‘రాష్ట్రంలో ఐదేళ్లుగా అభివృద్ధి జరగడం లేదు. అన్ని విధాలుగా నాశనమైంది. గాడిలో పెట్టడానికి కేంద్ర సహకారం అవసరం. అందుకే ఎన్డీఏలో చేరా. నాకు అవకాశం ఇవ్వండి. ఏపీని బాగు చేస్తా’ ఎన్నికల సభల్లో తెలుగుదేశం అధ్యక్షుడు చెబుతున్న మాటలివి. ఆయనకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి వంత పాడుతున్నారు. కానీ కేంద్రం, రాష్ట్రం అధికారికంగా విడుదల చేసిన గణాంకాలు చూస్తే వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో అభివృద్ధి పరుగులు పెట్టిందని ఇట్టే అర్థమవుతుంది. బాబు హయానికి.. ఇప్పటికి చాలా వ్యత్యాసం ఉందని, టీడీపీ మాటలు కట్టు కథలని తేలుతోంది.
ఏ రాష్ట్రానికైనా జీఎస్డీపీ (రాష్ట్ర స్థూల ఉత్పత్తి), తలసరి ఆదాయం, పరిశ్రమల వాటా అనేవి అభివృద్ధి సూచికలు. వీటి ఆధారంగా పురోగతిని లెక్కిస్తారు. 2014 – 19 తెలుగుదేశం పాలన, 2019 – 24 వైఎస్సార్ కాంగ్రెస్ పాలనలో పై మూడింటింకి సంబంధించిన గణాంకాలు చూస్తే ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో తెలిసిపోతుంది.
చంద్రబాబు 2019 మేలో సీఎం కుర్చీ దిగారు. ఆయన హయాంలో 2018–19లోS జీఎస్డీపీ రూ.8.73 లక్షల కోట్లు. అదే జగన్ పాలనను తీసుకుంటే 2022–23లో రూ.13.17 లక్షల కోట్లుగా ఉంది. అంటే నాలుగు సంవత్సరాల్లో 50 శాతం పెరుగుదల నమోదైంది.
ఇక తలసరి ఆదాయం విషయానికొస్తే 2018 – 19లో రూ.1,54,031 ఉండగా 2022 – 23 నాటిని ఆ మొత్తం రూ.2,19,518కి చేరింది. జగన్ ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితమేనని లెక్కలు చెబుతున్నాయి. 2019›– 20లో రాష్ట్ర జీఎస్డీపీలో పరిశ్రమల వాటా 22.04 శాతం ఉంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 23.36 శాతానికి చేరింది. జగన్ తీసుకొచ్చిన పాలసీల వల్లే పరిశ్రమల సంఖ్య పెరిగిందనేది నిజం. ఈ అంశాలను పరిగణలోకి తీసుకోకుండా ఎల్లో గ్యాంగ్ నిత్యం దుష్ప్రచారం చేస్తోంది. గాలి లెక్కలు చెబుతూ ప్రజలను మాయ చేయాలని చూస్తోంది.
ఇక ఉద్యోగాల విషయానికొస్తే చంద్రబాబు పాలనలో కేవలం 34 వేల గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2.21 లక్షలు ఇచ్చింది. కొన్ని నోటిఫికేషన్స్ ఎన్నికల షెడ్యూల్‌కు ముందే ఇచ్చింది. అవి కూడా భర్తీ అయితే ఆ సంఖ్య 2.50 లక్షలకు చేరుకోవచ్చు. జగన్ పాలనలో 16 లక్షల ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు వచ్చాయని గతేడాది డిసెంబర్ 21వ తేదీన కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి ప్రకటించారు. ఇందులో చాలా వరకు గణాంకాలను టీడీపీతో పొత్తులో ఉన్న ఎన్డీఏ ప్రకటించినవే. మరి వాటిని నమ్మేది లేదని తెలుగు తమ్ముళ్లంటే వారికి మించిన వెర్రివాళ్లు మరొకరు ఉండరు.