్యాసంస్థల అధిపతి 2014 ఎన్నికల సమయంలో టీడీపీ కోసం పనిచేశారు. ఎమ్మెల్సీ తీసుకుని మంత్రి అయ్యారు. 2019లో నెల్లూరు సిటీలో వందల కోట్ల రూపాయలు గుమ్మరించి పోటీ చేసినా జనం వైఎస్సార్సీపీ అభ్యర్థి అనిల్‌ను గెలిపించారు. 2024లోనూ ఇక్కడి నుంచే పోటీ చేయనున్నారు నారాయణ. అయితే తెలుగు తమ్ముళ్లను నమ్ముకుంటే నట్టేట ముంచేస్తారని ఎన్ టీం పేరిట యువతను నియమించుకుని నియోజకవర్గంలో తిప్పుతున్నారు.
2019 ఎన్నికల్లో టీడీపీ నాయకులు నా డబ్బు తిని పైసా పని కూడా చేయలేదు. అందుకే ఓడిపోయా. వాళ్లకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.. అని నారాయణ సన్నిహితుల వద్ద చెబుతుంటారు. ఎన్నికలయ్యాక నాలుగున్నర సంవత్సరాలపాటు నెల్లూరు సిటీకి దూరంగా ఉన్న ఆయన ఒక్కసారిగా వచ్చేసి టికెట్ నాకే కావాలన్నారు. అప్పటి వరకు పనిచేసిన వారిని కాదని బాబు కూడా తన శిష్యుడే పోటీ చేస్తాడని చెప్పారు. ఇక్కడ నుంచి నారాయణ పనితనం మొదలైంది. కొద్దిరోజులు మాత్రం టీడీపీ ముఖ్య నాయకుల చుట్టూ తిరిగి ఆ తర్వాత పట్టించుకోలేదు. రెండువేల మందికి పైగా యువతను ఎన్ టీంగా పెట్టుకున్నారు. వీరిలో తన కాలేజీల సిబ్బంది, విద్యార్థులు కూడా ఉన్నారు. ఒక్కోరికి రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు జీతం ఇస్తున్నట్లు తెలిసింది. వీరిపై అజమాయిషీ చేసే వారికి రూ.50 వేల మేర ముట్టజెబుతున్నారు. నారాయణ ముఖ్య అనుచరులు ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. డివిజన్లలో నాయకులు ఎన్ టీం మాటే వినాలి. వాళ్లకు తెలియకుండా ఏ కార్యక్రమం చేయకూడదు. జనాన్ని కలవకూడదు. టీం సభ్యులు వచ్చినప్పుడు మాత్రమే ఓటర్ల ఇళ్లకు వెళ్లాలి. ఓటర్ల జాబితా తదితర పనులు కూడా పార్టీతో సంబంధం లేకుండా నారాయణ టీం స్వయంగా చూసుకుంటోంది. డివిజన్లలో ఆయన పర్యటించినప్పుడు ఏ నాయకుడు రావాలో కూడా వారే నిర్దేశం చేస్తున్నారు. ఇటీవల రా కదలి రా సభ నెల్లూరులో జరగ్గా చంద్రబాబు వచ్చారు. దీని జన సమీకరణ కూడా ఎన్ టీం చేసింది. నాయకులు వాళ్ల పక్కన నిలబడ్డారంతే.. ఆర్థిక సంబంధిత విషయాల్లో తమ్ముళ్లను నారాయణ పూర్తిగా నమ్మడం లేదు. అందుకే ప్రతి పనికి తన జీతగాళ్లని ముందుకు తెస్తున్నాడని ప్రచారం జరుగుతోంది.
టీంకు ప్రజల నుంచి చీవాట్లు
ఓటర్ల ఇళ్లకు వెళ్తున్న ఎన్ టీంకు చీవాట్లు పడుతున్నాయి. ఇన్నేళ్లు నారాయణ ఎక్కడికి వెళ్లాడని జనం ప్రశ్నిస్తున్నారు. వారికి సమాధానం చెప్పలేక టీం తల పట్టుకుంటోంది. ఒక్కోసారి ఓటర్లపై రివర్స్ అవుతున్న సంఘటలు జరుగుతున్నాయి. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. జనంతో టచ్‌లో ఉండేది మేమని, టీంను ముందు పెట్టి పంపిస్తే ఇలాగే ఉంటుందని నాయకులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు పొత్తులో ఉన్న జనసేనను కూడా నారాయణ పట్టించుకోవడం లేదు. ఆ పార్టీని కలుపుకోకపోవడంతో వాళ్లంతా గుర్రుగా ఉన్నారు.
అందుబాటులో ఉండడు
నారాయణ సామాన్యులకు అందుబాటులో ఉండరు. 2014 సంవత్సరానికి ముందు ఆయన్ను నెల్లూరులో చూసిన వాళ్లు చాలా తక్కువ. మంత్రి అయ్యాక అడపాదడపా కనిపించేవారు. అయితే అప్పుడు కూడా ముఖ్య నాయకులకే దర్శనభాగ్యం కల్పించేవారు. తెలుగుదేశం కార్యకర్తలు, ద్వితీయశ్రేణి నాయకులు, ప్రజలు నారాయణను కలవలేకపోయారు. సభ, సమావేశాల్లోనూ కష్టంగానే ఉండేది. హడావుడిగా వచ్చి వెళ్లిపోయేవారు. 2019లో ఓడిపోయాక అయితే అసలు కనిపించలేదు. ఎన్నికలకు ఆరునెలల ముందు వచ్చి హంగామా చేస్తున్నారు. అది కూడా సొంత పార్టీ నేతలను నమ్మకండా.. అలాగే డివిజన్ నాయకులతో సంబంధం లేకుండా నారాయణ తన భార్య, పిల్లల్ని కాపు సామజికవర్గానికి చెందిన వారి ఇళ్లకు పంపి సపోర్ట్ అడిగిస్తున్నారు. ఇందులోనూ ఎన్ టీందే కీలకపాత్ర. ఇప్పుడు తను కలవాలి అనుకున్న నేతల్ని మాత్రమే కలుస్తున్నారు. మిగిలిగిన వారు తన మనుషులతో మాట్లాడుకోవాల్సిందే. కొందరు నాయకులు అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని అనుకున్నా పార్టీకి ఆర్థిక స్తంభమైన వ్యక్తిని ఏమి అనరని మిన్నకుండిపోయారు. ఈ పరిమాణాలన్నీ చూస్తే ఈసారి నారాయణకు తెలుగు తమ్ముళ్లే షాక్ ఇచ్చే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
– వీకే..