గ్లాసు అంటే సింబల్ కాదు సైన్యం, గాజు పగిలే కొద్దీ పదును ఎక్కుద్ది . ఇది పవన్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా టీజర్ లో ఓ డైలాగ్. ఎన్నికల వేళ జన సైనికులలో ఊపు తేవడానికే టీజర్ లో ఈ డైలాగ్స్ పెట్టారనేది తెలిసిన విషయమే. అయితే ఈ డైలాగ్ నుండి జనసేన రెబెల్స్ కూడా స్ఫూర్తి పొందడం, ఆ స్ఫూర్తితో మే 13 న జరగబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం పలువురు జనసేన రెబల్స్ గ్లాసు గుర్తు దక్కించుకోవడం కూటమి పార్టీలు బీజేపీ, టీడీపీ లకు కొత్త తలనొప్పులు తెచ్చి పెట్టింది.
2019 సార్వత్రిక ఎన్నికల్లో 136 స్థానాల్లో పోటీ చేసి 120 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిన జనసేన ఆ తర్వాత జరిగిన పలు ఉప ఎన్నికల్లో పోటీ చేయకుండా అలసత్వం వహించడంతో ఈసీ నిబంధనల ప్రకారం గ్లాసు గుర్తు జనసేనకు రద్దయ్యి కామన్ సింబల్ లిస్టులో చేరిపోయింది.
అయితే 24 లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని జనసేన పార్టీ తరుపున పోటీ చేసే అభ్యర్థులు అందరికీ గ్లాసు గుర్తు కేటాయించాలని కోర్టు కెళ్ళి జనసేన తెచ్చుకొన్న ఆదేశాల మేరకు ఆ పార్టీ పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాల్లో గ్లాస్ గుర్తుని కేటాయించింది ఈసీ.
ఇంతవరకూ బాగానే ఉన్నా అసలు ట్విస్ట్ నిన్న నామినేషన్ల గడువు ముగిసిన తర్వాత మొదలైంది. జనసేన పోటీ చేస్తున్న స్థానాలు పోగా మిగిలిన చోట్ల ఫ్రీ సింబల్ గా ఉన్న గ్లాసు గుర్తును పోటీ పడి దక్కించుకొన్నారు పలువురు జనసేన రెబెల్స్, వీరితో పాటు టీడీపీ రెబెల్స్, స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీ పడడంతో కడపటి వార్తలు అందేసరికి షుమారు 18 మంది ఎమ్మెల్యే, 3 ఎంపీ స్థానాల్లో రెబెల్, స్వతంత్ర అభ్యర్థులకి గ్లాసు గుర్తుని కేటాయించింది ఎన్నికల కమిషన్ .
ఈ పరిణామంతో ఉలిక్కి పడటం టీడీపీ, బీజేపీ వంతు అయ్యింది. జనసేన పోటీ చేసే స్థానాల్లో ఆ పార్టీ అభిమానుల ఓట్లు గ్లాసు గుర్తుకే పడతాయి కాబట్టి సేనానికి నష్టమేం లేదు. కానీ కూటమిలో మిగతా పార్టీలైన టీడీపీ, బీజేపీలు పోటీ చేసే స్థానాల్లో ఇలా టీడీపీ, జనసేన రెబెల్స్ గ్లాసు గుర్తు పై బరిలో ఉండడంతో జనసేన అభిమానుల ఓట్లు గ్లాసు గుర్తు పై పడి తమకి నష్టం జరుగుతుందని ఆయా స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
ఈ రెబెల్స్, స్వతంత్రుల పోటితో బలైన వారిలో బీజేపీ, టీడీపీ దిగ్గజాలు ఉండటం మరో విశేషం, బీజేపీ తరుపున అనకాపల్లిలో పోటీ చేస్తున్న సీఎం రమేష్ పై , రాజమండ్రిలో పోటీ చేస్తున్న పురందేశ్వరి పై పోటీ చేస్తున్న రెబెల్స్ గ్లాసు గుర్తు దక్కించుకోగా, టీడీపీ పోటీ చేస్తున్న విజయవాడ పార్లమెంట్ లో కూడా ఓ స్వతంత్ర అభ్యర్థి గ్లాసుని కైవసం చేసుకొన్నాడు.
ఇహ ఎమ్మెల్యే స్థానాల్లో చూస్తే ప్రాంతీయ పార్టీ టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పై పోటీ చేస్తున్న ఒక స్వతంత్ర అభ్యర్థి గ్లాసు గుర్తు దక్కించుకోగా, ఉభయ గోదావరి జిల్లాల్లో పెద్దాపురం, కాకినాడ సిటీ, రామచంద్రాపురం, అమలాపురం, ముమ్మడివరం, కొత్తపేట, మండపేట, కొవ్వూరు స్థానాల్లో జనసేన, టీడీపీ రెబల్స్ కు గ్లాసు గుర్తు కేటాయించారు. ఇతర జిల్లాల్లో చూస్తే జగ్గంపేట జనసేన రెబెల్ పాఠంశెట్టి సూర్యచంద్రకి, విజయనగరం టీడీపీ రెబెల్ మీసాల గీతకి గ్లాసు గుర్తు దక్కగా, గన్నవరంలో వల్లభనేని వంశీ అనే స్వతంత్ర అభ్యర్థి గ్లాసు గుర్తు దక్కించుకొన్నాడు, ఇంకా విజయవాడ సెంట్రల్, టెక్కలి, బాపట్ల, శ్రీ కాళహస్తి, రేపల్లె నియోజకవర్గాల్లో కూడా టీడీపీ, జనసేన రెబెల్స్ గ్లాసు గుర్తు పొందడంతో టీడీపీ, బీజేపీ పార్టీల్లో కలవరం మొదలైంది.
ఈసి తుది లిస్టుని ప్రకటించిన తర్వాత ఇంకెంత మంది రెబెల్స్, స్వతంత్ర అభ్యర్థులు గ్లాసు గుర్తుతో కబడ్డీ ఆడానున్నారో తెలియ వస్తుంది, అప్పటి వరకూ వేచి చూడటమే .