175 కి 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా సీఎం జగన్ పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్ నిరాకరించడం, మరికొందరికి స్థానభ్రంశం కలిగించడం వంటి పలు సంచలన నిర్ణయాలకు కూడా వెనుకాడటం లేదు. కానీ ఇదే అంశంపై బురద జల్లేందుకు దళితులకు సీఎం జగన్ అన్యాయం చేస్తున్నాడంటూ రామోజీ కొత్త రాగం ఎత్తుకున్నాడు.
వాస్తవానికి అంతర్గత సర్వేల నివేదికల ప్రకారం కొన్ని సీట్లలో అభ్యర్థులను తప్పకుండ మార్చాల్సిన పరిస్థితి సీఎం జగన్ కి ఏర్పడింది. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా సీట్ల మార్పుకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో కొందరు దళిత అభ్యర్థులకు సీట్లు నిరాకరించి అదే సామజిక వర్గానికి చెందిన వారికి సీట్లను కేటాయిస్తున్నారు. ఈ విషయం దాచిపెట్టి దళితులకు అన్యాయం చేస్తున్నాడంటూ రామోజీ విష ప్రచారం చేయడం ప్రజలంతా ఖండించాల్సిన విషయం. దళితులకు సీట్లు మార్చి దళితులకే కదా ఇచ్చేది. కానీ రామోజీ మాత్రం దళితుల సీట్లకు సీఎం జగన్ ఎగనామం పెడుతున్నట్లు రాతలు రాయడం ఆయనలో సీఎం జగన్ పై ఉన్న ద్వేషానికి ఉదాహరణగా చెప్పొచ్చు.
సీఎం జగన్ చేసిన మార్పుల్లో భాగంగా రెడ్డి సామాజిక వర్గం నుండి ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు నిరాకరించడం జరిగింది. వీరిలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళరామకృష్ణారెడ్డి, కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఉన్నారు. గతంలో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్ర శేఖర్ రెడ్డికి కూడా సీట్ ఇవ్వడానికి సీఎం జగన్ నిరాకరించారు. కానీ ఈనాడు మాత్రం ఈ నిజాలను మసిపూసి మారేడుకాయ చేసే క్రమంలో ప్రస్తావించకుండా జగన్ కేవలం దళితులకు బీసీలకు అన్యాయం చేస్తున్నాడంటూ కొత్త రాగం ఎత్తుకుంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోకంటే సీఎం జగన్ పాలనలోనే దళితులు బీసీలకు ఎక్కువ పదవులు దక్కాయి. ఈ వాస్తవాన్ని మాత్రం రామోజీ ఎప్పటికీ రాయడు. దళిత, బీసీలకు ఎవరి పాలనలో ముఖ్య పదవులు దక్కాయో పరిశీలిస్తే
ముఖ్యమైన పదవులు ఎవరి పాలనలో ఎన్ని
మంత్రి పదవులు
చంద్రబాబు పాలనలో 8 మంది బీసీలకు మంత్రి పదవులు దక్కితే జగన్ పాలనలో 11 మంది బీసీలకు మంత్రి పదవులు దక్కాయి. బాబు పాలనలో కేవలం ఇద్దరు దళితులకు మంత్రి పదవులు కేటాయిస్తే జగన్ పాలనలో ఐదుగురు దళితులకు మంత్రి పదవుల్లో స్థానం ఇచ్చారు.
స్పీకర్
చంద్రబాబు పాలనలో కమ్మ సామజిక వర్గానికి చెందిన కోడెల శివ ప్రసాదరావుకి స్పీకర్ పదవిని కట్టబెడితే, జగన్ పాలనలో మాత్రం
బీసీ అయిన తమ్మినేని సీతారాంకి స్పీకర్ పదవి ఇచ్చారు.
శాసనమండలి ఛైర్మన్గా రాష్ట్ర చరిత్రలో తొలి సారిగా దళిత వర్గానికి చెందిన కొయ్యే మోషేన్ రాజును ఎంపిక చేయడం గమనిస్తే, జగన్ పాలనలో దళితులకు ఎంత ప్రాధాన్యత నిస్తున్నారో అర్థం అవుతుంది.
రాజ్యసభ ఎంపీ
చంద్రబాబు పాలనలో రాజ్యసభ ఎంపీలుగా బీసీల ప్రాతినిథ్యం సున్న.. అంటే ఒక్క బీసీని కూడా చంద్రబాబు రాజ్యసభకు పంపలేదు. కానీ జగన్ పాలనలో రాజ్యసభ ఎంపీలుగా నలుగురు బీసీలు ఎంపికయ్యారు.
ఎమ్మెల్సీలు
చంద్రబాబు పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలనుండి 18 మందిని ఎమ్మెల్సీలుగా చేయగా జగన్ పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల నుండి 29 మందిని ఎమ్మెల్సీలను చేసారు.
జగన్ పాలనలో ఐదుగురు ఉప ముఖ్యమంత్రులను నియమిస్తే, అందులో నలుగురు (80 శాతం) బడుగు బలహీన వర్గాలకు చెందిన నేతలే కావడం గమనార్హం.
జగన్ పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు పెద్ద పీట
జగన్ పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు పెద్ద పీట వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులలో బీసీలకే 6 (46 శాతం) ఇవ్వడంతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు కలిపి ఏకంగా 9 జడ్పీ ఛైర్మన్ పదవులు(69 శాతం) ఇచ్చారు. రాష్ట్రంలో 14 మున్సిపల్ కార్పొరేషన్లలో వైఎస్సార్సీపీ విజయం సాధించగా 14 మేయర్ పదవుల్లో బీసీలకు ఏకంగా 9 పదవులు (64 శాతం) ఇచ్చారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను కలుపుకుంటే 14 కార్పొరేషన్ మేయర్ పదవులకుగానూ 12 పదవులు (86 శాతం) వారికే ఇచ్చారు
87 మున్సిపాల్టీలలో ఎన్నికలు జరిగితే అందులో 84 మున్సిపాల్టీలలో వైఎస్సార్సీపీ విజయం సాధించింది.
ఇందులో 44 మున్సిపల్ ఛైర్మన్ పదవులను బీసీలకు(53 శాతం)ఇవ్వడం గమనార్హం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలవర్గాలకు కలిపి 58 మున్సిపల్ ఛైర్మన్ పదవులు(69 శాతం) ఇచ్చారు.
వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 ఛైర్మన్ పదవులలో 53 పదవులు (39శాతం) బీసీలకే ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కలుపుకుంటే 137 పదవుల్లో 79 పదవులు(58 శాతం) ఆ వర్గాలకే ఇవ్వడం విశేషం.
137 ప్రభుత్వ కార్పొరేషన్ పదవులకు సంబంధించి 484 నామినేటెడ్ డైరెక్టర్ పదవులుంటే అందులో 201 పదవులు బీసీలకు(41 శాతం) ఇచ్చారు. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కలుపుకుంటే 484 పదవుల్లో 280 పదవులు(58 శాతం) ఆ వర్గాలకే ఇచ్చారు.
బీసీ వర్గాలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు, ఎస్సీలకు ప్రత్యేకంగా 3 కార్పొరేషన్లు, ఎస్టీలకు 1 కార్పొరేషన్ ఏర్పాటు చేసి.. వాటికి ఆ వర్గాల వారినే ఛైర్మన్లుగా నియమించారు. ఆ కార్పొరేషన్లలో ఆయా వర్గాలకు 684 డైరెక్టర్ పదవులూ ఇచ్చారు.
ఆలయ బోర్టులు, ఆలయ ఛైర్మన్ పదవుల్లో సగ భాగం బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకే ఇచ్చారు. దాదాపుగా 7,006 ఆలయ బోర్డు మెంబర్ల పదవుల్లో 3,503… అంటే సగం బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకే ఇచ్చారు.
ఇలా జగన్ సర్కారు అన్ని పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు పెద్ద పీట వేస్తుంటే, కడుపు మంటతో కాకమ్మ కథలు చెప్పడం రామోజీకే చెల్లింది. ఇలా అసత్య కథనాలను ప్రచురిస్తూ ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్న రామోజీకి ప్రజలు బుద్ది చెప్పే రోజులు త్వరలోనే వస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.