చంద్రబాబుకు ఎవరైనా ఒకటే.. తను, తన పుత్రరత్నం బాగుంటే చాలు. ఇంకెవరు ఏమైపోయినా పట్టించుకోడు. సమయాన్ని బట్టి వాడుకుని వదిలేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.. నాడు పెద్ద ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి సీఎం పదవి లాక్కున్నాడు. నేడు తన కొడుకు కోసం జూనియర్ ఎన్టీఆర్‌ను తీవ్రంగా అవమానిస్తున్నాడు. రామారావు వర్ధంతి సందర్భంగా గురువారం జూనియర్ ఫ్లెక్సీల విషయంలో బాలకృష్ణ చేసిన రచ్చ అంతా ఇంత కాదు. దీనిపై అతని అభిమానులు ఆవేదనకు గురవుతున్నారు. ఈ ఘటనను చూసిన వారికి బాబు దృష్టిలో ఇద్దరు ఎన్టీఆర్‌లు కరివేపాకునేని అనిపించక మానదు.
పెద్ద ఎన్టీఆర్‌ను అలా వదిలేశాడు
బాబు మొదటిసారి సీఎం అయ్యాక పెద్ద ఎన్టీఆర్ పేరు తలుచుకునేందుకు కూడా ఇష్టపడలేదు. తమకు ఆయన అవసరం లేదని ఆనాడు పత్రికా ముఖంగా ప్రకటించారు. కార్యాలయాల్లో ఫొటోలు తీసేయించారు. ఓసారి మహానాడులో కూడా ఫొటో పెట్టకపోతే హరికృష్ణ బాధపడ్డారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఫొటో పెట్టాల్సి వచ్చింది. అయితే ఎన్నికల్లో ఓటమి రుచి చూశాక బాబుకు రామారావుతో పని పడింది. అప్పటి నుంచి మామ గొప్పోడని రాగం అందుకున్నారు. వర్ధంతి, జయంతి కార్యక్రమాల పేరుతో హంగామా చేశారు. ఎల్లో మీడియా సాయంతో పాత విషయాలను జనం మర్చిపోయలా చేసేందుకు ప్రయత్నించారు.
జూనియర్‌తో ఇలా..
జూనియర్ ఎన్టీఆర్‌ను నందమూరి కుటుంబం ఏనాడు పట్టించుకోలేదు. అతను సినిమా హీరోగా ఎదిగాక చంద్రబాబు తెలివిగా వ్యవహరించి వాడుకున్నాడు. 2009 ఎన్నికల్లో ప్రచారం చేయించాడు. అయితే యాక్సిడెంట్ జరగడంతో అతను హాస్పిటల్లో చేరాడు. అక్కడి నుంచి వీడియో సందేశాలిచ్చాడు. 2014లో బాబు గెలిచాక జూనియర్ పేరు వినపకుండా గట్టి చర్యలు తీసుకున్నారు. పార్టీలో ఎవరైనా అతనికి అనుకూలంగా మాట్లాడితే పిలిచి గట్టి వార్నింగ్ ఇచ్చేవారు. లోకేశ్‌ను ఎమ్మెల్సీ చేసి మరీ మంత్రి పదవి ఇచ్చి నా తర్వాత పార్టీలో అతనేనని సంకేతాలు ఇచ్చాడు. జూనియర్, అతని అన్న కల్యాణ్‌రామ్ సినిమాల విషయంలో తెలుగుదేశం దారుణంగా వ్యవహరించింది. 2024 ఎన్నికల కోసం బాబు ఇంటి బిడ్డ అయిన జూనియర్‌ను కాదని పవన్ కళ్యాణ్‌ను దగ్గర చేసుకోవడాన్ని సీనియర్ టీడీపీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
నాడు కంటతడి
ఎన్టీఆర్ పేరుతో చంద్రబాబుకు అవసరం పడ్డాక ఆయన జయంతి, వర్ధంతి సందర్భంగా ఘాట్ వద్ద ఏర్పాట్లను తెలుగుదేశం పార్టీ చేసేది. వేడుకలు నిర్వహించేది. అయితే 2019లో జరిగిన ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయాక ఆ పార్టీ ఘాట్ వద్ద ఏర్పాట్ల గురించి పట్టించుకోలేదు. నిర్లక్ష్యంగా వదిలేసింది. అదే ఏడాది మే 28వ తేదీన తాత జయంతి సందర్భంగా ఘాట్ వద్దకు జూనియర్ తన అన్నతో కలిసి వెళ్లి పరిస్థితులను చూసి కంటతడి పెట్టుకున్నారు. సమాధిని పూలతో అలంకరించలేదు. చెత్తను శుభ్రం చేయలేదు. తాత జయంతిని తెలుగుదేశం పార్టీ మరిచిపోవడంతో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. దీంతో ఆయన పూలను తెప్పించి అభిమానులతో కలిసి అలంకరించారు. ఇకనుంచి తానే ఏర్పాట్లు చేస్తానని ప్రకటించారు.
నేడు తీరని అవమానం
పెద్ద రామారావు వర్ధంతి రోజున ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్‌కు తీవ్ర అవమానం జరిగింది. గురువారం జూనియర్ తన అన్నతో కలిసి తెల్లవారుజామునే ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. తర్వాత వచ్చిన బాలయ్య జూనియర్ ఫ్లెక్సీలు తీసేయాలని ఆదేశించాడు. ఎన్నికలు సమీపించిన తరుణంలో బాబు అండ్ కో ఇలా చేయడం టీడీపీలో కలకలం రేపింది. నాడు పెద్ద ఎన్టీఆర్‌ను వద్దన్నట్లుగా నేడు జూనియర్ ఎన్టీఆర్ తమకు అవసరం లేదని వారు చెప్పకనే చెప్పారు. దీంతో అభిమానులు ఇద్దరు రామారావులను చంద్రబాబు వాడుకుని వదిలేశాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.